6, జులై 2012, శుక్రవారం

భోపాల్ వాయు విలయం/ఘోర విపత్తు (Bhopal Gas Disaster)



ఈ కర్మాగారం భారతదేశంలోని మధ్యప్రదేశ రాష్ట్రంలోనిది. దీని యాజమాన్యం పాక్షికంగా యూనియన్ కార్బైడ్ సంస్థ చేతుల్లోనూ, కొంత స్థానికుల చేతుల్లోనూ ఉండినది. ఈ కర్మాగారం నిర్మితమైనప్పుడు అత్యంత సమీపంలోని జనావాసం ఒకటిన్నర మైళ్ల దూరంలో ఉండినది. అయితే, కర్మాగారం స్థానికంగా ఉపాధికల్పనలో అగ్రగామిగా ఉన్న కారణంగా, కర్మాగారపు శివారులలో ఊరు పెరిగిపోయింది.

ఈ కర్మాగారం క్రిమిసంహారకాలను ఉత్పత్తి చేసేది. ఈ ప్రక్రియ మధ్యలో మిథైల్ ఐసో సైనేట్ (MIC) ఉత్పత్తి చేయబడుతుంది. ఈ MIC అత్యంత ప్రమాదకరమైన పదార్థం. అంతేగాక ప్రతిక్రియాశీలత, విష లక్షణాలు, అస్థిరత, జ్వలనశీలత ఎక్కువగా ఉన్న పదార్థం. దీని గరిష్ట బహిర్గత ఘాడత 0.02 ppm (ఎనిమిది గంటలు దాకా పనిచేసే కార్మికులకి). 21ppm ఘాడత గలిగిన భాష్పవాయువు (ఆవిరి)ని ఎవరైనా పీలిస్తే గొంతులోనూ, ముక్కులోనూ తీవ్రాతితీవ్రమైన చికాకు కలుగుతుంది. అంతకంటే ఎక్కువైతే శ్వాసకోశ ఇబ్బందులచేత మరణం సంభవిస్తుంది.
  
సాధారణ వాతావరణ పరిస్థితుల్లో, దీని మరుగు స్థానం 39.1 0C. 20 0C వద్ద దీని భాష్ప పీడనం 348mm Hg. ఈ భాష్పాలు గాలికంటే రెండురెట్లు బరువైనవి. అందువల్ల, విడుదల అయిన తర్వాత తొందరగా (పైకి పోయి) గాలిలో కలిసిపోకుండా నేలకి దగ్గరగా ఎక్కువసేపు ఉంటాయి. నీటితో దీని చర్య ఉష్ణమోచకమైనది. ఈ చర్యావేగం తక్కువే అయినప్పటికీ అరకొర శీతలీకరణ వలన ఉష్ణోగ్రత పెరిగిపోయి MIC భాష్పీభవనం చెందుతుంది. అందువలన, MICని నిల్వచేసే ట్యాంకులు సమగ్రమైన శీతలీకరణ వ్యవస్థలను కలిగి ఉండాలి.

1984 డిసెంబరు 3-4వ తేదీన, భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ యొక్క రాత్రి-షిఫ్టు కార్మికులు, రాత్రి 11 గం.టల ప్రాంతంలో కర్మాగారంలో రౌండ్సుకు వెళ్లారు. ద్వైకుడ్య నిర్మితాలు (Double-walled structures), పాక్షికంగా పాతిపెట్టబడినవి అయిన స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకులు (నెం: 610, 611 మరియు 619, సామర్థ్యం: 60 టన్నులు) మూడు ఉన్నాయి. వీటిలో MIC నిలువ చేయబడి ఉన్నది. (ఈ MICని వాడుకొనే కర్మాగారంలోని ఉపవిభాగం, స్థానిక కార్మిక-యాజమాన్య వివాదాల కారణంగా ఉత్పత్తిని కొద్దినాళ్ళుగా నిలుపుచేసి ఉన్నది.) 11.30 గంటల ప్రాంతంలో, MIC ఎక్కడో లీకవుతున్నట్టు కార్మికులు గుర్తించారు. కొద్దిమంది, MIC నిర్మాణం వద్దకు వెళ్లినపుడు పసుపు-తెలుపు పొడలు గల వాయువుని వెలువరిస్తూ ఉన్న ద్రవం సుమారు 50 అడుగులమేర విరజిమ్మబడినట్టు గుర్తించారు. వారు తమ పర్యవేక్షకునికి నివేదించగా, అతను తదుపరి చర్యలను టీ విరామం (12 గం. 40ని. లకు ముగిసింది) తర్వాత చేయవలసిందిగా నిర్ణయించాడు. అయితే, ఈలోపునే పరిస్థితులు వేగంగా మారిపోయాయి.


610 నెం. ట్యాంకు యొక్క ఉష్ణోగ్రత 25 0C (దాని గరిష్ట పరిమితి)కి చేరుకున్నది మరియు దానిలోని పీడనం 20 రెట్లు పెరిగి, 40 psi వైపుకి పరుగులు తీసింది. ఈ పీడనం వద్ద అత్యవసర భద్రతా కవాటం (Emergency Safety Valve) తెరుచుకోవాలి. తక్కువసమయంలోనే, పీడనమాపనం 55 psi(దాని గరిష్ట పరిమితి)ని చూపించేసింది. భద్రతా కవాటం తెరుచుకుని,  బిగ్గరగా బుసలు కొడుతూనూ, విపరీతంగా వేడిని విడుదల చేస్తూనూ MIC బయటికి రాసాగింది. కర్మాగారంపైన ఏర్పడుతున్న తెలుపురంగులోని వాయుమేఘం, నిద్రిస్తున్న జనావాసాలవైపు వ్యాపించసాగింది.

  కార్మికులు భద్రతాపరికరాలను ఉపయోగించారు కానీ అవేమీ పనిచేసినట్టుగా తెలియరాలేదు. MICని విడుదల చేస్తున్న 120 అడుగుల పొగ గొట్టాన్ని నీటిధార చేరలేకపోయింది. బయటికి పోతున్న వాయువుని తటస్థీకరించడానికి ఉద్దేశించిన Vent Gas Scrubber పని చేయలేదు. Scrubber మరమ్మత్తులలో ఉన్నది. Caustic soda వ్యాప్తిని ప్రవాహమానిని (flow meter) చూపించడం మాసేసింది. ఈ Caustic soda యొక్క ఘాడత అక్టోబరు నుండీ తెలీదు. ఈ వాయువుని కాల్చివేయవలసిన జ్వలనగోపురం (Flare Tower)గొట్టాలు తుప్పుపట్టడం మరియు మార్చకపోవడం” వలన అక్కరకు రాకుండా పోయింది. 30 టన్నుల సామర్థ్యం గలగి, MICని 0 0C వద్ద ఉంచవలసిన శీతలీకరణవ్యవస్థ 1984 జూన్ నుండి ఆపుజేయబడి ఉన్నది (ఖర్చు తగ్గించాలనే ఉద్దేశ్యంతో) మరియు భద్రతారహితమైన 15-20 0C ఉష్ణోగ్రత వద్ద MIC ఉండింది. ఆ 610 నెంబరు ట్యాంకులో నిల్వ చేయబడి ఉన్న 90000 పౌన్ల MICలో, 50000పౌన్ల MIC (Phosgene, Chloroform, Hydrogen cyanide. Carbon dioxide వంటివాటిని కూడా కలిగి ఉండవచ్చును), ఇంచుమించు రెండు గంటలపాటు విడుదలవుతూ ఉండింది. 1.30-2.30 ప్రాంతంలో, ట్యాంకులోని పీడనం 40psi కిందకి చేరిన తర్వాత భద్రతాకవాటం దానంతటదే మూసివేయబడ్డది.
ఈ విషవాయు మేఘం శివారు పట్టణంలోకి వ్యాపించి వేలాది మరణాలకి కారణమయ్యింది. లక్షలాదిమంది  ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయబడ్డారు. అయితే, కర్మాగారంలోని కార్మికులలో ఎవరూ గాయపడలేదు, మరణించలేదు. ఏ పరికరమూ దెబ్బతినలేదు.
MIC ట్యాంకులలోకి ఏదో కారణంచేత నీరుగానీ మరో పదార్థంగానీ చేరిందని భావిస్తున్నారు. దానికి గల సరైన కారణాలేమిటన్నది ఎవరికీ తెలియలేదు. ప్రకియలోని లోపాల వల్లనే MIC లీకై ఉంటే ప్రణాళికాబద్ధ భద్రతా విశ్లేషణ (Formal Safety Review) ద్వారా ఈ కారణాలు తెలిసి ఉండేవి. అందువలన ప్రక్రియలోని లోపం కాదని చాలామంది ఉద్దేశ్యం. అయినా, ప్రత్యామ్నాయ ప్రక్రియా మార్గాలు సూచించబడ్డాయి. ఒక ప్రక్రియ కింద చూపబడింది. 

మూలాలు
2) Chemical Process Safety, Fundamentals with Applications, D. A. Crowl, J. F. Louvar, Prentice Hall, 3rd Edition, 2011.

9, జూన్ 2012, శనివారం

తీరు మారితేనే ఎదుగుదల



“ధూమశకట గమనాగమన...” అనేదో అనాల్సొస్తుంది, అందువల్ల ఎందుకొచ్చిన గొడవిదంతా ఉన్నదున్నట్టే పిలిద్దాం, అని రైల్వే స్టేషన్ను తెలుగులో ఏమంటారు, అని అడిగిన ప్రశ్నకి కొంతమందిచ్చిన సమధానం. ఇది పూర్తిగా వెక్కిరింత తప్ప మరొకటేమీ కాదు.  “ధూమశకట గమనాగమన...” అనేది తెలుగు మాట కాదు, సంస్కృత పదం. ప్రతీ చిన్న మాటకీ సంస్కృతంవైపు చూడడం ద్వారా తెలుగునీ, అనవసరమైన గందరగోళాన్ని సృష్టించడం ద్వారా సంస్కృతాన్నీ, అడిగిన తెలుగువాణ్ణి చేసిన వెక్కిరింపు అది. సంస్కృత జన్యపదమే రాయాలని నియమమే పెట్టుకొని ఉంటే Railway Stationకి “శకట స్థావరం” అనో, ఇంకోటో, మరోటో రాసుకోవచ్చు (Stationary Electricityకి స్థావర విద్యుత్ అనే రాస్తున్నాం పాఠశాలల అచ్చు పుస్తకాలలో). పొగబండి (డీసిలుదైయినా, బొగ్గుదైనా) అయితే ధూమశకటమనీ, ఎలక్ట్రికల్ దాన్ని విద్యుత్ శకటమనీ రాసుకోవచ్చు. లేదంటే సులువైన తెలుగే రాయాలనిపిస్తే, “రైలాగే చోటు” అని అందరికీ అర్థమయ్యేలా రాయొచ్చు, లేదా మాండలికాలనుండి ఏరుకొని రావొచ్చు. ఇంతకు ముందు ఇక్కడ వచ్చిన వ్యాసాలలో సూచించినట్టు నిల్తావు (నిలిచే తావు) అనే వాడొచ్చు. కాదు, జనాలు “స్టేషన్” అనే మాటకి అలవాటు పడిపోయారు, అనుకుంటే రైలు స్టేషను అని రాసేసుకుని, రైలునీ, స్టేషనునీ, తెలుగువారు మాత్రమే పలికే “టేసను”నీ నుడిగంటులకి ఎక్కించేసి, అవి తెలుగుమాటలే అని ముద్ర వేసెయ్యొచ్చు. అంతేగానీ తెలుగు అనవసరం అనుకోవక్కర్లేదు. అసలు రైలుబండికి, ధూమశకటమనే పేరు ఎవరు సృష్టించారో అని ఆలోచిస్తే, మన గుర్తుకొచ్చేది బ్రహ్మంగారు. ఆయన కాలఙ్ఞానంలో పొగబళ్ళను ఉద్దేశించి “ధూమశకటం” అంటే, దాన్ని పట్టుకుని, మనదేశానికి రైలుబళ్లు వచ్చిన కొత్తలో బ్రహ్మం గారు చెప్పింది జరిగిపోయిందని, ఉత్సాహంలో “రైలు అంటే ధూమశకటం”అని తెలుగువాళ్లంతా నిర్ణయించేసుకుని అక్కడే ఉండేపోయారు. అక్కడినుండి బయటికి రావట్లేదు. ఇంక, పైన చెప్పుకున్న “టేసను”ని పలికేవాళ్లని చాలామంది వెక్కిరింపుగా చూస్తారుగానీ, అది తెలుగువారికే ప్రత్యేకమైన, సొంతమైన పలుకు అని మనం గుర్తించినపుడువారిని అభినందించక మానం. బహుశా, ప్రపంచం మరెవ్వరూ అలా పలకరు. మరి అట్టాంటి మాటని, “తెలుగు” అనడానికి అభ్యంతరమేంటి.? టేసను అని కొంతమంది తెలుగువారంటున్నట్టే, “ఇస్టేసన్” అని హిందుస్తానీ (హిందీ+ఉర్దూ)వాళ్లు అంటారు. అది వారి పలుకుబడి. టేసను మన పలుకుబడి. అలాగే, రైలు అని మనం అనేదానికి ఇంగ్లీషు మూలం రైలుపట్టాలని ఉద్దేశించినది. మనకి రైలు అనగానే, ఓ ఇంజినూ, వెనక నాల్గు బోగీలు గుర్తొస్తాయి.అంటే Train=రైలు, Rail=పట్టా, ఇదీ మన వాడుక. అందువల్ల తెలుగు రైలు వేరు, ఇంగ్లీషు రైలు వేరు. రైలుబండి అని తెలుగువారు పిలిచినట్టే, “రేల్ గాడీ”అని హిందీవాళ్ళూ పిలుస్తారు. తేడా గమనించారా..? తెలుగువారు ఎక్కాల్సింది “రైలు”, హిందీవారు ఎక్కేది “రేల్”.

“శకటం” అంటే బండి అనే అర్థం వస్తుంది, అది ఎడ్లబండి, గుర్రపు బండి ఏదైనా కావచ్చు కదా, అని కొంతమంది అనొచ్చు. శకటం అనే పదం సృష్టించినప్పుడు దేనికి వాడారో మనకి తెలీదు. మనకి తెలిసిందల్లా “బండి”కి వాడారు, అని. ఆ కాలంలో “బండి” అని అర్థం ఇచ్చే పదం, ఇకపై “రైలుబండి”ని మాత్రమే సూచిస్తుంది. అందులో తప్పేముంది..? కాలంతో ఎన్నో పదాల అర్థాలు మారాయి. ఇప్పుడూ మారుతున్నాయి. అందులో ఇదొకటవుతుంది. ఇప్పుడొస్తున్న కొత్త కొత్త వాహనాలన్నిటికీ శకటం/బండి అనే పేరే పడితే, దేని గురించి మాట్లాడుతున్నామో తెలపాలంటే తాతలు దిగిరావాల్సి ఉంటుంది. దానికి పరిష్కారం పర్యాయపదాల వాడకం. సంస్కృతంలో “శకటం” అనే అర్థానిచ్చే పదాలు చాలానే ఉన్నాయి. శకటాన్ని రైలుబండికొదిలేసి బస్సుకి మరో పదాన్ని ఇరికించొచ్చు. బైక్కీ ఇంకో మాట, కారుకొక మాట, ఇలాగ. అప్పుడు ఆ పదాల వాడకమూ పెరుగుతుంది. ఈ గొడవంతా, సంస్కృత జన్య పదాలు మాత్రమే వాడాలి అని అనుకునేవాళ్ళకి.

Constitution of Indiaని తెలుగు, తమిళ, ఉర్దూ, సంథాలీ భాషలలో తప్ప మిగిలిన అన్ని భారతీయ భాషలలోనూ “భారత సంవిధానం” అనే అంటారు, పలుకుబడిని బట్టి కొద్దిగా తేడాలుంటాయి, అంతే..! తమిళులు, సెందమిళం నుండీ, ఇంగ్లీషు నుండీ పదాలను కూర్చితే, ఉర్దూవారు పారశీకమో, అరబ్బీయో ప్రామాణికంగా తీసుకున్నారు. 
 
సంథాలీ కూడా అదే దారి. మిగిలినవారందరూ సంస్కృతాన్ని ప్రామాణికంగా తీసుకుని “భారత సంవిధానం” అంటూ ఉంటే, తెలుగువారం మాత్రం సంస్కృతాన్ని ప్రామాణికంగా తీసుకుని “భారత రాజ్యాంగం” అంటున్నాం. ఏ తెలుగులాయరో దేశరాజధానికి పోయి అలవాటు ప్రకారం “భారత్ రాజ్యాంగ్”అని అన్నాడనుకోండి, అది అవతలి వాళ్లకి సంస్కృత పాఠం మాత్రమే అవుతుంది, తప్ప వాదన కాదు. “రాజ్యాంగ్” బదులు హిందీలో “సంవిధాన్”అనాలని అతను అప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే, కోర్టు వాదనలు ఇంగ్లీషులోనే ఉంటున్నాయి గనక ఇది ఇబ్బంది కాదేమో..! ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒకే వస్తువుని నుడిగించేటప్పుడు, పైగా ఒకే భాషని దన్నుగా చేసుకున్నప్పుడు కూడా తెలుగువారు, తక్కినవారి కన్నా వేరుగా ఎందుకు ఉంటున్నారు అని. ఇక్కడ, రాజ్యాంగాన్ని మచ్చుక్కి మాత్రమే చూసాం. తరచి చూస్తే, ఇలాంటివి మనకి కోకొల్లలుగా దొరుకుతాయి, Research (తెలుగులో పరిశోధన, హిందీలో “అనుసంధాన్”), Technology (తెలుగులో సాంకేతికత/సాంకేతిక పరిఙ్ఞానం, హిందీలో ప్రౌద్యోగికీ, కన్నడంలో తంత్రఙ్ఞానం), Nation (తెలుగులో జాతి, హిందీలో “రాష్ట్ర్”), State (తెలుగులో రాష్ట్రం, హిందీలో “రాజ్య్”) లాంటివి. తెలుగులో రాష్ట్రానికీ, హిందీలో రాష్ట్రానికీ ఎంత తేడా ఉందో గమనించారా..? నిజానికి వీటి గురించి పుస్తకాలకు పుస్తకాలే రాసుకోవచ్చు. ఈ తేడాలవల్ల ఆయా భాషలకి ఏమౌతుందో గానీ, సంస్కృతానికి మాత్రం నష్టం జరుగుతోంది. ఎందుకంటే, సంస్కృతానికీ, తక్కిన భాషలకీ ఉన్న తేడా మాండలికం/యాస. సంస్కృతానికి యాసాభేదాలు ఉండవు. ఎక్కడివారిదైనా సరే., సంస్కృతం ఉచ్ఛారణ/పలుకుబడి ఒక్కలాగ ఉండి తీరాలి, వేరుగా ఉంటే అది సంస్కృతం అవ్వదు(ట). పైన చెప్పుకున్నట్టు, ఎవరితీరున వారు పదాలు సృష్టించుకుంటూ పోతే, సంస్కృతానికి కూడా మాండలికాలు తయారయ్యి, అసలైన సంస్కృతం అర్థం చేసుకోవడానికి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పదాల విషయంలో, ఎవరి అనువాదం సరైనది, ఎవరిది లోపభూయిష్టమైనది అంటూ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలీదుగానీ, వాడితే ఒకేపేరు వాడడం మంచిది అని మాత్రమే నేను అనేది. సంస్కృతం వాడడం వల్ల భారతదేశం మొత్తం ఒకే పదజాలం వాడుకోవచ్చు అనే ఉద్దేశ్యంలో తప్పులేదు. కానీ సంస్కృతాన్ని వాడడం వల్లన కూడా ఏకరూపత రావడం లేదే..? ఇంకెందుకీ ప్రయోగాలు..? ఇలా, రెంటికీ చెడ్డరేవడి అయ్యేకన్నా, ఆయా భాషలకి మాత్రమే సొంతమైన మాటలని పెట్టుకోవడం మంచిది కదా..! కొత్తవస్తువులకి పేర్లు పెట్టడంలో, సంస్కృతానికి సాంకేతిక భావ వ్యక్తీకరణ సమస్యలేదు. తెలుగుకి లేదా తెలుగువారికి ఆ ఇబ్బంది ఉంది. అందువల్ల, ప్రయోగాలకోసం సంస్కృతం వెంట పడుతున్నారు. దాన్ని దాటడానికి ఇబ్బడిముబ్బడిగా మాటల పుట్టించుకోవలసిన అక్కర ఉంది. ఆ పని, మేధావులు అనే కొద్దిమంది వలన అయ్యేది కాదు. 
 
భాషాభిమానుల దగ్గరనుండీ పామరులు వరకూ అందరూ పాలుపంచుకోవాల్సి ఉంటుంది. అందువలన మేధావులు ఒక్కొక్క పదాన్నీ పట్టుకుని “దీన్ని తెలుగులో ఏమని పిలవచ్చు.?” అని ప్రస్తుతం సాగిస్తున్న (కిందిస్థాయి) చర్చలనుండి బయట పడి, “మాటలని పుట్టించుకునే తీరు”మీద దృష్టిపెట్టాలి. అంటే, ఏదో ఒకటీ అరా మాటలని పుట్టించి జనం మీదికి వదిలే కన్నా, ఆ పుట్టించడానికి వ్యాకరణ, నియమాలు రాసి, తెలుగులో మరీ ముఖ్యంగా అచ్చతెలుగులో నిర్దిష్టమైన “మాటల పుట్టుక తీరు”ని ఏర్పాటు చేసుకుని, నేర్పుకుంటే పాఠాశాలలనుండి కూడా కొంగ్రొత్త తెలుగుమాటలు వెల్లువెత్తుతాయి. అప్పుడు కొత్తమాటలని పుట్టించడానికి ఉద్ధండులే పూనుకోవాల్సిన అక్కర ఉండదు.
 
ఒక భాషలో ఉన్న పదాలకు, మరో భాషలకి తెచ్చే తీరు ఎలా ఉంటుంది తలపోస్తే, చాలా దారులు కనిపిస్తాయి. అయితే, ఆయా దారులు లేదా అడుగులు ప్రాధాన్యతను బట్టి ఉంటాయి. అర్థం చెప్పుకోవడం చాలనిపిస్తే, నుడిగించుకుంటారు. కుదరకపోతే వేరేభాషలకేసి చూస్తారు. అదీ కుదరకపోతే, ఉన్నదుట్టు వాడేస్తారు. అయితే, కొన్ని మాటలకి అర్థం తెలిసినా యధాతథంగా వాడాల్సి ఉంటుంది. ఉదా: నానో, మెగా, జౌల్, కెలోరి వంటి ప్రమాణాలు అన్నమాట. వీటిని నుడిగించడం వల్ల నష్టమే తప్ప లాభమేమీ ఉండదు.
---
(ఈ రోజు ఆంధ్రభూమి నుడిలో పడిన నా వ్యాసం)


28, మే 2012, సోమవారం

రామాయణంలో మగవారిపైన వివక్ష


ఇది మొదలెట్టింది, కొందరు “కుహానా” స్త్రీవాదులు, “రామాయణం పురుషాధిపత్యానికి చిహ్నం”అని చేసే వెర్రి మొర్రి వాదనలకి రిటార్డుగా. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా ప్రక్కదోవ పడితే, తెలియజేయాల్సిందిగా మనవి.
రామాయణం, పురుషాహంకారానికి చిహ్నం అంటారు, కుహానా స్త్రీవాదులు. రామాయణం పెట్టుబడిదారీ వ్యవస్థకి చిహ్నం అంటారు, కుహానా కమ్యూనిస్టులు. రామాయణం లేనే లేదు, అదంతా వట్టి కల్పన అని పదే పదే వల్లె వేస్తూ ఉంటారు, కుహానా హేతువాదులు. రామాయణం ద్రవిడులపై ఆర్యుల అరాచకాలకి ప్రతీక, రావణుడు ద్రవిడుడు, దళితుడు అంటారు, కుహానా దళితవాదులు. రామాయణంలోని రక్కసులే ఆంధ్రోళ్లుగా పుట్టరంటాడు ఓ కుహానా తెలంగాణవాది. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతీ ఉద్యమానికీ తేరగా దొరికింది రామాయణమేనని, అనిపించక మానదు. అసలు ఈ కుహానావాదులు, వారి వాదాల గురించి ఒక టపాని సిద్ధం చేస్తున్నాను. వీళ్లెవరు..? వీళ్ల లక్ష్యాలేమిటి..? లాంటివి అక్కడ మాట్లాడుకుందాం..! ముందే చెప్పుకున్నట్టు, కుహానా స్త్రీవాదులే ఇక్కడ నా టార్గెట్. 

“సీత”ని అగ్నిప్రవేశం చేయమన్నాడనీ, ఎవడో తాగుబోతు పౌరుడు వాగితే, మళ్ళీ వదిలేసాడనీ, ఇది పక్కా మగ దురహంకారమనీ, హుంకరిస్తుంటారు కదా. ఇక్కడ నేను రాస్తున్న “మగవారిమీద వివక్ష”లని చదవండి, ఈ సమాజం మగవారిపైన ఎంత వివక్ష చూపుతోందో అర్థమౌతుంది. ఇలాంటి వాటిని, తెలుగువారం “రామాయణంలో పిడకలవేట” అంటున్నాం. ఇక్కడ జరిగే పిడకల వేట “మగవారిమీద వివక్ష” పిడకలకోసం అన్నమాట.

మొదటి పిడక: పరాయి ఆడదాని వెంటపడినందుకు రావణుడు, సర్వనాశనమైపోయాడు. చివరికి చచ్చాడు కూడా. మరి పరాయి మగాడి వెంట పడినందుకు శూర్పణఖని ఎందుకు చంపలేదు.? ముక్కు, చెవులు కోసేసాడు లక్ష్మణుడు, అంతే..! రావణుని పిల్లలూ చచ్చారు, శూర్పణఖ పిల్లలూ చచ్చారు. అంతవరకూ వివక్షలేదు. ఆ తర్వాత, రావణుడు చచ్చాడు, కానీ శూర్పణఖ చావలేదు. ఒకే తప్పుకి ఆడదానికొక శిక్ష, మగవాడికొక శిక్ష. నోట్ దిస్ పాయింట్ యువరానర్..!

రెండవ పిడక: సీతాపహరణం తర్వాత, రాముడు సీతకోసం గాలించాడు, సుగ్రీవుడితో చెలిమికోసం వాలిని చంపాడు, వానరులనందరినీ సీతాన్వేషణకోసం పంపుతూ, ఉత్తగా వచ్చినవారికి ప్రాణభయం కలిగించాడు (ఆ పని చేసింది సుగ్రీవుడు లెండి), హనుమంతుడి చేత సముద్రం దూకించి లైఫ్ రిస్క్ తీసుకునేలా చేసాడు, ఆ తర్వాత కడలికి వంతెన కట్టి, రాక్షసులతో పోరాడు. ఇలా నానా కష్టాలూ పడితే, సీత ఏం చేసింది అని నేను అడుగుతున్నాను. నగలు దాచమని హనుమంతుడికి ఇవ్వడం తప్ప. అదీ గాల్లోంచి విసిరేసింది..! ఇది వివక్ష కాదా..? పోనీ రావణుడు బంధించేసాడు కాబట్టి, ఏమీ చేయలేకపోయింది అనుకుందాం. హనుమంతుడు రాముని దగ్గరకి చేరుస్తానన్నప్పుడైనా, వచ్చి ఉండొచ్చుగా.. ఊహూఁ..! నా స్వామే వచ్చి నన్ను విడిపించాలి అని ఇంకో రెండు పద్యాలూ, శ్లోకాలూ పాడింది. హనుమంతుడు చెప్పినట్టు చేసి ఉంటే, ఎంతోమందికి చావుతప్పి ఉండేది. ముఖ్యంగా, అన్నెం పున్నెం ఎరుగని కుంభకర్ణుడు లాంటి వాళ్లు, ఏ తప్పూ చేయకపోయినా చచ్చారు. పైగా, అతగాడు జయవిజయుల్లో ఒకడని దానికి జస్టిఫికేషనూ..!

మూడవ పిడక: అదలా ఉంచితే, జనామోదం పొందిన రాముణ్ణి  యువరాజు కానివ్వకుండా అడ్డుపడింది కైకేయి. అదీ మొగుణ్ణి బాధపెట్టి మరీనూ. కాదంటే “ఆడినమాట తప్పినవాడివి అవుతావ”ని బెదిరింపులు. ఇది గృహహింస కాదా..? అని అడుగుతున్నాను. ఆ బాధ భరించలేక, పాపం దశరధుడూ పోయాడు. దానికి జస్టిఫికేషను కోసం ఇంకో కథ.! అంతే తప్ప కైకేయిని, కన్నకొడుకు భరతుడు తప్ప ఇంకెవ్వరూ శిక్షించిన దాఖలా కనబడదు, అదీ మొహం చూడనంటాడు అంతే..! మరి భరతుడో., ఆవిడకి పుట్టినందుకు తనకు పితృతర్పణాలు పెట్టే అర్హత లేదని తండ్రి దగ్గర్నుండి శాపాన్ని పొందాడు. అంటే ఓ ఆడదాని వల్ల ఒక మగాడు పోయాడు, ఇంకో మగాడు జీవితాంతం బాధపడ్డాడు. దీనికి శిక్షలు లేవు. ఇది వివక్ష కాదా..? నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువరానర్..!

నాలుగవ పిడక: “తాటక” అనే రాక్షస స్త్రీని చంపాడు రాముడు. దశరధుడితో బాటు యుద్ధానిక్కూడా వెళ్ళి ఎంతోమంది రాక్షసులని చంపింది కైకేయి. మరి “ఆడదాన్ని చంపినవాడ”ని రాముణ్ణి వెక్కిరించినట్టుగా, “మగాణ్ణి చంపినద”ని కైకేయిని ఎవరూ వెక్కిరించలేదే..? రాముణ్ణి చివరికి కన్నకొడుకులు కూడా వెక్కిరించారు. ఇక్కడ పాయింట్ “వెక్కిరింపు”కాదు, ఆ వెక్కిరింపుకి గల కారణం యువరానర్..! యుద్ధంలో, ఆడది మగాణ్ణి చంపితే సమాజం ఒప్పుకుంటుంది. అదే యుద్ధంలో, మగాడు ఆడదాన్ని చంపితే ఒప్పుకోదు. ఇదెక్కడి అన్యాయం..?

ఐదవ పిడక: బంగారు లేడిని తెమ్మనగానే, పరుగెట్టుకుంటూ వెళ్ళిపోయిన రాముడికి, ఏ అపాయమూ రాదనీ, ఆయన మహావీరుడనీ, కంగారు పడవద్దని తల్లిలాంటి వదినకి నచ్చజెప్పబోయిన లక్ష్మణుణ్ణి సూటిపోటి మాటలతో బాధపెట్టింది సీతమ్మ. ఎంత బాధపడ్డాడో పాపం లక్ష్మణుడు, చివరికి అన్నగారిమాటని కూడా కాదని పాక( పర్ణశాల అంటె ఘనంగా ఉంటుందేమో..!)ని విడిచివెళ్లాడు. ఇక్కడ రెండు పాయింట్లున్నాయి యువరానర్..! ఒకటి లక్ష్మణుడికి జరిగిన గృహహింస. రెండోది, తను గీసిన గీతని దాటొద్దని లక్ష్మణుడు చెప్పినా, వినకుండా “నీ లెక్కేమిటిలే నాకు..?” అని దాటిన సీత దురవగాహన. ఇక్కడ సరైన పదం చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదు.

ఆరవ పిడక: సీతని రావణుడు ఎత్తుకుపోతూంటే, పోరాడి నేలకొరిగినవాడు జటాయువు. ఎంగిలి పళ్ళని నివేదించి, సుగ్రీవుణ్ణి కలవమని సలహా ఇచ్చింది, శబరి. వీరిలో ఎవరికి ఎక్కువ విలువనివ్వాలి..? ఏమో మరి..! రాముణ్ణి చూసే నేర్చుకోవాలంటారు, కనుక ఆడవాళ్లకే ఎక్కువ విలువనివ్వమంటారా..? చట్టం ఒప్పుకోదు. శబరిని నది అయి, అందరికీ ఇలాగే సేదదీర్చమని అన్నాడు రాముడు. మరి జటాయువో, ఈయన దశరధుని మిత్రుడుకూడానూ..! దహన సంస్కారాలు చేసాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా అని అడుగుతున్నాను యువరానర్. ఆడదానికొక రీతి, మగవాడికి అందునా ఒక పక్షికి ఇంకో రీతి అన్నమాట..! ఎక్కడ “పెటా”వాళ్ళు..? వీధికుక్కల్ని, ఊరపందుల్నీ కాపాడింది చాలు.! జటాయువుకి న్యాయం జరగాలని పోట్లాడండి..! పొండి..!

ఏడవ పిడక: రామాయణంలోని మనుషులకే కాదు, రాసినవాళ్లకి కూడా గృహహింస తప్పలేదు. కుటుంబం కడుపు నింపడానికి వేటనే నమ్ముకొని, వేటాడిన జంతువుల్నీ, మనుషులనీ చంపిన పాపంలో పాలు పంచుకుంటుంది తన ఆలి, అనీ ఆశించిన బోయవాణ్ణి, మోసం చేసింది అతని పెళ్లాం. పాపం మొగుడిది మాత్రమేనని, పాపం చేసి సంపాదించిన తిండి మాత్రం ఇద్దరిదీనని, ఆవిడ పెనుగువ(వాదన)లాడినందువల్లనే ఆ బోయవాడు, సంసారాన్ని వదిలేసి పోయాడు. (ఇప్పటి చట్టాలద్వారా జరుగుతున్నదీ అదే కదా..! అయితే, ప్రతీ అభాగ్యుడూ ఋషి అవ్వలేడు..) చివరికి మనకా విషయం చెప్పి ఆడవాళ్లు అప్పుడూ, ఇప్పుడూ ఒకటేనని నిరూపించాడు వాల్మీకి. మగవాళ్లపైన ఇంత వివక్షా..? దీన్ని తెగనాడుతున్నాను యువరానర్..!

హమ్మయ్య..! విజయవంతంగా ఐదారు పిడకల్ని సంపాదించాను. వీటితో చేసిన “పిడకల దండ”ని కుహానా స్త్రీవాదులకు బహూకరిస్తున్నాను. ఈ పిడకలు సరిపోవు అంటారా..? ఏం చేస్తాం..? నాకు “గొల్లపూడివారి బాలల బొమ్మల రామాయణం”, చందమామలలో చదివినవాటిలోనూ, సినిమాల్లో చూసినవాటిలోనూ గుర్తుండి, వేటాడగలిగిన పిడకలు ఇవే మరి..! అసలు వాల్మీకి రామాయణం పూర్తిగా చదివితే, ఇంకొన్ని “మగవారిమీద వివక్ష” పిడకలు దొరకచ్చు. ప్రస్తుతానికి ఇవే పిడకలు.. సర్దుకుపొండి..!


లేదా ఇంకొందరు వేటాడగలిగిన “కొత్త” పిడకలకోసం ఎదురు చూడండి..!