30, నవంబర్ 2011, బుధవారం

మా ఇంటికొచ్చిన అయ్యప్పస్వామి ప్రసాదం




ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో(ఆరేళ్ళ క్రితం) జరిగిన రెండు అనుభవాల సమాహారమీ టపా..! 

కాలేజి అయిపోయి ఇంటికొచ్చినపుడు ఇంటికింద ఉండేవాళ్లు నా చేతిలో ఓ కాగితం పొట్లం పెట్టారు. (నా చేతిలో ఎందుకు పెట్టారంటే, సాయంత్రంపూట ఇంటికి ముందుగా వచ్చేది నేనే.., మరి మా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే.! మా అన్నయ్య ఆలస్యంగా రావడం కూడా జరిగి, పొట్లం నా చేతిలోకొచ్చింది). అది అయ్యప్పస్వామి ప్రసాదమట. ఎవరో నలుగురు స్వాములు మా వీధిలో పంచిపెట్టారట. మామూలు విషయమే కనక, ఆ పొట్లం ఇంటిలోకి తీసుకొచ్చేసాను.

ఆ తర్వాత దాని విషయమే మర్చిపోయాను.

ఓ గంట తర్వాత, మా చిన్నన్నయ్య (మా పెద్దనాన్నగారి రెండో అబ్బాయి., మేము పక్కపక్కవాటాల్లోనే ఉంటున్నాంలెండి) చెప్పాడు ఆ పొట్లం గురించి..
పొట్లంలో అటుకులూ, బెల్లమే ఉన్నాయి, కానీ పొట్లం కట్టిన కాగితం మీద ఉన్న రాతలు..


నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును

యెహోవా..

ఇలాగ ఉండి..,
 ఆత్రేయపురంలో వీరయ్యో, అమలాపురంలోని పుల్లమ్మో క్రీస్తుని నమ్మడం ద్వారా ఎంత బాగుపడ్డారో వివరించి కూడా ఉందన్నమాట..

ఈ విషయం మా వీధిలో ఎంతమందికి తెలుసో, ఎంతమందికి తెలీదో, అసలు చూసారో లేదో నాకు తెలీదుగానీ, మా ఇంట్లో మాత్రం కొంతమంది అవతల పారేసారు. కొంతమంది అవి తినేసి కాగితం చింపేసారు. (అఫ్‌కోర్స్‌.. ఏ పొట్లం కాగితమైనా ఇంతే..!) ఆ విషయాన్ని మర్చిపొయ్యారు రెండురోజుల్లో..

ఇంక కాలేజిలో ఒక ఫ్రెండు ఉండేవాడు. కన్వర్టెడ్‌ క్రిస్టియన్‌..! ఇతను కాలేజిపక్కన ఉన్న చర్చికి రమ్మని పెద్దగా పోరకపోయినా, హిందూ మతం మీద, ఆచారాలమీద కామెడీలూ, గేలిచేయడాల్లాంటివి చేస్తూ ఉండేవాడన్నమాట..! అప్లికేషన్‌ లో మాత్రం రిజర్వేషన్‌ కోసం "హిందూ" అనే రాసుకున్నాడు. (అది వేరే విషయం)

ఒకసారి అతను చెప్పిన కథ (పుట్టించిన/ప్రచారం పుకారు) చాలా వెరైటీగా ఉంది..
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక చిన్నపిల్లాడు పుట్టాడట కనుబొమ్మలు లేకుండా (నిజంగా ఉంటాయో ఉండవో నాకు తెలీదుగానీ., అతను చెప్పింది మాత్రం ఇదే)..! కనుబొమ్మలు లేవని ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఏడ్చేస్తున్నారట (ఎందుకో మరి). వెంటనే ఆ పిల్లాడు "నేను ఏసుక్రీస్తుని..! నా కనుబొమ్మల్లోని వెంట్రుకలు మీ బైబిళ్లలో ఉంటాయి. పోయి చూసుకొండి".అని అన్నాడట..!

అలా చెప్పి చనిపోయాడట..! వాటికోసం వెతికిన వారందరికీ దొరికాయట..!
ఈ కథ చెప్పి ఇతగాడు తనదగ్గర బైబిల్లో కూడా వెంట్రుకలున్నాయి అని చెప్పాడు. 

ఇది ఏ రకమైన ప్రచారమో నాకర్థం కావట్లేదు. ఆ సమయంలో అసలు కాకపోయినా, కొద్దిగానైనా అర్థం చేసుకోగలిగేవాణ్ని గనక వాడి చెప్పిన కథ కల్పిందేనని తెలుసుకోడానికి అట్టే సమయం పట్టలేదు. అదే ఏ ఐదు సంవత్సరాల పిల్లాడో, ఐదో క్లాసు అమ్మాయో ఇలాంటి దివాళాకోరు కథలు వింటే ఏమౌతుందో అర్థం చేసుకోవచ్చు. చాలా స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ జరుగుతున్న వాటికి ఉదాహరణలివి..!

"ప్రతీ మనిషికీ తనకి నచ్చిన మతాన్ని అవలంభించే హక్కూ, ప్రచారం చేసుకునే హక్కూ" ఉండి ఉండవచ్చుగాక, కానీ "దేశ సంస్కృతినీ, ఆచార వ్యవహారాలనీ, పరిరక్షించడం" అందరి బాధ్యత అనే దానికే రాజ్యాంగం ప్రాధాన్యం ఇస్తోంది (నాకు తెలిసున్నంత జ్ఞానంలో). ఎప్పుడైనా "హక్కు"లకీ "ఆదేశిక సూత్రాల"కీ మధ్య వివాదం లాంటిదొస్తే "ఆదేశిక సూత్రాల"కే కోర్టులు, ప్రభుత్వాలూ ప్రాధాన్యత ఇవ్వాలనీ చాలా మందికి తెలీదనుకుంటా బహుశా..! (తప్పయితే సవరించగలరు)

ఇటువంటి సంఘటనలూ, ప్రలోభాలూ బహుశా ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి
..
...
.....
By the way..అందరికీ సుబ్బారాయుడి షష్టి శుభాకాంక్షలు

16, నవంబర్ 2011, బుధవారం

సెవెన్త్‌ సెన్స్‌ సినిమా చూసిన తర్వాత, నాకొచ్చిన సందేహాలు



            సిక్స్త్‌ సెన్స్‌ అనేదాన్నే చాలామంది ఒప్పుకోనప్పుడు ఈ సెవెన్త్‌ సెన్స్‌ ఎక్కణ్ణుంచి వస్తుందిరా అనుకుంటూ మొదలెట్టాను సినిమా చూడ్డం. కొంతసేపటికే అర్థమైపోయింది మురుగదాస్‌  ఏడో జ్ఞానంగా దేన్ని అనుకుంటున్నాడో..! "జెనిటిక్‌ మెమొరీ"నే అతగాడు సెవెన్త్‌  సెన్స్‌ అన్నాడన్నమాట..!
                 బోదిదమ్మ(ఇక్కడింకో సందేహం..!) వంశస్తుడైన హీరోగారు చివర్లో బోదిదమ్మగా మారిపోతాడు.( ఈ సినిమా కథ ఒక్క వాక్యంలో..!) ఈ లెక్కన గోత్రాలను బట్టి ఎవరైనా వసిస్ఠుడుగానో, విశ్వామిత్రుడిగానో, కశ్యపుడిగానో మారిపోవచ్చన్నమాట..! (అందరూ వారివారి గోత్రనామాలనొకసారి స్మరించుకోండి...ఊరికే...సరదాకి.!)  హీరోయిన్‌ చేసిన రీసెర్చికీ "క్లోనింగ్‌"కీ పోలికలున్నట్టుగా అనిపించింది. క్లోనింగ్‌లో కొత్తగా జీవిని జన్మింపజేస్తారు. ఇందులో హీరోయిన్‌ అల్రెడీ ఉన్నవాణ్ని పూర్తి "బోది దమ్మ"గా మార్చింది. ఫండమెంటల్‌ తేడా తెలుస్తూ ఉన్నా, క్లారిటీ మాత్రం రాలేదు. ఒకే జన్యులక్షణాలతో పుట్టిన కవలలు కూడా ఒకే విధంగా బిహేవ్‌ చేయవలసిన అవసరం లేనపుడు, ఎప్పుడో 1600 సంవత్సరాల కిందటి వ్యక్తితో జన్యు సారూప్యత కలిగిన వ్యక్తి, పాతవ్యక్తి లక్షణాలూ, శక్తులూ వచ్చేస్తాయనుకోవడం.., అస్సలు బాగోలేదు. అదంతా మనకెందుకులెండి.., రివ్యూవర్స్‌ ఉన్నారుగా వాళ్లపని అది..

                తమిళంలోని బోదిదమ్మ పాత్రకి  తెలుగులో బోధిధర్మ అని పెట్టి వదిలేసారుగా (ఇందాకటి బ్రాకెట్లోని సందేహం)..! అంటే, వాడి ఉద్దేశ్యం తెలుగువాళ్ళకి "బోది దమ్మ"అంటే అర్థం కాదనా..? లేక వేరే పైత్యపు ఉద్దేశ్యం ఏమైనా ఉందా.? తెలుగువాళ్లకి "బోది దమ్మ"అంటే అర్థం కాదనుకుంటే చాలా పొరబాటు., "దమ్మపదం (ధర్మపథం)" సాహిత్యాల్లో చాలామంది కొట్టినపిండే..! "బోది దమ్మ" అనేది "బోధి ధర్మ"కి వికృతి అని స్కూల్‌ పిల్లాడుకూడా చెప్పగలిగే విషయం. మరి తెలుగులో "బోధి ధర్మ"అని పాత్రనామం ఇవ్వాల్సిన అవసరమేంటో నాకర్థం కాలేదు. పైగా బౌద్ధం తమిళనాట కన్నా, తెలుగునాటే ఎక్కువ ప్రాచుర్యం పొందిందనుకుంటాను కూడా..! నా ఉద్దేశ్యం (అనుమానం) ఏంటంటే, ఆ చిత్రంద్వారా దర్శకుడు "తెలుగువారి చరిత్ర"ని హైజాక్‌ చేసాడని..! పోనీ... ఇవన్నీ దిక్కుమాలిన సందేహాలు అనుకుందాం..! అసలైన సందేహం ఇంకోటుంది
              సినిమాకి విడుదల అవ్వడానికి ముందు దర్శకుడు చెప్పిన విషయం "ప్రతీ తమిళుడు గర్వించే విధంగా ఉండే సినిమా ఇద"ని.. అంటే అతని ఉద్దేశ్యం, అప్పటి తమిళుల చరిత్ర చూపిద్దామన్నట్లైతే ఫర్వాలేదు. మరి లింక్‌ చేసింది ఎవరితోనయ్యా అంటే, పల్లవులతో..! అక్కడ మొదలైంది నా సందేహం, అసలు పల్లవులు తెలుగువాళ్ళా లేక తమిళులా అని..! చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం చదువుకున్నపుడుకూడా పల్లవులు తెలుగువాళ్లని, వారి రాజధాని కాంచీపురమనీ, చదువుకున్నాం..! అలాగే మహాబలిపురంలోని రాతికట్టడాలపై తెలుగుశాసనాలుంటాయనీ విన్నాను. విశాఖపట్టణాన్ని నిర్మించింది కూడా పల్లవరాజేననీ, సింహాచలం ఆలయాన్ని నిర్మించిందీ వారేననీ విన్నాను. హఠాత్తుగా, పల్లవులు తమిళులెలా అయిపోయారో నాకస్సలు అంతుబట్టడంలేదు..! ఎవ్వరికైనా దీని గురించి తెలిస్తే కొద్దిగా నన్ను ఎడ్యుకేట్‌ చేయగలరు..

                   సెవెన్త్‌ సెన్స్‌ గురించి మాట్లాడగానే నా మనస్సు ఎందుకో మా ఇంట్లోని యాకోవ్  పెరెల్మాన్ "నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం" పుస్తకంపైకి పోతోంది. అందులో నాలుగో మితి(4th dimension) గురించి మాంచి డిస్కషన్‌ ఉంటుందిలెండి. "నాలుగో మితి" అంటే అర్థం కాలేదా..? వివరంగా చెప్పాలంటేదీని గురించి ప్రత్యేకటపా వేస్కోవాలి.  అందువల్ల చిన్నగా రాసేస్తాను. మనమున్న ప్రపంచం "త్రిమితీయ ప్రపంచం" (3 D world)..... అంటే పొడవు”, “వెడల్పు”, “ఎత్తు ఉంటాయి  ఏ వస్తువుకైనా..! 2D ప్రపంచాలూ, 1D ప్రపంచాలూ కూడా ఉన్నాయంటాడు ఆ పుస్తక రచయిత. ఉదాహరణకు, మన నీడ తీసుకున్నారనుకోండి, దానికి పై మూడిట్లో రెండు మాత్రమే ఉంటాయి. అంటే.. 2D ప్రపంచం అన్నమాట.! "నాలుగో మితి"ని కనుక్కుంటే ఎన్ని లాభాలుంటాయో కూడా వివరిస్తాడు ఆ పుస్తకంలో. ఐన్‌స్టీన్‌ అయితే నాలుగో మితి "కాలమే" అంటాడు. కాదనేవాళ్ళూ చాలా మంది ఉన్నారు. అందులో నేనూ ఒకణ్ని..! అదీ "నాలుగో మితి" గురించి చిన్న వివరణ.!

నా సందేహాల్ని తీర్చమని కోరుతున్నాను..! 

1, నవంబర్ 2011, మంగళవారం

ఒక సంస్కృత అద్భుత కావ్యం గురించి..



                         "ఫేస్‌ బుక్‌" చూస్తూండగా  మధ్యలో తగిలిన ఫోటో ఇది. బహుశా, ఎవరిదో పుస్తకం నుండి కాపీ చేసి పెట్టి ఉంటారు. సారాంశం మాత్రం అద్భుతం. ఆసక్తికొద్దీ నా బ్లాగులోకి తీసుకువచ్చాను.



ఆ కావ్యానికి సంబంధించిన లింకు

పతివ్రతల పరిరక్షణ చట్టం (ఆడవారిపై దాడుల నివారణ చట్టం)




            కాలేజీ అమ్మాయిలపై ఏసిడ్‌ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడవారికి రక్షణ కరువైపోయింది. సిటీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో ఆడవారికి ప్రత్యేకంగా సీట్లూ, బస్సులూ, బోగీలూ కేటాయిస్తున్నా మగవారు అతిక్రమించేస్తున్నారు. అప్పుడప్పుడు చెంపదెబ్బలూ, చెప్పు దెబ్బలూ, పళ్లు రాలడాలూ అవుతున్నా మగజాతికి బుద్ధిరావడం లేదు. ఎన్ని చట్టాలు చేసినా మార్పు రావడం లేదు (ముఖ్యంగా ఫెమినిస్టులకి). పుట్టుకతోనే బుద్ధిమంతురాళ్లైన అందరు ఆడవాళ్ళు, పట్టుకతోనే వెధవలూ, బడుద్ధాయిలైన మగవాళ్ల కారణంగా ఎంతో వివక్షకి, ఎన్నో అవమానాలకీ, అనుమానాలకీ, భౌతిక దాడులకి గురవుతున్నారు.

                  ఇంతకు ముందే వచ్చిన గృహహింస బిల్లూ, మతహింస బిల్లు టైపులో ఈ బిల్లు కూడా వచ్చేస్తే, దేశం మొత్తం మారిపోతుంది (ఫెమినిస్టులకి ఒక సంతృప్తి)..!

                 ఈ బిల్లు, మిగతా బిల్లుల్లా (కాకుండా) కొన్ని నిర్దిష్టమైన నిర్వచనాలతోనూ, నియమ నిబంధనలూ, అతిక్రమించినవారికి శిక్షలతో ఉండేలా ప్రయత్నించడం జరిగింది.
నిర్వచనాలు:
1) పతివ్రత: పుట్టుకతో స్త్రీ., అదే విధంగా పుట్టుకతోగానీ, పెరిగిన పరిసరాలతో గానీ ఒక స్త్రీ పతివ్రత మాత్రమే అవుతుంది. కాకపోవడానికి ఆస్కారమే లేదు. అందువల్ల పుట్టుకతోనే స్త్రీలనందరినీ "పతివ్రత"లు అనవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ (తప్పు చేసినా, చేయకపోయినా) పతివ్రత, పతివ్రతే అవుతుంది. అందువల్ల రాజ్యాంగపరంగా గానీ, సాంఘికంగా గానీ ఒక "పతివ్రత"ని శిక్షించరాదు. (ఆదర్శం 1)
2) మృగాడు. పుట్టుకతో పురుషుడు. పుట్టుకతో స్త్రీగానీ, పురుషుడుగానీ కానియెడల ఆ వ్యక్తిని కూడా "మగాడు"గానే పరిగణించాలి (వివరాలకు సంప్రదించండి: "జనాభా గణన నియమావళి"). పుట్టుకతోగానీ, పెరిగిన పరిసరాలతోగానీ ఒక "మగాడు", "మృగాడు" మాత్రమే అవుతాడు. అందువల్ల ఈ విభాగానికి చెందినవారందరినీ "మృగాళ్లు" అనవచ్చు. ఏ పరిస్థితుల్లోనైననూ (తప్పు చేసినా, చేయకపోయినా) మగాడు, మృగాడే అవుతాడు. అందువల్ల అతడు (మాత్రమే) శిక్షార్హుడు.
3) దాడి: ఆఫీసుల్లోనూ, కళాశాలల్లోనూ "పతివ్రత"పై మృగాడు చేసే దాడి చాలా రకాలు ఉన్నా ప్రధానంగా ఈ క్రింది విధంగా వర్గీకరించాలి (గృహహింస చట్టం-2005 సౌజన్యంతో)
      1) మానసిక దాడి.
        మాట్లాడడం (పని ఉన్నా, లేకపోయినా), లెటర్లు రాయడం (అది లవ్‌ లెటర్ల మొదలు లీవ్‌ లెటర్‌ వరకూ),
        ర్యాగింగ్‌ వర్గం (కళాశాలలకి ప్రత్యేకం):
"సీనియర్‌" మృగాడు "జూనియర్‌" పతివ్రతని ర్యాగింగ్‌ చేయబోవడం (ర్యాగింగ్‌ నిరోధక చట్టం వర్తిస్తుంది.),
"సీనియర్‌" పతివ్రత "జూనియర్‌" మృగాణ్ణి ర్యాగింగ్‌ చేయబోతే వద్దని వారించడం, ఎదిరించడం (ర్యాగింగ్‌ నిరోధక చట్టం వర్తించదు) వగైరా.
    2) శారీరక దాడి: కత్తులు, చాకులూ, బాకులు తదితర మారణాయుధాలతో బెదిరించడం, గాయపరచడం, హత్యచేయడం; ఏసిడ్‌ దాడులు (ఆ ఏసిడ్‌ ఆఖరికి నిమ్మరసం కూడా కావచ్చు) చేయడం, వగైరా..

4) ఆదర్శం: అవసరమైనప్పుడు వదిలేసి, అఖ్ఖర్లేనప్పుడు పాటించాల్సినది. ఏ విభాగానికి చెందినవారికి ఆయా అదర్శాలు ఉన్నాయి. వీలుంటే వీటిని మార్చవచ్చు (ఆదర్శం 2)
5) పోలీసులు: మృగాళ్లని అరెస్టు చేయువారు. (వారు అందుకోసం 24 గం.లూ వేచి చూస్తూ ఉండాలి). వీరు మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయవచ్చు (ఆదర్శం 3). అందుకు మానవ హక్కులు వర్తించవు (ఆదర్శం 4). "మృగాళ్ల"ను ఎన్‌కౌంటర్‌ చేసినా కోర్టులు శిక్షించరాదు (ఆదర్శం 5).
6) మీడియా: వార్తాపత్రికలూ, టీవీ ఛానెల్సూ తదితరాలూ. తప్పు ఎవరిదైనా సరే, వీరు "పతివ్రత"ల కోసమే పనిచేయాలి (ఆదర్శం 6). 
7) పతివ్రతల సంఘాలు: పతివ్రతల హక్కులకోసం పోరాడు త్యాగశీలులు. (వీరు మాట్లాడేవన్నీ అక్షరసత్యాలు). వీలుంటే వీరికి గుడి కట్టించి పూజించాలి (ఆదర్శం 7)
8) కళాశాల: తప్పనిసరి పరిస్థితులలో ఎందరో పతివ్రతలూ, మృగాళ్ళూ కలిసి చదువుకునే, పాఠాలు చెప్పే, చెప్పించుకొనే చోటు.
9) ఆఫీసు: ఉదరపోషణార్థం పతివ్రతలూ, మృగాళ్లూ పనిచేసే చోటు., అది ప్రభుత్వ సంబంధితమైనా కావచ్చు, ప్రవేటు సంబంధితమైనా కావచ్చు, వేరే ఏ ఇతరములైనా కావచ్చు.
10) సంఘం: పతివ్రతలూ, పతివ్రతలు చేతిలో కీలుబొమ్మలైన కొందరు మృగాళ్ల, సమూహం.

నియమ నిబంధనలు:
1) కళాశాలలోగానీ, అఫీసులోగానీ మృగాళ్లు ప్రవేశించాలంటే, ఆ మృగాళ్లు "ప్రతిజ్ఞ 1" చేయవలసి ఉంటుంది.
2) కళాశాలలోగానీ, ఆఫీసులోగానీ పతివ్రతలు ప్రవేశించాలంటే, ఆ ఆఫీసు, కళాశాలలోని వారందరూ ప్రతీరోజూ  "ప్రతిజ్ఞ 1" చేయాలి.
3) భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని "మృగాళ్ళ భ్రూణహత్యల నివారణ బిల్లు", "మృగాళ్ల ఆత్మహత్యల నివారణ బిల్లు" రూపొందించాలి.
4) మృగాడు తనపై ఎవరైనా పతివ్రత "దాడి" చేసిందని ఆరోపిస్తే, సంబంధిత "పతివ్రత" అంగీకారం మీద సాధారణ కేసు నమోదు చేయవచ్చు. (ఇది పోలీసుల విచక్షణపైనా, పతివ్రతా సంఘాల విచక్షణపైనా ఆధారపడి ఉంటుంది).
5) "దాడి" అరోపణలు రాగానే సంబంధిత "మృగాణ్ణి", తక్షణమే అరెస్టు చెయ్యాలి. అతనికి కనీసం ఆరు నెలలు వరకూ బెయిలు మంజూరు చేయరాదు. అటుపైన చేసినా, సంబంధిత పతివ్రత, పతివ్రతా సంఘాల అంగీకారం మీద చేయాలి.
6) (పతివ్రతలకి ఐచ్ఛికమైన ఒక నిబంధన.) ప్రతిజ్ఞ 2 చేసుకుంటూ ఉండాలి.

శిక్షలు
ఈ శిక్షలని రాజ్యాంగ శిక్ష అనీ, సాంఘిక శిక్ష అనీ రెండు రకాలుగా వర్గీకరించాలి
 రాజ్యాంగ శిక్షలు:
1) "దాడి" జరిగితే సంబంధిత మృగాణ్ణి శిక్షించాలి. ఆ శిక్ష ఏమిటన్నది సంబంధిత "పతివ్రత" యొక్క సంతృప్తి, పతివ్రతా సంఘాల సంతృప్తి మీద ఆధారపడి ఉండాలి (ఆదర్శం 8)
2) కోర్టు విధించదగిన శిక్షలు:
                జైలు శిక్ష (2 రోజుల నుండి యావజ్జీవం వరకూ), కళాశాల లేదా ఆఫీసు నుండి బహిష్కరణ (విద్యార్థి మృగాళ్ళకు టీసీ మీద "రిమార్కులు", పతివ్రతల సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆఫీసులోని మృగాళ్లకు పెన్షన్‌, పీయెఫ్‌ తదితరాలు కూడా రద్దు చేయవచ్చు), రాష్ట్ర బహిష్కరణ, దేశ బహిష్కరణ లేదా లోక బహిష్కరణ (పతివ్రతా సంఘాల సారధ్యంలో).
 సాంఘిక శిక్షలు: దాడి చేసిన "మృగాళ్ల"ను పోలీసులకి అప్పగించబోయే ముందు, తర్వాత "సంఘం" విధించే శిక్షలు కూడా చాలా విధాలుగా ఉన్నా కొన్ని ప్రధానమైనవి బిల్లులో చోటు సంపాదించుకున్నాయి.
1) సంబంధిత "మృగాణ్ణి" చావగొట్టడం, గుండు గీయించి ఊరేగించడం, వెలివేయడం వగైరా
2) మీడియా వారు సంబంధిత "మృగాళ్ల" కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూకి పిలిచి అవమానించడం, గేలిచేయడం వగైరా
3) పోలీసువారు సంబంధిత "మృగాణ్ణి" కోర్టులో హాజరు పర్చే ముందు విధించే శిక్షలన్నీ (ఏ రూపంలో ఉన్నా) ఈ విభాగంలోకే వస్తాయి.

ఆదర్శాలు
         ముందుగా పేర్కొన్న ఆదర్శాలతో పాటు మరికొన్నింటినీ చేర్చి మరొక భాగంగా రాయడం జరుగుతోంది.
1) రాజ్యాంగపరంగా గానీ, సాంఘికంగా గానీ ఒక "పతివ్రత"ని శిక్షించరాదు.
2) వీలున్నప్పుడు లేదా అవసరమైనప్పుడు యీ ఆదర్శాలను మార్చవచ్చు
3) పోలీసులు మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయాలి
4) యీ ఎన్‌కౌంటర్లకు మానవహక్కుల నిబంధనలు వర్తించవు.
5) మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేస్తే, కోర్టులు శిక్షించకూడదు.
6) తప్పు ఎవరిదైనా సరే, మీడియా వారు పతివ్రతలకోసమే పనిచేయాలి
7) పతివ్రతా సంఘాలవారికి గుళ్లు కట్టి పూజించాలి.
8) దాడి చేసిన "మృగాడి"కి విధించవలసిన శిక్ష, సంబంధిత "పతివ్రత"ని, పతివ్రతా సంఘాలని సంతృప్తిపరచే విధంగా ఉండాలి.
ప్రతిజ్ఞలు
1)
                నేను ఒక మృగాణ్ణి. "దాడి" అనేది కేవలం నేను గానీ/ తక్కిన మృగాళ్లు మాత్రమే చేస్తారని త్రికరణశుద్ధిగా విశ్వసిస్తున్నాను. "దాడి" వలనగానీ మరే యితర కారణంచేతగానీ "పతివ్రత" ఆత్మగౌరవానికి భంగం కలిగించిన పక్షంలో రాజ్యాంగబద్ధంగా గానీ, సాంఘికంగా గానీ విధించే శిక్షలు అనుభవించడానికి అంగీకరిస్తున్నాను. నా యొక్క హక్కులూ, రక్షణ పూర్తిగా "పతివ్రత"ల చేతిలో ఉంచడానికి పూర్తిగా అంగీకరిస్తున్నాను. పతివ్రతలు చేసే/చేయబోయే "దాడి"ని గౌరవిస్తాను.
2)  (పూర్తిగా ఐచ్ఛికం)

                     నేను పతివ్రతని. కాబట్టి తప్పుచేసినా, చేయకపోయినా పతివ్రతనే. "పతివ్రత"ని శిక్షించరాదన్న నిబంధనను ఉపయోగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. "దాడి" జరిగిన పక్షంలో నా మనస్సాక్షి ప్రకారంగా శిక్ష విధించమని కోర్టుని కోరతాను. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గను.
.............................................
(ఇది ఈ బిల్లు యొక్క సారాంశ రూపం. తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలరని ఆశిస్తున్నాం.)