12, ఆగస్టు 2011, శుక్రవారం

కాకినాడ బాంబు కేసు

ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా బాంబు ప్రేలింది హైదరాబాద్‌లోనో, ఫాక్షనిస్టు గొడవలతో ఉండే రాయలసీమలోనో, రాజకీయ రాజధాని విజయవాడలోనో కాదు.. ప్రశాంతవాతావరణానికి మారుపేరైన కాకినాడలో..! మనలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సంఘటన గురించి తెలుసు. ఇందుకు ప్రధాన సూత్రధారి సామర్లకోటకి చెందిన ప్రతివాది భయంకర వెంకటాచారి..(భయంకరాచారి అని కూడా అంటారు ) .. అందుకు సంబంధిన వ్యాసాలు వికీపీడియా వ్యాసాలలోనూ, గూగుల్‌ శోధనలోనూ మనకు దొరుకుతాయి... అందులోని కొన్ని విషయాలనే నేను ఇక్కడ కాపీ పేస్ట్‌ చేయబోతున్నాను....

వినడానికి కొద్దిగా విచిత్రంగా ఉన్నా దేశచరిత్రలో ఎన్నో మలుపులకు, పరిణామాలకు కాకినాడ నాంది పలికింది.. అందులో ఒకటే ఈ "కాకినాడ బాంబు కేసు". మిగిలినవి వందేమాతరం గేయం పై ముస్లింల నిరసన, తెలంగాణ కి బిజెపి మద్దతు... మొదటిది దేశవిభజనకు కారణమైతే, రెండది రాష్ట్ర విభజనకు కారణం కాబోతోంది.. మిగిలిన వాటి గురించి తర్వాత రాస్తాను.. ప్రస్తుతం కాకినాడ బాంబు మన టాపిక్‌....

దీనికి ప్రధాన సూత్రధారి భయంకరాచారి అయితే, ప్రధాన లక్ష్యం డి ఎస్‌ పి ముస్తఫా అలీ ఖాన్‌..! ఇతనిపై జరిగిన హత్యాప్రయత్నమే "కాకినాడ బాంబు ప్రేలుడు"... దానికి సంబంధించిన లింకు ఇదిగో...!


నేను కాపీ చేస్తున్నది కూడా దీని నుంచే..! అందుకు ప్రేరేపించిన ఘటనలు కూడా కాపీ చేయడం జరిగింది..

వాడపల్లి కాల్పుల ఘటన:



1931 మార్చి 30 న వాడపల్లిలో పోలీసు కాల్పులు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి లో వెంకటేశ్వరస్వామి రథోత్సవం జరుగుతూండగా జరిగిన సంఘటన ఇది. రథంపై దేవుడి విగ్రహాలతో పాటు జాతీయ నాయకుల ఫోటోలను కూడా ఉంచి ఊరేగిస్తున్నారు. తహసీల్దారుతో సహా అక్కడికి చేరుకున్న డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్, వాటిని తొలగించమని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ప్రజలపై కాల్పులు జరపగా నలుగురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

సీతానగరం ఆశ్రమ ఘటన:



ఇక రెండోది 1932 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమంలో జరిగింది. సీతానగరం ఆశ్రమాన్ని మద్దూరి అన్నపూర్ణయ్య, మరికొందరి పర్యవేక్షణలో ఉంచి మిగిలినవారు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనేందుకు క్రొవ్విడి లింగరాజు నాయకత్వంలో కాకినాడ వెళ్ళారు. అప్పటికే - జనవరి 5న - ఆశ్రమం ప్రచురిస్తున్న "కాంగ్రెస్" పత్రికను చట్టవ్యతిరేకమైనదని ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ అక్కడికి చేరుకుని 'ఈ ఆశ్రమాన్ని చట్టవిరుద్ధమైనదని ప్రకటించాం. దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి' అని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ఆశ్రమవాసులపై విచ్చలవిడిగా లాఠీచార్జి చేసాడు. 75 ఏళ్ళ ముదుసలిని కూడా వదలకుండా అందరినీ అరెస్టు చేసాడు.


సామర్లకోటకు చెందిన ప్రతివాది భయంకరాచారిని ఈ సంఘటనలు కలచివేసాయి. సామర్లకోటలో పదవ తరగతి వరకూ చదివిన భయంకరాచారి విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాలలో ఇంటర్మీడియెట్ లో చేరి సగంలోనే ఆపేసాడు. విద్యార్థిగా ఉండగానే ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చదువు ఆపేసాక కొన్నాళ్ళు సీతానగరం ఆశ్రమంలో గడిపాడు. 19 ఏళ్ళ వయసులోనే లాహోరు కాంగ్రెసు సభలకు హాజరయ్యాడు. శాసనోల్లంఘనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1930 మేలో గురజనపల్లిలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ననుసరించి ఇతర నాయకులతో పాటు తానూ విడుదలయ్యాడు. కన్ననూరు, బళ్ళారి జైళ్ళలో ఉండగా లాహోరు కుట్ర కేసు నిందితులు, బెంగాలు విప్లవకారులతో సంపర్కంలోకి వచ్చాడు. వారి వద్ద నుండి బాంబులు తయారుచేసే పద్ధతులు నేర్చుకున్నాడు.


భయంకరాచారి విప్లవ వీరులను ఆరాధించాడు. సంపూర్ణ విప్లవమే సంపూర్ణ స్వరాజ్యం తెస్తుందని నమ్మాడు. గాంధీ అహింసా మార్గాన్ని వ్యతిరేకించాడు. ప్రజలను చైతన్యవంతులను చేసి విప్లవోద్యమంలోకి ఉరకాలని ఉద్బోధించాడు. "యువతను ఉరితీస్తూ, ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్ళు మూసుకుని కూర్చోలేదు. ఎదురుతిరిగి విప్లవించాలి. అందుకవసరమైన ఖర్చుల కోసం బ్యాంకులను దోచాలి.." అని అనేవాడు.


కాకినాడ బాంబు ఘటన:



ఉద్యమ నాయకులపై అన్యాయంగా లాఠీచార్జి జరిపిన డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు భయంకరాచారి. మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరిల నుండి బాంబు తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్. చారి అండ్ సన్స్ అనే ఓ బోగసు కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు కామేశ్వరశాస్త్రి అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.


1933 ఏప్రిల్ 6 న కాకినాడలోని ఒక చోటికి ముస్తఫా రానున్నాడని తెలిసికొన్న వీరు, బాంబులు తయారుచేసుకొని అక్కడ మాటు వేసారు. అయితే ముస్తఫా అక్కడికి రాలేదు. ఇద్దరూ నిరాశ చెంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. ఏప్రిల్ 14 న మళ్ళీ కాకినాడలోనే మరోచోట ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా ముస్తఫా వారనుకున్నట్టు రాలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మాటు వేసారు. మూడోసారి కూడా ముస్తఫా మాటు వైపు రాలేదు. ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు. వీళ్ళు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.


పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నాడు. వెంటనే దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టరుకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. పోలీసులు ఒకరొకరినే పట్టుకుంటూ వచ్చారు. సెప్టెంబరు 11 న భయంకరాచారిని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.


డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.



4 కామెంట్‌లు:

  1. అప్పట్లో కాంగ్రెస్ అహింస పేరుతో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నీరు గార్చడానికి ప్రయత్నించింది. కాంగ్రెస్‌ని ధిక్కరించినవాళ్ళు మన రాష్ట్రంలోనూ ఉండేవాళ్ళన్న మాట.

    రిప్లయితొలగించండి
  2. very good

    did you read the book history of east godavari by late husband of Dr chirajeevini kumari?

    it has very good info on various leaders of kakinada who participated in freedom struggle


    why cant you write on Sri Bulusu sambamurthy

    no doubt local people should take interest in recording local histories. at least in this internet medium.


    by the way i came here through a link in chaduvari blog on telangana issue

    nice blog and nice posts

    keep it up

    with best wishes

    bolloju baba

    రిప్లయితొలగించండి
  3. బొల్లోజు బాబాగారికి ధన్యవాదములు...! నా బ్లాగుని సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది..!
    మీరు చెప్పిన పుస్తకం నేనిప్పటి వరకూ చదవలేదు..! కాకినాడ వెళ్లినపుడు ప్రయత్నిస్తాను..!
    ఇంకపోతే, కాకినాడ గురించి రాసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి..
    1942లో జపాన్‌ వైమానిక దాడి..,
    పావులూరి మల్లన..ఇలాగన్నమాట..!
    వీటి గురించి పూర్తి సమాచారం నా దగ్గరలేక రాయలేదు. మీకు అందుబాటులో ఉన్నట్టైతే, తెలుపగలరు...

    రిప్లయితొలగించండి
  4. వీరి గురించి కొన్నీ విషయాలు బాగానే చెప్పారు. కానీ ఆయన విడుదల తో ఆపేశారు మీరు. నేను చదివిన విషయాలు ఇక్కడ రాస్తున్నాను.
    విడుదల తరువాత కూడా ఆయన ఉత్సాహంగానే మళ్ళీ స్వతంత్ర పోరాటం లో పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారిని అనుకరించారు.
    స్వాతంత్రం వచ్చాక రాజకీయాలు వదిలేసి సామర్లకోట వచ్చేసారు. తరువాత ఆర్ధికంగా ఇబ్బందులు పడితే, నెహ్రు గారి జోక్యం తో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. తరువాత పెళ్లి చేసుకున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు సస్పెండ్ చేస్తే నెహ్రు గారు కలగచేసుకుని మళ్ళీ ఉద్యోగం ఇప్పించారు. భార్య చనిపోయాక కొంత కాలానికి చనిపోయారు.

    రిప్లయితొలగించండి