14, అక్టోబర్ 2011, శుక్రవారం

బిజేపీవారి చాకలిపద్దు



 
కొంతకాలం క్రితం.., రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకోసం ఉద్యమాలు జరిగాయి కదా..! అప్పట్లో కర్నూల్‌, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేసారు.
 
సరిగ్గా, అప్పుడు దిగారు మాన్యశ్రీ ఎం. వెంకయ్యనాయుడుగారు...! ఈయనగారి గురించి చెప్పడానికేముందిలే అనుకోకండి..! నా దృష్టిలో అతిపెద్ద రాజకీయ కమెడియన్‌ ఆయనే..! అయితే, కొద్దికాలం క్రితం ఆ స్థానాన్ని మెగాస్టారుడు ఆక్రమించాడు. అదలా పక్కనబెట్టండి..! ఈ వెంకయ్యనాయుడుగారు ఏ మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో తెలీకుండా ఉంటారు. (మనలో మన మాట..! , ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పరువు తీసేస్తున్నాడు..!)
ఆ ఆందోళనలు జరుగుతున్న  సమయంలో, ఈయనగారు రాష్ట్రమంతా ( ఆందోళనలు జరుగుతున్న చోట అని గమనిక..) పర్యటించి, అందరితోనూ మాట్లాడి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ సారాంశం ఏంటంటే..
 
"రాష్ట్రంలో తక్షణమే, నాలుగు హైకోర్టు బెంచీలూ, ఒక సుప్రీం కోర్టు బెంచీ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం..!"
 
ఈ స్టేట్‌మెంట్‌ వినగానే నాకైతే నవ్వాగలేదు..! చాకలతను బట్టల పద్దు చెప్తున్నట్టు.." నాలుగు ఫేంట్లూ...!, ఐదు చొక్కాలూ...!, ఒక దుప్పటీ...!"...అనిపించింది. అప్పుడే అర్థమైంది.. బిజేపీ వారికి హైకోర్టూ, సుప్రీం కోర్టు బెంచీలు ఏర్పాటు చేయడం దగ్గర్నుంచీ, "చిన్న రాష్ట్రాలు "  ఏర్పాటు చేయడం వరకూ, ఏదైనా సరే "చాకలి పద్దు"..అంత ఈజీ..!
 
బిజేపీవారు అధికారంలోకి వచ్చినపుడు "చాకలి పద్దు"..చట్టం/ కమిటీ తెచ్చి, అడిగివాడికి అడిగినట్టుగా, ప్రత్యేక రాష్ట్రాలనీ, బెంచీలనీ, కుర్చీలనీ, సోఫాలనీ ఏర్పాటు చేస్తారు..!
 
ఇందుమూలంగా యావన్మంది బ్లాగ్ప్రజానీకానికీ  తెలియజేయునది ఏమనగా..
"మీకు పత్యేక రాష్ట్రం గానీ, బెంచీ గానీ కావల్సి వచ్చినయెడల, తక్షణమే ఆస్థాన కమెడియన్‌ వెంకయ్యనాయుడు గార్కిగానీ, ఆస్థాన "లేఖ"కుడు దత్తాత్రేయగారికి గానీ వినతి పత్రాలు సమర్పించుకోవలసింది"గా తెలియజేయడమైనది..
ఇప్పటికే, ఒక పద్దువేయడం జరిగింది..! ఆ పద్దులో ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘర్‌ అనే రాష్ట్రాలనివ్వడం జరిగింది.. ఇంకో పద్దు కూడా రెడీగా ఉంది.. అది ఈ పోస్ట్‌ లో ఒకసారి రాయడం జరిగింది. మీక్కూడా ఇంకేమైనా "ప్రత్యేక" డిమాండ్లు ఉంటే, బిజేపీవారిని సంప్రదించండి...!
 
నాకైతే, ప్రత్యేక కాకినాడ రాష్ట్రం కావాలని కోరిక ఉంది. అది ముందొక పోస్ట్‌లో వెలిబుచ్చడం జరిగింది. ఇంకా వీలైతే, ప్రత్యేక కాకినాడ దేశం కూడా ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఇదిగో..! అందరికీ, ఇప్పుడే చెప్పేస్తున్నాను, కాకినాడ దేశం వచ్చేస్తే, "రాజ్యాంగ కమిటీ"కి నేనే అధ్యక్షుణ్ణి..! వీలైతే మొదటి రాష్ట్రపతి కూడా..! ఇప్పుడే కర్చీఫ్‌ వేసేసాను.. ఆ సీటు నాదీ..!
 
జై కాకినాడ
 
జై బీజేపీ
 
జై చాకలిపద్దు చట్టం/ కమిటీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి