26, డిసెంబర్ 2011, సోమవారం

రామాయణం నుండి అల్లుకున్న కొన్ని భావాలు


            ఆ మధ్య., భండారు శ్రీనివాసరావుగారి బ్లాగులోని "రామాయణం పుక్కిటి పురాణమా..?".. అనే టపానీ, టపాలో వచ్చిన వ్యాఖ్యలనీ చూసాక, నాకు తెలిసిన, తోచిన కొన్ని భావాల్నీ, ఎరికలనీ రాయలనిపించింది. పురాణాలనీ, ఇతిహాసాలనీ నమ్మేవారినీ, ప్రచారం చేసే వారినీ భాగవతార్‌ (రిణి) అంటారు కదా., అలాగే వాటిని పుక్కిటి పురాణాలు అనేవారిని సరదాగా "పుక్కిటి"వాదులు అనుకుందాం (ఈ టపా వరకూ).. ఇక్కడో సందేహం నాకు, అసలు పుక్కిటి పురాణం అంటే ఏమిటి..? అందులో "పుక్కిటి" అనే పదం కథాకమామీషు  ఏంటో ఎవరైనా చెబితే బాగుంటుంది.

ఇంక విషయంలోకి వస్తే,

1) రామాయణంగానీ, భారతంగానీ వేరే యే ఇతర ఇతిహాసంగానీ కేవలం పుక్కిటి పురాణంగానో, కల్పిత కథగానో ఊహించేవాళ్లు ఎప్పుడూ ఉన్నారు.. నిజాలు బయట పడిపోతున్నప్పుడు పక్కకి తప్పుకుంటూనే ఉన్నారు. అలాగని ఇప్పుడు రామాయణాన్ని నిరూపిస్తానని అనడం లేదు. ఉదాహరణ మాత్రమే ఇద్దామని చెబుతున్న విషయం "ట్రాయ్‌" నగరం గురించి.. పైనున్న ఇతిహాసాలకీ, "ట్రాయ్‌" నగరానికీ ఉన్న సంబంధం ఏమిటంటే "పుక్కిటి పురాణం"గా కొందరు అభివర్ణించడం.
   "ట్రాయ్‌" నగర శిథిలాలు బయట పడేదాకా, గ్రీకు ఇతిహాసాల్లోని "ట్రాయ్‌" ప్రస్తావన ఒక అభూత కల్పన అని అనుకునేవారు(ట). కొంతమంది నిరూపించారు(ట) కూడా..! అయితే, దాని శిథిలాలు బయట పడినపుడూ, అక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం లాంటిది సంభవించిందని, ఆ సందర్భంగానే అది అంతమైపోయిందనీ నిరూపితమైనపుడూ ఈ "పుక్కిటి"వాదులు ముక్కున వేలేసుకున్నారు. అలాగే "ప్రాచీన ప్రపంచ చరిత్ర" అనే ర ష్యన్‌ అనువాదంలో చదివినదాని ప్రకారం "జీసస్‌ క్రైస్ట్‌" అనే పేరుతోగానీ, బైబిల్‌ లో వర్ణించిన లక్షణాలతోగానీ ఏ మనిషీ జీవించలేదని ఆధారాలతో సహా నిరూపించబడింది(ట). సమాధులూ, ఇతర విషయాలు (దీని గురించి పూర్తిగా తెలీదు) బయటపడుతూ ఉంటే ఇప్పుడు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. "రామాయణం"గానీ, "భారతం"గానీ "పుక్కిటి పురాణం" అనేవాళ్ళూ, అననివాళ్ళూ ఇలాంటి అనుభవాలని దృష్టిలో పెట్టుకుంటే మంచిది..!

2) రామాయణంలో గొప్ప సంస్కృతి గురించి వర్ణన ఉందని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిజమే కావచ్చు. అయితే, బ్రహ్మాండ పురాణంలోని (నేను చదివింది గ్రేటర్‌తెలుగు డాట్‌ కాం లోని బ్రహ్మాండ పురాణ సారాంశమేనని మనవి)  వర్ణనలు చదివితే ఈ భావన తప్పేమో అనిపిస్తూ ఉంటుంది. కృతయుగంలో మనుషులు, త్రేతాయుగంలోని మనుషులూ, ద్వాపర, కలి యుగాలలోని మనుషులూ ఒకే విధమైన అలవాట్లనూ, జీవన విధానాలనూ కలిగిలేరు. ఒక హేతువాది రచనలో చదివిన విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలనిపిస్తోంది. భీముడు ఆంజనేయుణ్ణి యుగలక్షణాల గురించి అడిగితే ఆయన చెప్పినది. కృతయుగంలోని మనుషులకి కృతమే (చేసినది) తప్ప కర్తవ్యమేమీ(చేయవలసినది) లేదట.  ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే సంపాదించుకునేవారు తప్ప , దాచుకోవడం (స్వార్థం) లేదట. దానికి ఆయన వేరే దృక్కోణంలో వివరించుకున్నాడులెండి. జంతుజాలంలో ఇప్పటికీ ఆ లక్షణం ఉంది. (చాలా మటుక్కి). అలాగే త్రేతాయుగంలోని మనుషులు చెట్ల చాటున జీవించేవారు(ట). నిల్వ చేసుకోవడం మొదలైంది. రాజులు మొదలయ్యారు. రాజుల దౌర్జన్యం కూడా మొదలైంది(ట). ద్వాపరయుగంలో వర్ణాశ్రమ ధర్మాలు వచ్చాయి. ఇలా యుగం మారే కొద్దీ కొత్త నియమాలు రావడమే, తద్వారా ఉల్లంఘించేవారూ పెరిగారు.
ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే, మనం ప్రస్తుతం దేన్నైతే నాగరికత అంటున్నామో (పెద్ద పెద్ద భవనాలూ, వాహనాలూ, సంపాదనలూ) దాన్నే మన పురాణాలు స్వార్థంగా అభివర్ణించాయని...! ఇది ఈ యుగ ధర్మం కాబట్టి, ఇది ఇలాగే ఉంటుంది. మార్చడం ఎవరివల్లా కాదు. "రామాయణం"లోని వర్ణించిన నగర వర్ణనలూ, ఇతర విషయాలు (?) తర్వాతి కాలంలోని కల్పనలు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇలా చెబుతూపోతే "రామాయణంలో పిడకల వేట" అవుతుందేమో..! వర్ణనలు తప్పుకావచ్చు, వరుసలు తప్పు కావచ్చు, వేడుకలు మారిపోయిండవచ్చు కానీ ఆదర్శం మాత్రం నిలిచి ఉంది. ఎప్పటికీ నిలిచి ఉంటుంది

3) ఇప్పుడు "అవతార్‌" అనే హాలీవుడ్‌ సినిమా గురించి చెప్పి కొన్ని విషయాలు మెచ్చుకోకతప్పదు, మన సంస్కృతి గురించి మనకన్నా ఎక్కువగా అధ్యయనం చేసి అందులో చూపించడానికి ప్రయత్నించినందుకు...! ఆ మధ్య "అవతార్‌"కీ "రామాయణం"కీ పోలికలు కూడా బాగా ప్రచారం అయ్యాయి. "నవీ" తెగవారు నీలి వర్ణంలో ఉండడం లాంటివేవో. కానీ నే చెప్పేది జీవించే స్థానం గురించి. వారు ఒక చెట్టు నీడలో జీవిస్తూ ఉంటారు, సరిగ్గా బ్రహ్మాండ పురాణంలోని త్రేతాయుగం లాగ., మాంసాహారులే అయినా, ఆ జంతువులని తమ సోదరులలాగ భావిస్తూ ఉంటారు, చెట్లని పూజిస్తూ ఉంటారు. అలాగే, నిరాశ్రయులైపోయిన వారు చెట్టు దగ్గర ప్రార్థనలో ఉండగా, "తురుక్‌ మక్దో" దిగడంఇలాంటివి ప్రాచీన నాగరికతలలోని చాలా వాటితో పోల్చవచ్చు, కానీ సినిమా తీసినవాళ్లు మన పురాణాలని అధ్యయనం చేసారని మాత్రం ఖచ్ఛితంగా అనిపిస్తుంది.

4) ఇంకో విషయం... రాముడు, ఈ కాలంలో ఉన్నటువంటి మనిషి కావల్సిన అవసరం ఏమీ లేదు. ఈ కాలంలోని మనిషి అంటే హోమో సెపియన్..! హోమో సెపియన్‌ 40,000 సంవత్సరాల కిందటే ఉద్భవించాడు. కానీ రామాయణం జరిగి 15 లక్షలు దాకా అయిండవచ్చు, మన పురాణాల ప్రకారం...! ఈ సందర్భంగా ఇంకో విషయం... శివాలిక్‌ పర్వత శ్రేణుల దగ్గర 12- 14 లక్షల సంవత్సరాల కింద జీవించిన "తోక లేని కోతి" వంటి శిలాజాలని కనుగొన్నారు. అవి జీవించిన కాలాన్ని బట్టి, ఇక్కడి ప్రజల నమ్మకాన్ని బట్టి ఆ జాతికి ఇచ్చిన నామం "రామా పిథికస్‌ (ramapithecus)"., అలాగే "శివా పిథికస్‌" అని కూడా ఉంది. విషయం ఏంటంటే, రాముడు, "రామా పిథికస్‌" అయినా, వేరే ఏ ఇతర "తోక లేని కోతి" జాతికి చెందినవాడైనా వచ్చిన నష్టమేమీ లేదు. నిరూపించేస్తే వచ్చేసే లాభమూ లేదు. రాముడి పేరే రామా పిథికస్‌ కి పెట్టారన్న విషయం కుహానా లౌకికవాదులు పెద్దగా పట్టించుకుని ఉండకపోయి ఉండచ్చు. లేకపోతే అది "ఆడమ్‌" పిథికస్‌" గా మారి ఉండేది ఎప్పుడో..!

5) ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు గురించి మాట్లాడితే ఒక్కోసారి మనుషులకే ఇవన్నీ ఉంటాయని పొరబడతారు ఎక్కువమంది.జంతువుల్లో కూడా కొన్ని కట్టుబాట్లున్నాయి. నాకు తెలిసున్న, విన్న రెండు విషయాలు రాస్తున్నాను.
"సగోత్ర" వివాహాలు( పోనీ జతకట్టడం అనుకోండి ) చింపాంజీలకి నిషిద్ధం. కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. కానీ నిజం..! అన్ని రకాల చింపాంజీలకీ ఇది వర్తిస్తుందో, లేదో నాకు తెలీదు గానీ, కొన్ని మట్టుకు పాటిస్తాయి(ట). ఇంకా చాలా పోలికలున్నాయి. చింపాంజీలు గుంపులుగా జీవిస్తాయి. యీ గుంపులలోని "ఆడ" చింపాంజీలు యుక్తవయస్సుకు రాగానే, వేరే గుంపులోకి చేరుతాయి. అక్కడి మగ చింపాంజీలతో జత కడతాయి. (ఇక్కడి వరకూ ఒక పోలిక). ఏ "ఆడ" చింపాంజీ అయినా సరే, తను పుట్టిన గుంపులోని "మగ"వాటితో జతకట్టదు, సహోదరులు కాకపోయినా.. (ఇదింకో పోలిక)! అలాగే పిల్లలున్న ఏ ఆడ చింపాంజీ గుంపునుండి విడిపోతే (ఇష్టానుసారమే కావచ్చు), వేరే ఏ ఇతర గుంపులూ చేర్చుకోవు. కాదు, కూడదు అని పట్టుబడితే, ఆ "ఆడ" చింపాంజీ యొక్క పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి, అవి చచ్చిన తర్వాత, ఆ "ఆడ" చింపాంజీని గుంపులోకి చేర్చుకుంటాయి. ఇక్కడ "గుంపు" అనే పదం బదులు "గోత్రం" అనీ, "చింపాంజీ" అనే పదం బదులు "మనిషి" అని పెట్టుకుంటే పోలిక బాగా అర్థం అవుతుంది.
         అలాగే "మైల స్నానం" కాకులు కూడా పాటిస్తాయి. "ఆత్మీయ" కాకి చచ్చిపోతే ఆ కాకికి  బాగా దగ్గరి బంధువులైన కాకులు స్నానం చేసి వస్తాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉండి ఉంటాయి. మనకి తెలీదంతే..! అచారవ్యవహారాలూ, కట్టుబాట్లు మనుషులకే పరిమితం కాదు గనక వేరే ఏ జంతువులకీ నాగరికత లేదనుకోవడం భ్రమ. ఇంకా చెప్పాలంటే చీమలూ, చెదపురుగులూ, తేనెటీగలూ మనకన్నా ఎంతో గొప్ప నగర నిర్మాతలు. సుమారుగా అన్ని కీటకాలలోనూ రాణులూ, రాజులూ, రాజ్యాలూ, సేవకులూ, సైనికులూ, బానిసలూ అన్నీ ఉంటాయి. నా మట్టుక్కు నేనే "చీమల యుద్ధం" చూసాను, మా ఇంటి గడప మీద..! కొన్ని పదుల కొద్దీ చీమలు ఒకదాన్నొకటి గట్టిగా పట్టేసుకుని, కుట్టేసుకుంటూ దర్శనమిచ్చాయి. మూడు, నాలుగు గంటల తర్వాత అక్కడ చీమల శవాలు, తలలు ఊడిపోయి, కాళ్ళూ చేతులూ ఊడిపోయి పడి ఉన్నాయి. అప్పటి వరకూ నేను యుద్ధం అనుకోలేదు. ఈ శవాలనీ, తలల్నీ చూసిన తర్వాత అనిపించింది అది యుద్ధం అని.

6) జంబూ ద్వీపం అనే పేరు ఈ దేశానికి వచ్చింది "జాంబవంతుడి" వల్లనేనని, కందుల సత్య శారద లాంటి వారి ఉద్దేశ్యం (లేక ఏ పురాణంలోనైనా ఉందో..!). పూర్తివివరాలు వారి వ్యాసంలోనే చదవండి. నేను చెప్పేది (ఎక్కడో చదివిందే) కూడా అలాంటిదే..! దేవతలు, రాక్షసులు, గంధర్వులు ఇలాంటి జాతులన్నీ మనుషులే, వారి యుద్ధరీతులు, ఇతర విషయాలు తెలియక "మాయ" చేసారని చెప్పుకొని ఉండవచ్చు. నా ఉద్దేశ్యం దేవతలు అంటే థాయ్‌ లాండ్‌ వాసులు గానీ, రష్యన్లు గానీ కావచ్చని., అలా ఎందుకనిపించిందంటే, థాయ్‌ లాండ్‌ కున్న ఒకపేరు "ఐరావతాల దేశం (Land of White elephants)".., అక్కడి ఏనుగులన్నీ తెల్లని రంగులో ఉంటాయి.(ఇప్పుడు కాదలెండి, కానీ అర్థం మాత్రం అదే..!) అదే విధంగా ఇంద్రడు వారి జాతీయ దేవుడు(ట). మొన్ని మధ్యనే యశోదకృష్ణగారి బ్లాగులో చదివాను. అలాగే, "తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టమనే" తెలుగు సామెత కూడా ఉంది. దేవతలు తూర్పు దిక్కున ఉన్నారనే ఉద్దేశ్యం యీ సామెత వెనుక ఉందంటారు. థాయ్‌ లాండ్‌ వాసులు మనకి తూర్పుదిక్కునే కదా ఉన్నారు...! ఇంక రష్యన్లు ఎందుకవ్వచ్చంటే కొన్ని ప్రాంతాలలో సంవత్సరానికి ఒకే రాత్రి, పగలు ఉండడం; ధ్రువ నక్షత్ర ప్రస్తావనలు, దేవతలని కలిసిన రాజులు హిమాలయాల గుండా ప్రయాణించినట్టు ఉన్న ప్రస్తావనలు ఉండడం వల్ల..! ఇంద్రుడికీ, కృష్ణుడికీ యుద్ధం ఒకటి జరిగిందిగా.. భగవంతుడి(కృష్ణుడు)కీ, దేవతలకీ ఉన్న కొద్దిపాటి వైరం (లేక స్పర్ధ) వల్లనే "భగవద్గీత"ని నిషేధించబోయారేమో (సరదాకి అంటున్నాను)..! అలాగే రామాయణంలో భరతుడు మూడు కోట్ల మంది గంధర్వులని ఓడించి, గాంధార దేశాన్ని ఆక్రమించి తన పుత్రులైన తక్షక, పుష్కలులకు అప్పగిస్తాడు. వారు నిర్మించుకున్న నగరాలు నేటి పెషావర్‌, తక్షశిల (కొంతమంది తాష్కెంట్‌ కావచ్చంటారు) అని మనకి తెలిసిందే..!


రామాయణానికీ, పైన చెప్పిన విషయాలకీ ఒక్కో చోట పోలిక లేనట్లు అనిపించవచ్చు. కానీ నేను చెప్పుకునేది ఆచార వ్యవహారాల్లోనూ, నాగరికతల్లోనూ ఆధునిక మానవుడికి, జంతువులతో ఉన్న సామ్యాన్ని పరిశీలిస్తే "రామాయణం" పుక్కిటి పురాణం కానవసరం లేదని..! అది 15 లక్షల సంవత్సరాల కిందట జరిగిందన్నా, లేక 7000 సంవత్సరాల కింద జరిగిందన్నా..! అలాగే రాముడు "హోమో సెపియన్‌" మానవుడు కాదు, రామా పిథికస్‌ అనో, వేరే ఏదో జాతికి చెందిన వాడనో చెప్పినా నష్టం లేదు. ఎందుకంటే భగవంతుడు "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అన్నాడు ., "పక్షుల్లో గరుత్మంతుడినీ, పాముల్లో వాసుకినీ, రాక్షసుల్లో ప్రహ్లాదుణ్ణీ నేనే"ననీ చెప్పుకున్నాడు కానీ, కేవలం మనిషి గానే పుడతానని, అందులోనూ "హోమో సెపియన్‌"గానే పుడతానని చెప్పలేదు కదా..! మనక్కావల్సింది ఆయన ఆచరించిన ఆదర్శాలు మాత్రమే..! అందువల్ల "పుక్కిటి"వాదుల వ్యాఖ్యల్ని పట్టించుకోవలసిన అవసరం లేదు


ఈ టపాలోని తప్పొప్పులు సరిదిద్ద ప్రయత్నించే పెద్ద మనసులకి, సదా కృతజ్ఞుడను..!

9 కామెంట్‌లు:

  1. రామాయణాన్ని పురాణమో, ఇతిహాసమో కాదు, అదొక కావ్యమ్మాత్రమే అని ఈ మధ్యే చదివానండీ.

    రామాయణ గాధను పోలినవే మన చుట్టుప్రక్కల దేశాల్లో గాధలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో చాలావరకు పాత్రలపేర్లు ఒకటే, కధకూడా రామాయణంతో చాలావరకు పోలిఉంటుంది. ఇప్పుడు... అన్ని రామాయణాల్లోంచి ఏరామాయణం నిజంగా జరిగుంటుందంటారు?

    మీరు ప్రస్తావించిన ట్రాయ్‌నిగానీ, ఆ గ్రీకు దేవతలనుగానీ, వారిచుట్టూ అల్లుకొనిఉన్న గాధలను మనం నమ్మం (నమ్మాల్సిన అవసరంలేదు). ఒక గ్రీకుదేశస్తుడు మనకు పరిచయమై, జియూస్‌ని సంతుష్టంచేయకపోతే మనకువాటిల్లగల ఆపదలను మనకు వివరించి, అలా ఆయనను అగౌరవపరచి ఇబ్బందులపాలైన వీరుల గాధలు మనకు చెప్పరనుకోండి, మనం నవ్వుకుంటాం (బుర్రవాడుతాం). అలాంటి గాధలే (మన)మతంలో ఉంటేమాత్రం వాటిని గౌరవించి నెత్తినపెట్టుకుంటాం? ఎందుకలా? అక్కడపనిచేసిన మన లాజిక్కు ఇక్కడెందుకు పనిచెయ్యదు? ఒకవేళ అవికూడా నిజమేనని ఒప్పుకున్నా మనం ఎందుకు అక్కడిదేవతలకు పూజలు మొదలుపెట్టం? మనవైనంత మాత్రాన వాటిని ప్రశ్నించకుండా ఒప్పుకోవలసిందేనా?

    Let's say సిడ్నీ షెల్డనుగారి ఏదో ఒక నవల కొన్నివేల సంవత్సరల తరువాత ఎక్కడో తవ్వకాలలో బయటపడిందనుకుందాం, అప్పటివారు దాన్ని చదివి నిజంగానే జరిగిందని, Ashley Patterson, Larry Douglas తదితరులందరూ ఒకప్పుడు నిజంగానే జీవించారని అనుకొనే అవకాశాలున్నాయికదా! అప్పుడు వాళ్ళుకూడా తవ్వకాలలో బయట పడిన వాషింగ్టన్, లండన్ నగరాలని చూపించి ఇలాగే మాట్లాడితే మనమేం సమాధానం చెప్పగలం? On the contrary, వాళ్ళకి గాంధీ జీవితచరిత్రే దొరికేసి, అప్పుడు నాలాంటి వాడు ఇదికేవలం నవల మాత్రమే, గాంధీ అంటూ ఎవ్వరూ లేరు అంటే ఎలా అసలు విషయం ఏదో ఎలా నిరూపించగలం?

    రిప్లయితొలగించండి
  2. ఇండియన్‌ మినర్వాగారూ.. నమస్తే..!
    రామాయణాన్ని పోలిన గాథలు, కావ్యాలు థాయ్‌ లాండ్‌, బర్మా, జావా లాంటి దేశాలలో ఉన్నాయి. "రాముడికి సీత ఏమవుతుంది?" పుస్తకం నేను కొద్దిగానే చదివాను. కనుక పెద్దగా ఆలోచించలేదు. అయితే వాటి మధ్యలో ఎన్ని వైరుధ్యాలున్నా, ఒక పోలిక మాత్రం ఉంది. అదే రాముడు ఒక "ఆదర్శ పురుషుడు" కావడం..!
    గ్రీకు దేశస్థుడు "జీయస్‌"ని కొలవమని చెప్పడం అంటారా..? ఆ భయం అక్కర్లేదులెండి. అక్కడంతా క్రైస్తవులేగా..! ప్రాచీన గ్రీకు మతం తుడిచిపెట్టుకపోయిందంటారు.
    ఒకవేళ చెప్పినా అందరికన్నా ఎక్కువగా గౌరవించేది భారతీయులమే..! మనకి పక్కింటి పుల్లకూర రుచి కదా..! (Just kidding)
    మన పురాణాలని నెత్తిన పెట్టుకుని పూజించనవసరం లేదు., నెత్తిన పెట్టుకుని పూజించేవారిని హేళన చేయకూడదని నా అభిప్రాయం, (కరుణానిధి లాంటి వ్యక్తులు ఉంటున్నది ఈ దేశంలోనే మరి)
    నిరూపించవలస్తే వచ్చే లాభంగానీ, చేయకపోతే వచ్చే నష్టంగానీ ఏమీ లేవని నా ఉద్దేశ్యం కూడా..!

    రిప్లయితొలగించండి
  3. ఇండియన్ మినెర్వా గారూ,
    మీ వాదన నాకు సబబుగానే తోస్తోంది. మనకు దొరికే ఏ చారిత్రక ఆధారమైనా (కాల పరిమితికి లోబడి) అది సృష్టించబడిన కాలం నాటి సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకోవటానికి, ఒక అవగాహనకు రావటానికి ఉపయోగపడుతుందే తప్పించి ఇదే జరిగింది అని రూఢీగా చెప్పలేము. ఈ వీడియో చూడండి (http://www.youtube.com/watch?v=b9W0NEd3ypI&feature=youtu.be&fb_source=message) బుద్ధుడు అరవ్వాడెలా అయ్యాడో అర్థమవుతుంది!

    అయితే ఒక్కటి మాత్రం మనం అంగీకరించాలి. రామాయణ, మహాభారతాది ఘట్టాలు నిజంగా చరిత్రో లేదూ పుక్కిటి పురాణాలేనో అవి అందించే ఙ్ఞానం అమూల్యమైనది. అలాగే కనీవినీ యెరుగని అద్భుత స్క్రిప్టు, స్క్రీన్‌ప్లే కలిగిన కథలు.

    రిప్లయితొలగించండి
  4. @వామనగీత గారు: రాముడంటే ఆదర్శమే. వాల్మీకి రాముడిద్వారా ఒక బోధనసాగించాడు అనుకుంటే, ఆ బోధననుసరించడం మంచిదే. దాన్ని నేను కాదనడంలేదండీ. రాముడున్నాడాలేడా అన్న ప్రశ్న అనవసరం అది పూర్తిగా నమ్మకాలపై ఆధారపడిందేగానీ దాన్ని ఋజువుచెయ్యలేమేమో అన్నది నా అభిప్రాయం సందేహంకూడాను.

    @అచంగ (அசங்க) గారు: "మనకు దొరికే ఏ చారిత్రక ఆధారమైనా (కాల పరిమితికి లోబడి) అది సృష్టించబడిన కాలం నాటి సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకోవటానికి, ఒక అవగాహనకు రావటానికి ఉపయోగపడుతుందే తప్పించి ఇదే జరిగింది అని రూఢీగా చెప్పలేము." అక్షరశః ఏకీభవిస్తున్నాను. వీడియో బాగున్నది. కొంచెం సీరియస్సుగా ఆలోచించాలి. Thank you.

    రిప్లయితొలగించండి
  5. @ఇండియన్‌ మినర్వాగారు..!
    నేననేది అదే కదా..! (వేరే అర్థం ఏమైనా వచ్చిందా..?)

    @అచంగగారు..
    ఆ వీడియో బాగానే ఉంది. అయితే, ఇటువంటి పరిశోధనలు తెలుగు భాష విషయంలో కూడా జరుగుతున్నాయి. "తమిళం" ప్రాచీన భాష అనేది ఒక పాతబడ్డ సిద్ధాంతం. దాన్ని ప్రతిపాదించినవారే తర్వాతి కాలంలో విభేదించారు(ట). "తమిళం" కన్నా తెలుగు ప్రాచీనతే అధికం(ట). కొంతమంది తెలుగు సంస్కృతం కన్నా ప్రాచీనమైనదంటారు. ద్రవిడ భాషా కుటుంబం నుండి తెలుగు, గోండి తదితర మధ్య ద్రవిడ భాషలు విడిపోయి 3500 సంవత్సరాలు అయింది. దక్షిణ ద్రవిడ భాషలైన తమిళ, కన్నడ, మళయాళ, తుళు తదితరాలు ఆ తర్వాతి కాలంలో విడిపోయాయి. ఇది ప్రస్తుతం ఎక్కువమంది అంగీకరిస్తున్న సిద్ధాంతం.. మీకు వీలుంటే ఆంధ్రభూమి "నుడి" శీర్షికలోని వ్యాసాలను చదవండి. తమ భాషే ప్రాచీనమని నిరూపించుకోడానికి తమిళులు తెలుగుని ఏ విధంగా మింగేస్తున్నారో సామల రమేష్‌ బాబు గారు తమ వ్యాసాల్లో చూపించారు. "తమిళనాడు"లో ఎక్కువ ఇళ్లలో మాట్లాడుకున్న భాష "తెలుగు"..!

    రిప్లయితొలగించండి
  6. వామనగీత గారూ,
    నాకు తెలుగు పత్రికలు సంపాదించటం దాదాపు అసాధ్యం! గూగులమ్మేమో దయతల్చలేదు ఆంధ్రభూమికై వెదగ్గా! కాస్త లింకు ఏదైనా ఉంటే పంచుకోగలరు!

    రిప్లయితొలగించండి
  7. @ అచంగగారు

    ఆంధ్రభూమి "నుడి" నిర్వహణ మొత్తం సామల రమేష్‌ గారి అధ్వర్యంలో ఉంది.అందులోని వ్యాసాలన్నీ informativeగానే ఉంటాయి.
    ఈ లింక్‌ Archivesది
    http://www.andhrabhoomi.net/more/article/3204
    ఇవి కాక నాకు నచ్చిన కొన్ని వ్యాసాల లింకులివి..
    http://www.andhrabhoomi.net/nudi/mana-seema-245
    http://www.andhrabhoomi.net/nudi/vedika-726
    http://www.andhrabhoomi.net/nudi/telugu-bhashaku-ankitham-140
    http://www.andhrabhoomi.net/nudi/telugu-lanti-nudi-901
    http://www.andhrabhoomi.net/nudi/mandini-kalipi-unchedi-nudi-376
    http://www.andhrabhoomi.net/nudi/maritius-610
    http://www.andhrabhoomi.net/nudi/telugu-months-840

    రిప్లయితొలగించండి
  8. "పుక్కిటి"వాదులు...ఒక మంచి మాట తయారు చేసారు .

    కొన్నాళ్ళకి గాంధీ గారి లాంటి మనిషి నిజంగా జీవించి ఉండేవాడు అన్నా కూడా "ఆ పుక్కిటి పురాణం" అని తీసిపారేసేవాళ్ళు రావచ్చు గాంధీ గారిని వదిలేద్దాం. ఈ పుక్కిటి పురాణాలు అని అల్లరిచేసేవాళ్ళు భక్తిగా కొలిచే లెనిన్ కాని, మావో కాని ఒక వెయ్యేళ్ళ తరువాత అవతార పురుషులు అని ఆ "మతం"(అదీ మతమే కాకపొతే వందేళ్ళు కూడా కాకుండానే అంతరించింది) వాళ్ళు ప్రచారం చెయ్యచ్చు. ఎవరు చూడొచ్చారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. పనికట్టుకుని ఫలానా పురాణం పుక్కిటి పురాణం అని వ్యాసాలూ వ్రాయవలసిన అవసరం ఉన్నాదా అని అలా వేరే ఏ పనీ లేకుండా వ్రాసేవాళ్ళు ఆలోచించుకోవాలి అని నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  9. Enduku merandaru entha godava paduthunaro naku ardam kavadam ledu..

    రిప్లయితొలగించండి