29, జనవరి 2012, ఆదివారం

Engineering Education in Telugu [తెలుగులో ప్రౌద్యోగిక (?) విద్య]


ఐక్య ప్రగతిశీల కూటమి - 2 ప్రభుత్వం కొత్తలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కపిల్‌ సిబ్బల్‌ గారి ప్రకటనలో ఒక విషయం ఏంటంటే, 2020 కల్లా "హిందీ దేశం"గా మారే ఆశయం కలిగి ఉన్నామని. అయితే, ఆ ప్రకటనకిగానీ ఆ మంత్రికి గానీ అప్పట్లో అంత ప్రాముఖ్యత లభించలేదు (నాకు తెలిసున్నంతవరకూ..!). ఒకే దేశం, ఒకే భాష అనేది బహుశా ఒక ఆదర్శం కావచ్చు. కానీ ఈ దేశంలో ఎన్నో భాషలున్నాయిఅటువంటప్పుడు హిందీయేతరుల మీద హిందీని రుద్ది దాన్ని అందరి భాష చేయాలనుకోవడం తప్పుడు విధానం. భాష విషయమ్మీద ముక్కలైన దేశాలు చాలానే ఉన్నాయి.. పక్కనే ఉన్న బాంగ్లాదేశ్‌ ఓ ఉదాహరణ. మనదేశంలో మాట్లాడేవారు (+మాట్లాడగలిగేవారినీ) లెక్కలోకి తీస్కుంటే హిందీ అన్నింటికన్నా పెద్దది మరియు ఉత్తరభారతదేశంలో (మాత్రమే) మాట్లాడే భాష; తెలుగు తర్వాతి స్థానంలోనూ, దక్షిణభారతంలో ప్రధానమైన భాషగానూ; బెంగాలీ ఆ తర్వాతి స్థానంలోనూ, తూర్పు భారతంలోని ప్రధాన భాషగానూ ఉన్నాయి.(ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం బెంగాలీ 2వ స్థానం, తెలుగు 3వ స్థానం). తమిళం, మరాఠీ, పంజాబీ వంటి భాషలు కూడా పెద్ద భాషలే. వీటిలో ఒక్క హిందీ మాత్రమే అధికార భాషగా గుర్తింపు పొందింది. తమిళం వాళ్ళు తమభాషని కూడా అధికారభాష చేయాలని తెగ తాపత్రయపడిపోతున్నారు. వాళ్ల వెనకాల తెలుగువాళ్ళు..!

ఇంక ఇంగ్లీషు సంగతి.. దేశంలో 60% మంది హిందీయేతరులు,కనీసం 30% మందికి హిందీతో పరిచయం కూడా లేదు. అలాంటివారికోసం ఇంగ్లీషు వాడుతున్నాం అన్నారు. అది కాస్త, ప్రపంచస్థాయి భాష అయికూర్చుంది. అదీ భారతీయుల వల్లే..! ఎందుకో అందరికీ తెలుసు, ఇంగ్లీషు మాట్లాడేవారు అత్యధికంగా ఉన్న దేశం భారతదేశమే..! సుమారుగా 35-40 కోట్లమంది సులువుగా మాట్లాడేస్తారు ఆంగ్లాన్ని. అది అమెరికా జనాభా కన్నా ఎక్కువ.... భారతీయ ఆంగ్లం (Indian English) అని విదేశీయులు అంటూంటే, వెక్కిరిస్తున్నారని అనుకొని కుమిలిపోవడం, బ్రిటిష్‌ ఇంగ్లీషు, అమెరికా ఇంగ్లీషుని అనుకరించ ప్రయత్నించడమూ అందరికీ తెల్సిందే. అయినా సరే మనకంటూ ఒక ప్రామాణికమైన ఆంగ్ల విశ్వవిద్యాలయాన్ని ఏర్పరుచుకోవడం లేదు. ఇప్పటికీ ఇంగ్లీషు డిక్షనరీ అంటే Oxford Dictionaryనో, వేరే విదేశీ విశ్వవిద్యాలయాల ప్రచురణల్నే ఉపయోగిస్తున్నాం. అంతేగానీ మనకంటూ ప్రత్యేకతని ఏర్పాటు చేసుకునే శ్రద్ధ అయితే ఏమీ లేదు. ఏదో గుడ్డిగా అమెరికానో, బ్రిటన్‌నో అనుసరించెయ్యడమే..!
ఇంక సంస్కృతం సంగతి, భారతదేశానికి చెందిన భాషలన్నింటితోనూ సంబంధాలు ఉన్న ఏకైక భారతీయ భాష ఇదొక్కటే..! ఇది భారతీయ భాష అనీ, మహ గొప్పభాష అనీ చెప్పుకుని చంకలు గుద్దుకోవడమే గానీ, స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి చిత్తశుద్ధితో దీన్ని అభివృద్ధి చేసిన దాఖాలాలు లేవు, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం అధికార భాషగా చేసుకోవడం తప్పించి. మన దేశంలో ఎప్పట్నుండో సంస్కృతం అనుసంధాన భాషగా ఉంటూ వచ్చింది. మన పూర్వీకులు చేసిన పరిశీలనలు, సమీకరించిన విజ్ఞానమూ, వారి ఆలోచనలూ, భక్తీ, ఆధ్యాత్మికత..ఇలా అన్నింటికీ సంబంధించిన database సంస్కృతంలో ఏర్పాటు చేసారు. అదిప్పుడు ఎవడికీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకున్నవాడు నలుగురితో పంచుకోబోయినా పట్టించుకునేవాళ్ళు చాలా తక్కువ. నిజానికి ఇప్పటికీ సంస్కృతం దేశ జాతీయ భాషగా, సాంకేతిక భాషగా వాడుకునేందుకు అవకాశం ఉంది. (ఇజ్రాయేలు దేశం ఈ విషయంలో ఆదర్శం..! ఆ దేశం ఏర్పడే సమయానికి వారి ప్రాచీన భాష హిబ్రూ ఎవ్వడికీ  రాదు. కానీ ఇప్పుడు అది ఆ దేశ అధికార భాష). ఇది స్థూలంగా మన భారతీయ భాషల పరిస్థితి.
మొన్నా మధ్యన రాందేవ్‌ బాబా చేసిన దీక్ష అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ బాబాగారు, పోలీసులు దాడి చేసినపుడు వానరావతారం ధరించి కుప్పిగంతులేసాడు. అది వేరే సంగతి. కానీ, "భారత్‌ స్వాభిమాన్‌"లోని కొన్ని డిమాండ్లు మంచివే చేసాడు. అందులో ఒకటి మాతృభాషలో విద్యాబోధన గురించి. ముఖ్యంగా సాంకేతిక విద్య(Technical Education), వైద్య విద్య ఇంకా ఇతర ఉన్నత విద్యలు కూడా మాతృభాషలోనే బోధించాలని.! ఈ డిమాండ్‌ బాబాగారిది మాత్రమే కాదు, ఇంకా చాలామంది ముందునుండి చేస్తున్నదే.. విద్యాప్రమాణాలు మెరుగుపడడానికి, ఎక్కువమంది సూచించేదే మాతృభాషలో విద్యాబోధన. మనం తెలుగువాళ్ళం కాబట్టి. "తెలుగులో సాంకేతిక/ప్రౌద్యోగిక విద్య" అని వ్యవహరింద్దాం. ఈ టపా ముఖ్యోద్దేశ్యం, దీని గురించి చర్చలాంటిది ఏదైనా జరుగుంతుందనీ, దానికి ఆతిథ్యం ఇద్దామనీనూ..!

సుమారుగా అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ మాతృభాషలోనే విద్యాబోధన సాగిస్తున్నాయి. అమెరికా అయినా, జపాన్‌, కొరియా, బ్రిటన్‌, జర్మనీ ఇలా చాలా దేశాలు. మనదేశంలో మాత్రం ఇంగ్లీషూ అంతర్జాతీయ సమైక్యతా అంటూ ఇంగ్లీషులో కానిస్తున్నారు.( ఆ ఇంగ్లీషులో మన ప్రత్యేకత అంటూ ఏమీ లేదు.) మాతృభాషలో విషయాన్ని అర్థం చేసుకోవడం, తర్కించుకోవడం చాలా తేలిక. వేరే భాష అనేది కేవలం సంభాషించుకునేంతవరకూ, (అది దైనందిన సంభాషణ మొదలుకుని సాంకేతిక సంభాషణ వరకూ ఏదైనా) వస్తే సరిపోతుంది. 
ఫ్రాన్స్‌, జర్మనీ, కొరియా, జపాన్‌ దేశాలు వాటివాటి పరిశోధనలూ, వాటి వాడకమూ (Research and Applications) అంతా తమతమ భాషల్లోనే చేస్తాయి. అక్కడి విద్యార్థులూ, పరిశోధకులూ తమ పరిశోధనా వ్యాసాలనూ, పత్రికలనూ తమతమ భాషల్లో ప్రచురించుకుంటారు. పరిశోధన జరిగిన తర్వాత మాత్రమే ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ప్రచురణకి పంపిస్తారు. మనదేశంలో మాత్రం మొత్తం అంతా ఆంగ్లమే (అదీ బ్రిటన్‌దో, అమెరికాదో అవుతుంది... ఎవడిష్టం వాడిది..!)..! పైపెచ్చు మనభాషల్ని తిట్టుకుంటూ ఉండడమూ..!

సరే నాకు ఇప్పటికి గుర్తొచ్చిన నాలుగైదు ముక్కలూ ఇక్కడ రాసేసాను. పనిలోపనిగా Engineering Educationలోని కొన్ని పదాలని పరిచయం చేయడానికి ఈ పట్టిక రాయడం జరిగింది. (సొంత తెలివితేటల్ని తక్కువగా ఉపయోగించి) మా సంస్థానం నుండి సేకరించినవాట్లో కొన్ని అన్నమాట..! ఓసారి వీక్షించండి తప్పులుంటే సవరించండి. ఖాళీలని పూరించండి.
English
हिंदी
తెలుగు
Engineer
अभियंता
అభియంత
Technical
पारिभाषिक
సాంకేతిక
Technological
प्रौद्योगिक
ప్రౌద్యోగిక
Archetecture & Planning Department
वास्तुकला एवं नियोजन विभाग
వాస్తుకళ మరియు ప్రణాళికా విభాగం
Biotechnology Department
जीव प्रौद्योगिकी विभाग
జీవ ప్రౌద్యోగిక విభాగం
Chemical Engineering Department
रसायन अभियांत्रिकी विभाग
రసాయన  అభియాంత్రిక విభాగం
Civil Engineering Department
जानपद अभियांत्रिकी विभाग

Earth quake Engineering Department
भूकंप अभियांत्रिकी विभाग
భూకంప  అభియాంత్రిక విభాగం
Electrical Engineering Department
विद्युत अभियांत्रिकी विभाग
విద్యుత్‌  అభియాంత్రిక విభాగం
Electronics and Computer Engineering Department


Management studies Department
प्रबन्ध अध्ययन विभाग

Mechanical Engineering Department
यांत्रिक अभियांत्रिकी विभाग
యాంత్రిక అభియాంత్రిక విభాగం
Industrial Engineering Department
औद्योगिक अभियांत्रिकी विभाग
పారిశ్రామిక అభియాంత్రిక విభాగం
Metallurgical & Materials Engineering Department
धातुकर्म एवं पदार्थ अभियांत्रिकी विभाग

Paper Technology Department
कागज प्रौद्योगिकी विभाग
కాగిత ప్రౌద్యోగిక విభాగం
Water Resource Development and Management Department
जल संसाधन विकास एवं प्रबन्ध विभाग
జలవనరుల అభివృద్ధి మరియు నిర్వహణ విభాగం

17, జనవరి 2012, మంగళవారం

ఉత్తరాయణం - మకర సంక్రమణం


అందరికీ భోగి-సంక్రాంతి-కనుమ-ముక్కనుమ శుభాకాంక్షలు..! భోగి పండగ రోజునే వేద్దామనుకున్న ఈ టపాని ఆలస్యంగా ముక్కనుమ రోజున వేస్తున్నా... ఆలస్యానికి చింతిస్తూ..!

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకోవడం మన ఆచారంగా అనాదికాలంగా వస్తోంది. ధనుర్మాసం ఆఖరి రోజు "భోగి" పండుగ. అప్పటివరకూ సూర్యుడు ధనూరాశిలో సంచరించి సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ ప్రారంభమౌతుందని భారతీయుల నమ్మకం. ఈ పండుగ రోజుల్లో పూజలూ, పిండివంటలూ, పతంగులూ మాత్రమే కాకుండా సరదాగా ఈ పండుగ వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం..! ఇంకొక ముఖ్యమైన విషయం.... ఇక్కడ రాసే విషయాలలో నాకు లోతైన జ్ఞానం లేకపోయినా, ఆసక్తికొద్దీ రాస్తున్నాను. తప్పులుంటే సరిదిద్దే ప్రయత్నం చేయగలరు...!

ఉత్తరాయణం అంటే "ఉత్తర దిశలో ప్రయాణం" అని అర్థం. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు ఒకసారి (అరునెలలు పాటు), ఉత్తరం వైపు ఒకసారి (ఆరు నెలలు) ప్రయాణిస్తాడు. అది అందరికీ తెలిసిందే. అందులో, ఉత్తరదిశలో ప్రయాణించే కాలాన్ని "ఉత్తరాయణం"గా, దక్షిణదిశలో ప్రయాణించే "దక్షిణాయణం"గా వ్యవహరిస్తున్నాం. "మకర సంక్రమణం" అంటే మకర రాశిలోకి ప్రవేశించడం. అయితే, సూర్యుని ఉత్తర దిశా గమనం, మకర సంక్రాంతి కన్నా 25(సుమారు) రోజులు ముందే మొదలైపోతుంది. అంటే "ఉత్తరాయణం" ముందే ప్రారంభమైనట్టు...!

ఋతువులు ఏర్పడే క్రమం గురించి మనకి ముందే తెల్సు కదా... ఈ క్రింది చిత్రం దానికి సంబంధించినదే..!

డిసెంబర్‌ 21/22 న సూర్యుడు మకరరేఖ (అంటే దక్షిణార్థ గోళంలో) ఉంటాడు. ఆరు నెలల తర్వాత అంటే జూన్‌ 20/21న కర్కాటకరేఖ (అంటే ఉత్తరార్థ గోళం)పైకి వస్తాడు. అంటే ఉత్తరంగా ప్రయాణించినట్టేగా..! అదే ఉత్తరాయణం ...! అలాగే మరో ఆరు నెలలు తిరిగేసరికి అంటే డిసెంబర్‌ 21/22కి మకరరేఖ పైకి వెళ్తాడు. అంటే దక్షిణంగా ప్రయాణించినట్టు., అది దక్షిణాయణం..! సంవత్సరంలో సూర్యుని కదలికలని(భూమికి సాపేక్షంగా) ఈ క్రింది చిత్రం స్పష్టతనివ్వవచ్చు..!


ఇక్కడ చెప్పేదేంటంటే, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం అనేది ఒక కొండ గుర్తు మాత్రమే..! నిజానికి ఉత్తరాయణం ఇంకా ముందే మొదలైపోతుంది. (తిలక్‌ ఆర్యవలస సిద్ధాంతాన్ని సమర్ధించిన విధంగా చూస్తే, ఉత్తర ధృవం వద్ద పగలు ప్రారంభమయ్యేది కూడా ఉత్తరాయణంలోనే అంటే డిసెంబర్‌ 20/21 తర్వాతనే..!) ప్రతీ యేడాదీ., సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడానికీ, ఉత్తరాయణం ప్రారంభం కావడానికీ మధ్యలో 50 సెకండ్ల తేడా పెరుగుతోదని, ఇప్పటి పరిశీలన..! మన జ్యోతిష్కులు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు(ట).. అందుకే సంక్రాంతి, ప్రతీ 80 సంవత్సరాలకోసారి ఒకరోజు వాయిదా వేయబడుతూ వస్తోంది.

ఆర్యభట్టుని సూర్య సిద్ధాంతం ప్రకారం ఉత్తరాయణ ప్రారంభానికీ(డిసెంబర్‌ 21/22), సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడానికి మధ్యన ఉండే వ్యవధి గరిష్టంగా 27కి చేరి, ఆ తర్వాత తగ్గింపబడుతుంది (లేదా తగ్గిపోతుంది). ఈ లెక్క ప్రకారం 2294 సంవత్సరం తర్వాత మకర సంక్రాంతి ముందుకి జరుగుతూ వస్తుంది (80 ఏళ్లకోసారి..). కానీ ఇప్పటి ఆధునిక విజ్ఞానవేత్తల ఉద్దేశ్యం, అది అలా పెరుగుతూనే ఉంటుందని..!

సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజున మంటలు ఎందుకు వేస్తారు అనేదానిక్కూడా ఇక్కడే సమాధానం వెతుక్కోవచ్చు. ఉత్తరాయణ ప్రారంభం అయ్యే రోజుగానీ, ఆ ముందు రోజుగానీ, మొత్తం సంవత్సరంలో రాత్రిభాగం ఎక్కువగా ఉండే రోజు అవ్వడం వల్లన మంటలు వేసి పండగ మొదలుపెట్టడం వచ్చి ఉండచ్చు..! అయితే, ముందు చెప్పినట్టు ఉత్తరాయణ ప్రారంభం డిసెంబర్‌ 21/22 అవ్వడం వల్ల, సంక్రాంతి ఎక్కువ రాత్రి భాగం ఉందే రోజు అవ్వదు..! ఇప్పుడంటే, డిసెంబర్‌ 21/22 అని ఉత్తరాయణ ప్రారంభం(Winter solistice) గురించి సులువుగా చెప్పేస్తున్నాంగానీ, 200 సంవత్సరాల క్రితం సరిగ్గా చెప్పే విధానం జనంలో వాడుకలో లేదు కదా..! మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అంటే ఖచ్ఛితంగా ఉత్తరాయణం మొదలైపోయిందని నిర్ధారించేసుకోవచ్చు కనక, మకర సంక్రమణం వరకూ ఆగి, అప్పుడు పండగ మొదలుపెట్టి ఉండవచ్చు..! సరే..! ఈ లెక్కన దక్షిణార్థగోళంలోని వారు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలేండ్‌, దక్షిణ ఆఫ్రికా లాంటి చోట్ల మకర సంక్రాంతికి బదులు కర్కాటక సంక్రాంతి (జూన్‌ జూలైల దగ్గర) జరుపుకోవాలేమో..!

References:

16, జనవరి 2012, సోమవారం

బిజినెస్‌ మేన్‌ సినిమా




ఏదైనా తెలుగు సినిమా ఇన్ని సెంటర్లలో రిలీజైంది, అన్ని సెంటర్లలో రిలీజైంది అని చదివితే ఓహో అనుకుని వదిలెయ్యడమేగానీ, మనకు దగ్గర ఊళ్ళో ఎక్కడైనా వచ్చిందేమోనని ఎప్పుడూ ఆలోచించలేదు, ఎందుకంటే ఇంత దూరంలో తెలుగు సినిమా రిలీజవ్వదని నమ్మకం కాబట్టి..! తెలుగు సినిమా కావాలి అంటే ఢిల్లీకెళ్ళిపోయి చూడ్డమో, లేక అంతర్జాలంలో దొరికితే దింపుకుని చూడ్డం అంతే..! పోనీ ఢిల్లీలో చూద్దామనుకుంటే,  పట్టుమని వారం రోజులు కూడా ఏ ప్రాంతీయ సినిమా ఆడలేదు. (కొన్ని exceptions ఉంటాయిలెండి). అందువల్ల తెలుగు సినిమా ధియేటర్లో చూడ్డం దాదాపుగా అసాధ్యం..మరి సరదాని వదిలేసుకోలేం.., ఇంటికొచ్చి చూసేంతవరకూ వెయిట్‌ చెయ్యలేం..! ఇలాగే ఏడాదిన్నర అయిపొయ్యింది. అటువంటప్పుడు ఒక తెలుగు సినిమా.., అందులోనూ మహేష్‌బాబు - పూరి కాంబినేషన్‌ సినిమా "బిజినెస్‌ మేన్‌".., పక్కనే దెహరాదూన్‌ (Dehradun)లో రిలీజైందంటే చూడకుండా ఎలా ఉండటం..? అందుకే వెళ్ళి చూసొచ్చేశాం..! మరి చూసిన తర్వాత తెలుగు సినిమా(ధియేటర్‌ లో) చూసిన ఆనందం బ్లాగులో రాసుకోకపోతే మనసొప్పదు కదా...! అందుకే ఈ టపా..! నిజం చెప్పాలంటే "రాజకుమారుడు" తర్వాత, నేను ధియేటర్లో చూసిన మొట్టమొదటి మహేష్‌ బాబు సినిమా "బిజినెస్‌ మేన్‌"...!, "పోకిరి", "మురారి" తో సహా అన్నీ టీవీల్లోనో, కంప్యూటర్లోనో చూడ్డమే..!

సినిమా గురించి రివ్యూ రాసేద్దామంటే, పూరి "నేనింతే" సినిమాలోని డైలాగులు అడ్డొస్తున్నాయి..! అయినా, నచ్చినవి నచ్చనవి ఏకరువు పెట్టేద్దామని డిసైడైపోయి కొన్ని రాసేస్తున్నాను., చూస్కోండి.. (తర్వాత నన్ను తిట్టద్దు..!) మహేష్‌ - పూరి కాంబినేషన్‌ లో ఇంతకు ముందొచ్చిన "పోకిరి" బంపర్‌ హిట్‌ కనక, వద్దు వద్దంటున్నా నా బుర్ర "బిజినెస్‌ మేన్‌"ని దానితో కంపేర్‌ చేసేస్తోంది. కాబట్టి ఈ టపా వరకూ సర్దుకుపోండి..!

1) సినిమా మొత్తం మహేష్‌ బాబే కనిపిస్తాడు. ఇది మహేష్‌ బాబుకు సంబంధించినంతవరకూ ఓకే., కానీ కథ మొత్తం హీరోయే అయితే ఎప్పటికైనా మొహం మొత్తేస్తుంది. "దూకుడు" సినిమా హిట్టైనంత మాత్రాన మహేష్‌ బాబే సినిమా మొత్తం ఉండేలా ప్లేన్‌ చేసుకోవడం ఎప్పటికైనా బెడిసికొడుతుంది. అయితే, ఈ సినిమాకింకా ఆ ప్రమాదం లేదు.

2) ఒకటి రెండు పాటలు మినహా ఏ పాటా కూడా సందర్భానికి తగినట్టు అనిపించలేదు. ఆ ఉన్న ఒకట్రెండు కూడా మహ గొప్పగా ఏమీ లేవు. గట్టిగా మాట్లాడితే థమన్‌ "కిక్‌" సినిమాకి మినహా ఇంకదేనికీ మంచి బాణీలు ఇవ్వలేదు (కనీసం సందర్భోచితంగా). "సారొస్తారా" పాటొక్కటే అప్పుడుప్పుడు సరదాగా పాడుకొనేలా ఉంది. ఇంకేవీ జనంలోకి అట్టే గుర్తుండవు. మరి పోకిరి సినిమాలో అన్ని పాటలూ సందర్భోచితంగానే ఉంటాయి..!

3) బ్రహ్మానందం లేకపోవడం అస్సలు నచ్చలేదు. బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా..? ఊహించుకోడానికే కష్టంగా ఉంది.. అలాగే బాధగా కూడా..!

4) డాన్స్‌ లో మహేష్‌బాబు "తండ్రిని మించిన తనయుడు" అనిపించాడు. పాటలు ఎప్పుడు అయిపోతాయా అనిపించింది..చాలా మటుక్కి..!

5) పూరి డైలాగులు అక్కడక్కడా చాలా గట్టిగా పేలాయి.., ధియేటర్లో విజిల్సే., అలాగే కొన్ని డైలాగులు చాలా బాగున్నాయి.., "అశ్వమేధ యాగం" గురించి, అహింస గురించీ ఇలాంటి డైలాగులు లేకపోతే ముందు ముందు అవేమిటో కూడా తెలీని రోజులు వచ్చినా వస్తాయి. కొన్ని డైలాగులు అస్సలు బాగోలేదు.., ముఖ్యంగా మహేష్‌ బాబు మాటిమాటికీ చిటికెన వేలు పైకెత్తి(ఒంటేలు) చూపెట్టడం..., బూతులు మాట్లాడపోయినా (సె న్సార్‌ లో కట్‌ చేసినట్టున్నారు) లిప్‌ మూవ్‌ మెంట్‌ ఇచ్చేసి బీప్‌ సౌండ్లివ్వడం అస్సలు నచ్చలేదు. ఇంట్లోవాళ్లతో సరదాగా చూసే సినిమా అస్సలు కాదు. (అందుకే 'A' సర్టిఫికెట్‌ ఇచ్చారనుకోండి.., అది వేరే విషయం). పూరి కలం పదును తగ్గుతోందనిపిస్తోంది.

6) రెండు గంటల సినిమా అవ్వడం వల్లటైం తెలీలేదు.., విసుగూ రాలేదు.,

7) ఒకదానికొకటి అతకని సీన్లు చాలానే ఉన్నాయి. ప్రకాష్‌రాజ్‌ నాజర్‌ని ఎందుకు చంపించాడో అర్థం కాదు.., అలాగే చివర్లో క్లయిమాక్స్‌ సీన్‌ కూడా అస్సలు ఊహించకుండానే వచ్చేస్తుంది. క్లయిమేక్స్‌ లో మహేష్‌ బాబు డైలాగులూ, నాజర్‌ చచ్చిపోవడం (చంపబడడం) చూస్తే పూరి "బిజినెస్‌ మేన్‌ -2"కి కథని ముందే ప్లాన్‌ చేసుకుని ఉన్నాడనిపిస్తోంది.

8) పూరీ కథ విషయంలో ఇంకా పకడ్బందీ వ్యవహరించాల్సింది. ఉదాహరణకి కాజల్‌ కమీషనర్‌ కూతురు తెలీడం ఫస్ట్‌ హాఫ్‌ లో వేస్ట్‌.! కానీ హీరో మొదట్లోనే చెప్పేస్తాడు "కాజల్‌" వెంట ఎందుకు పడుతున్నానోనని., అందువల్ల అదంతా చప్పగా సాగిపోతుంది. అలాగే బ్రహ్మాజీ కారెక్టర్‌ పూర్తిగా వేస్ట్‌. ధర్మవరపు సుబ్రమణ్యం, సయాజీ షిండే, ఆఖరికి ప్రకాష్‌ రాజ్‌ కూడా ప్రత్యేక పాత్రలాగే అనిపించింది. కానీ "పోకిరి" సినిమాలో వేస్ట్‌ కేరక్టర్లు ఏమీ లేవు.. ప్రతీ డైలాగ్‌ కీ పూరీ న్యాయం చేసాడు స్క్రిఫ్ట్‌ వర్క్‌ తో.., అదిక్కడ మిస్సింగ్‌..!..!

9) మహేష్‌ పెద్ద డాన్‌ అయ్యిన ఫీలింగ్‌ అస్సలు రాలేదు.., ఏమాటకామాటే చెప్పుకోవాలి  ఒక్కసారి రజనీ "భాషా" సినిమా గుర్తు తెచ్చుకోండి. "భాషా"లో రజనీ, "పోకిరి"లో ప్రకాష్‌ రాజ్‌ లతో పోలిస్తే "బిజినెస్‌ మేన్‌" సెకండాఫ్‌లోని మహేష్‌ ...............Donగా Nothing..!


10) చివర్లో మళ్లీ సందేశం ఒకటి....ఒళ్ళు మండడానికి..!

ఇంతకన్నా ఎక్కువ రాయలేను. ఏదియేమైనా 150 రూపాయల టిక్కెట్టు వేస్ట్‌ కాలేదనిపించింది. సో..! ఆల్‌ హేపీస్‌..!
సరే, ఎలాగూ సినిమా గురించి ఇంత రాసేసాను కాబట్టి, పూరీకి, మహేష్‌ కీ, ఇంకా సినిమావాళ్లకీ ఒకట్రెండు ఉచిత సలహాలు పడేద్దామని డిసైడైపొయ్యాను..!

తెలుగు సినిమా అని ఒకటుందని, ఉత్తరాదివారికింకా తెలీడం లేదు.., కానీ "తమిళ" సినిమాకి, తమిళ భాషకి గుర్తింపు ఉంది. కారణాలు అనవసరం..! మార్చడానికి ప్రయత్నించడమే అవసరం..! "మగధీర", "అరుంధతి", "హేపీడేస్‌", "బొమ్మరిల్లు"..ఇంకా చెప్పాలంటే "పోకిరి" మాత్రమే హిందీవాళ్లకి తెలిసున్న (నచ్చిన) తెలుగు సినిమాలు. తమిళ డబ్బింగ్‌ సినిమాలు తెలుగులో ఆడడం ఎంత సాధ్యమో, తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ చేస్తే ఆడడం కూడా అంత సులువు.. ఇక్కడ (ఉత్తర భారతం)లో "నమో వేంకటేశ", "నరసింహుడు" లాంటి అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాలు, "లీలామహల్‌ సెంటర్‌" లాంటి ఎప్పుడొచ్చాయో ఎప్పుడెళ్ళిపోయాయో కూడా తెలీని సినిమాలు, హిందీలో డబ్‌ చేస్తే రెండు - మూడూ వారాలు ఆడిన సందర్భాలున్నాయి., తెలుగు డబ్బింగ్‌ (హిందీలో) సినిమాలు టీవీల్లో వస్తే వెర్రోళ్లలగా చూసేవాళ్ళున్నారు. IITలోనైతే మగధీర సినిమా ప్రతీ ఒక్కడి కంప్యూటర్‌ లోనూ కనీసం 30-40 సార్లు ఆడి ఉంటుంది (హిందీలో కూడా కాదు తెలుగులోనే..! కొన్ని సార్లు subtitles కూడా ఉండవు). రాయ్‌పూర్‌, నాగ్‌పూర్‌ లాంటి చోట్ల "పోకిరి" సినిమా తెలుగులో (డబ్బింగ్‌ కూడా కాదు..!) చూసి, దాని హిందీ రీమేక్‌ సల్మాన్‌ "వాంటెడ్‌" సినిమా చూడలేక మధ్యలోనే ధియేటర్లనుండి పరిగెట్టిన హిందీవాళ్ళున్నారు. కానీ వీళ్లందరూ చెప్పుకునేది మాత్రం "సౌతిండియా సినిమా" అని మాత్రమే... తెలుగు సినిమా అని కాదు..!


మన బ్రహ్మానందం, చిరంజీవి అందరికీ తెలుసు.., మహేష్‌ బాబుకి విపరీతమైన ఫేన్స్‌ ఉన్నారు (ముఖ్యంగా యూత్‌ లో..!), అటువంటప్పుడు సరిగ్గా ప్లాన్‌ చేసుకుని తెలుగు సినిమాని హిందీలో డబ్‌ చేసి వదిలేస్తే ఎందుకు ఆడదు..?

మహేష్‌ బాబుకున్న ప్రధానమైన ప్లస్‌ పాయింట్‌, ఇప్పటి కుర్రాళ్లలో ఉన్న సాఫ్ట్‌ రఫ్‌నెస్‌(Soft Roughness) ని కరెక్ట్‌ చూపించడం., అందుకే అతను చాలామందికి (ముఖ్యంగా అమ్మాయిలకి) నచ్చుతున్నాడు. పోకిరి అయినా, ఒక్కడు, మురారి, అతడు, ఖలేజా ఇలా ఏ సినిమా అయినా..! 9 కోట్ల ఆంధ్రుల సైకాలజీ ఎలా ఉంటుందో, మిగిలిన 110 కోట్ల భారతీయుల సైకాలజీ అలాగే ఉంటుంది. ఆంధ్రాలో నచ్చితే దేశం మొత్తం నచ్చుతాడు.. ప్రయత్నం మాత్రం చేయాలి..అంతే..! సరిగ్గా మాట్లాడితే మహేష్‌ స్థాయిలోని వాళ్ళు బాలీవుడ్‌ లో ఎవ్వరూ లేరనిపిస్తుంది., అది షారుఖ్‌ అయినా, సల్మాన్‌ అయినా.., ఇందాక చెప్పానుగా తెలుగు "పోకిరి" చూసినవాళ్లు హిందీ"వాంటెడ్‌" చూడలేక పరిగెట్టేసారని..! కరెక్టుగా ప్రయత్నిస్తే అమితాబ్‌ తర్వాత మహేష్‌ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది.


పూరి జగన్నాథ్‌ విషయంలో నాకొక కథ గుర్తొస్తోంది. ఒక జమీందారు., తన తోటలోని చెట్లు కొట్టించడానికి ఒక పనివాణ్ణి పురమాయించాడట..రోజుకూలీ మీద..! ఈ పనివాడు మొదటి 40 చెట్లు కొట్టేసాడు., రెండో రోజు 20 చెట్లు కొట్టాడట., మూడో రోజు 10, నాలుగో రోజు 5... ఇలా తగ్గిపోతూ ఆఖరికి ఒకరోజు ఒక్క చెట్టూ పూర్తవ్వలేదట.., దాంతో జమీందారికి కోపం వచ్చింది., ఈ పనివాడు బద్ధకంతో పని చెయ్యడం లేదని.., కూలీ ఇవ్వను పొమ్మన్నాడట., ఈ పనివాడు అటువంటిదేమీ లేదు, నిజంగానే కష్టపడ్డానని లబోదిబోమన్నాడు. అటుగా పోతున్న ఒక మేస్టారు ఈ తతంగమంతా చూసి వాళ్ల మధ్య గొడవ తీర్చడానికొచ్చి., తేల్చినదేంటంటే, పనివాడు నిజంగానే కష్టపడ్డాడు, కానీ పని మాత్రం జరగడం లేదు., ఎందుకంటే అతనికి పని చేసిన తర్వాత, ఏరోజుకారోజు గొడ్డలికి పదును పెట్టాలని తెలీదని..! ఈ కథ పూరికీ సరిగ్గా సరిపోతుంది..!

దెహరాదూన్‌ లో మూడ్రోజులే ఆడుతుందనుకున్న "బిజినెస్‌ మేన్‌" సినిమాని ఇంకో నాలుగురోజులు కొనసాగిద్దామని ధియేటర్‌ యాజమాన్యం అనుకోవడం కొసమెరుపు...! దాంతో ఇక్కడి తెలుగువాళ్లు పండగ చేసేస్కుంటున్నారు...IITiansతో సహా..!

11, జనవరి 2012, బుధవారం

జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు..!


భారతీయులకి, భారత యువతకీ "జాతీయ యువ దినోత్సవ" (National Youth Day) శుభాకాంక్షలు..! ముందుగానే..


1984 నుండి వివేకానందుని జన్మదినం అంటే జనవరి 12(రేపు), జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాం...!

ఆధునిక యుగ వ్యాస మహర్షి 



జై భారత్‌....

1, జనవరి 2012, ఆదివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


యావన్మంది బ్లాగ్ప్రజానీకానికీ తెలియజేయునది ఏమనగా....

"మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 2012 నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు..."