30, ఆగస్టు 2011, మంగళవారం

కాలెండర్‌- సంస్కృత, భారతీయ మూలాలు

సురేష్‌గారి పాత బ్లాగుల్లో ఎక్కడో ఆయన "hour"...అనే ఇంగ్లీషు పదానికి మూలం సంస్కృత పదమైన "హోర.."..అని చెప్పగానే.., నాక్కూడా ఇలాంటి పోస్టొకటి రాయలనిపించింది... భారతీయులు ప్రపంచానికందించిన వాటిల్లో గణితం, "0"...లే కాకుండా.., కాలగణన కూడా ఉందని నా అభిప్రాయం. అందుకు సంబంధించిన విషయాలు నేను కుముదం భక్తి పుస్తకంలోనో, ఋషి పీఠం పుస్తకంలోనో చదివినట్టు గుర్తు... వాటినే రాయాలనుకుంటున్నాను....
ముందుగా రాయబోయేది కాలెండర్‌ అనే పదం గురించి... "కాలెండర్‌"...అనే ఇంగ్లీషు పదం "kalendae" అనే లాటిన్‌ నుండి వచ్చిందని వికీపీడియా వ్యాసంలో ఉంది. నేను పైన చదివిన పత్రికల్లో దీని గురించిన ప్రస్తావన వచ్చింది. అసలీ "కాలెండర్‌"..కి మూలం "కాలంధర"..అనే సంస్కృత పదం..! కాలంధర అంటే, కాలాన్ని ధరించునది అని అర్థం.. అంటే కాలెండర్‌ని మనం ఏ విధంగా డిఫైన్‌ చేయవచ్చంటే , కాలాన్ని ధరించే ఒక కాగితం ముక్కగా..!
ఆంధ్రభూమిలో ఒక వ్యాసంలోని భాగం యధాతధంగా కాపీ చేస్తున్నాను...ఇక్కడ చూడండి..


// మీకో విషయం తెలుసా? మనం వినియోగిస్తున్న ఇప్పటి ఇంగ్లీష్ ‘గ్రెగోరియన్’ క్యాలెండర్‌కు పూర్వం అంటే క్రీ.శ.1739 సంవత్సరానికి పూర్వం, పాశ్చాత్యులు కూడా మార్చి ‘25వ తేదీనే- నూతన సంవత్సర ప్రారంభంగా చేసుకునేవారు. దానిని, తర్వాత జనవరి ఒకటికి మార్చుకున్నారు. మార్చి 25 అనే తేదీ, నిజానికి మన ఉగాదికి దగ్గరగా వుండేది. ‘వారం’అంటే ‘పర్యాయం’ అనే అర్థం వుంది. ‘స్మరవారం వారం’ అంటే పర్యాయాలుగా తలుచుకోవడం. ‘వబయోరభేదః’ అని, ‘వ’ని ‘బ’గా సూచించడం వుంది. అప్పుడు- మార్చి వారికీ సంవత్సరాది కనుక, అక్కడనుండి సప్తమ పర్యాయం అంటే సప్తమవారం- ‘సెప్టెంబర్’గా, అష్టమ వారం అష్టబార్ అనేది ‘అక్టోబర్’గా, నవమ అనగా 9వ నెల ‘నవంబర్’గా, దశమవారం 10వ నెల డిసెంబర్- డిసెంబర్’గా పేర్కొనబడేదన్నమాట! జనవరిని కొత్త సంవత్సరం చేసుకున్నాక- సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9,10,11,12 నెలలుగా మారినా, వారు పేర్లు మార్చుకోలేకపోయారని మాన్యులు తెలకపల్లె విశ్వనాధశర్మగారు కాలంధర విజ్ఞానం గురించి చెబుతూ పంచాంగం ప్రాముఖ్యం గురించిన వ్యాసంలో పేర్కొన్నారు.//
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, ప్రపంచానికి కాలగణన నేర్పింది భారతీయులేనని కూడా అనిపించకమానదు. దానికి సంబంధించిన విషయం పైన కాపీ చేసిన పేరాలో ఉంది. దానికి ఇంకోటి జత చేయబోతున్నాను. "ఆగస్టు" ఒకప్పుడు "Sextilis"..అని పిలవబడేదట...వికీపీడియాలోని ఈ వ్యాసంలో చూడొచ్చు... ఈ పదం మన సంస్కృతంలోని "షష్టి.."..అనే శబ్దానికి దగ్గరగా ఉందనే నాకనిపిస్తోంది..

ఇంక మార్చి 25 ఒకప్పటి సంవత్సరాది అని చెప్పడానికి ఇంకో ఋజువు ఏంటంటే.., ఆ "కాలెండర్‌"లోని అఖరి నెల అయిన ఫిబ్రవరికే సవరణలు జరుగుతూ ఉంటాయి..అంటే సాధారణంగా 28 రోజులు ఉండి, లీపు సంవత్సరంలో 29 రోజులు ఉండడం. ప్రతీ వందేళ్లకొకసారి అది ఉండకపోవడం..అందులోనూ ప్రతీ నాలుగొందల సంవత్సరాలకీ మళ్లీ ఉండడంలాంటివన్నమాట..అంటే 2000 లీప్‌ సంవత్సరం, 1900, 2100, 2200. 2300 లీప్‌ సంవత్సరాలు కాదు..మళ్లీ 2400 లీప్‌ సంవత్సరం అన్నమాట..ఇదంతా వేరే గొడవ..!
ఇంక సురేష్‌గారు ప్రస్తావించిన హోర దగ్గరకి వద్దాం..! దీని గురించి నాకన్నా పంచాంగ కర్తలు బాగా చెబుతారు.. అయినా నాకు తెలిసిన దాన్ని రాద్దామనుకుంటున్నాను.. మన కంటికి కనిపించే గ్రహాలు తొమ్మిది. ఇవి నిజానికి భూమిచుట్టూ తిరగకపోయినా సాపేక్షంగా తిరుగుతున్నట్టే జ్యోతిష్కులు లెక్కలోకి వేసుకుంటారు. ఇవి మనకు తెల్సినవే.. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు...! రాహువు, కేతువు ఛాయాగ్రహాలు, భౌతిక పదార్థంగా లేవు కాబట్టి లెక్కలో రావు.. ఇంక మిగిలిన ఏడు గ్రహాలనే "హోర" చక్రంలో తీసుకున్నారు మన పూర్వీకులు. ఈ ఏడు గ్రహాలూ ఒక చక్రంలో ఒక "హోర" కాలం (అంటే ఒక గంట సేపు)..భూమి మీద ప్రభావం చూపిస్తాయని నమ్మిక..ఈ హోరాచక్రం అలా రిపీట్‌ అవుతూనే ఉంటుంది...
దీని గురించిన చక్కని వివరణ సత్యనారాయణశర్మ గారి బ్లాగులో ఉంది.. దాని లింక్‌ ఇదిగో...

 సూర్యోదయం అయ్యే సమయంలో, ఏ గ్రహప్రభావమైతే భూమిమీద ఉంటుందో, ఆ రోజుని, ఆ వారంగా పరిగణిస్తారు. సూర్యోదయ సమయంలో, ఆదివారం సూర్యుడి ప్రభావం ఉంటుంది, సోమవారం చంద్రుడి ప్రభావం..ఇలా అన్నమాట...! కనుకనే మనకి వారంలో ఏడు రోజులున్నాయి... సన్‌డే, మన్‌డే, ట్యూస్‌డే,వెన్స్‌ డే..ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న ఏడు గ్రహాల లాటిన్‌ రూపాలే..! వాటి లిస్ట్‌ కింద రాసాను
 


sunday........... ఆదివారం.... సూర్యుడు...sun
monday.........సోమవారం.....చంద్రుడు...moon
tuesday........మంగళవారం....కుజుడు...mars
wednesday.....బుధవారం.....బుధుడు...mercury
thursday.......గురువారం....బృహస్పతి..jupiter
friday..............శుక్రవారం.....శుక్రుడు..venus
saturday.........శనివారం.........శని...saturn
ఇంగ్లీషులో వారాలపేర్ల గురించి,అయా గ్రహాల లాటిన్‌ పేర్ల గురించి ఆయా వికీపీడియా వ్యాసాల్లో అందుబాటలో ఉన్నాయి.. ఇకపోతే, మన జ్యోతిషశాస్త్రం అంతా ఉజ్జయినీ నగరాన్ని ప్రామాణికంగా తీసుకుని గణింపబడిందని విన్నాను.. విజ్ఞలు దీనిపై పరిశోధనలు కూడా చెయ్యొచ్చు..! పనిలో పనిగా మధ్యలో మా కాకినాడ గురించి డబ్బా కొట్టుకోవలసిన విషయం ఒకటుంది..! భారత ప్రామాణిక రేఖాంశం 82 1/2 ..కాకినాడ చాలా దగ్గరనుండే పోతుంది.. అంటే, మా కాకినాడ టైంనే..భారతదేశం మొత్తం వాడుతోందన్నమాట..!
రోజుకు 24 గంటలనే కాన్సెప్ట్‌ కూడా భారతీయులదే..! అది హోరలకి సంబంధించినదేగా మరి..! ఆదివారం సర్యోదయం నాడు సూర్యుడితో మొదలైన హోరాచక్రం..మళ్ళీ ఆదివారం సూర్యోదయం వరకూ ఉంటుందన్నమాట..! అందుకే మన భారతీయుల వారం ర్యోదయంతో మొదలై మరుసటిరోజు సూర్యోదయం వరకూ ఉంటుంది.. రోజు మారడమనేది సూర్యోదయం మీదే ఆధారపడి ఉంది. అందరూ అనుకుంటునట్టు అర్థరాత్రి 12 గంటలకి వారం మారదు..!
సందర్భం కాకపోయినా, ఈ విషయం రాయాలనిపిస్తోంది.. అదేంటంటే, మన పురాణాల్లో యవనులు కూడా భారతీయులేనని ఉంది. వీళ్లే, ఆ తర్వాత, గ్రీస్‌ ప్రాంతాన్ని, ఇటలీ ప్రాంతాన్ని ఆక్రమించారని ఉంటుంది. వాళ్లు అక్కడ నిర్మించుకున్న నగరం పేరు "రామ నగరమని..".. వాళ్లని రామకులని..పిలవడం జరిగింది.. అదే రోమ్‌ అనీ.., వాళ్లు రోమన్స్‌ అనీ, ఎక్కడో చదివాను.. (ఇక్కడింకో విషయం.., ఈ లెక్క ప్రకారం సోనియా గాంధీ కూడా భారతీయురాలే..!బిజెపి వాళ్లూ, ఆరెస్సెస్‌వాళ్లూ అనే "విదేశీ"..పదం తప్పన్నమాట..!). ఈ వాదాన్ని మాక్స్‌ ముల్లర్‌ పేర్లు కలవడం లేదనీ, అదనీ, ఇదనీ,, చాలా సిల్లీ వాదాలతో కొట్టిపారేసాడని గుర్తు.. అయితే, పూర్తిగా తెలీదు..! సంస్కృతానికీ, లాటిన్‌కీ ఉన్న సంబంధం ఇక్కడే ఉందని, నా అభిప్రాయం...!

17, ఆగస్టు 2011, బుధవారం

నా వ్యాఖ్యపై వ్యాఖ్యకి నా బదులు

ఈ పోస్టు రాస్తున్నది చదువరి గారి పోస్టు
లో నేను చేసిన వ్యాఖ్యపై మౌళిగారి వ్యాఖ్యకి రిప్లై ఇవ్వడానికి మాత్రమే...!

వామన గీత గారు,

@రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది.

{తెల౦గాణా వారు కూడా ఇది వారి ఖర్మ అని సరిపెట్టుకోవడం లేదు కాబట్టి వారిదే తప్పంటారా .}

@ ఆ ప్రాంతంలో పెరిగిన అక్షరాస్యతే సాక్ష్యం...

{అక్షరాస్యత ఉ౦టే సరిపోదు కదా ఉన్నత విద్యావకాశాలు అ౦దుపుచ్చుకోడానికి (తాడేపల్లిగారిలా చేతకాక సాధి౦చుకోలెదని అనకండి )}

@జనంలో ఉన్న బతుకు భయమే అన్ని ఉద్యమాలకీ మూలకారణం...అది తెలంగాణా అయినా, సమైక్యాంధ్రా అయినా..!

{ఇప్పటికి ఎ౦త మ౦ది హైదరాబాదు లో ఉన్న ఆ౦ధ్రులు చనిపోయారు ?}

@ఎటొచ్చీ, ఇబ్బంది అంతా ఉద్యోగ అవకాశాల గురించే..!

{మీరు చెప్తున్నది ప్రభుత్వ ఉద్యోగాలగురి౦చి మాత్రం కాదు . ఇక ప్రివాతే ఉద్యోగాలు ఆ క౦పెనీ ల ఇష్టా ఇష్టాలపై ఉ౦టు౦ది. విభజన ప్రభావం పెద్దగా ఉ౦డాల్సిన పనిలేదు. }

@ఉద్యోగం రానివాళ్లందరికీ డెస్టినేషన్‌ హైదరాబాద్‌లోని అమీర్‌పేటగానీ, సనత్‌నగర్‌గానీ (అన్ని ఏరియాలూ నాకు పూర్తిగా తెలీదు) అయి ఉంటోంది.

సనత్ నగర్ ఆ :)

{ఇన్ని సంవత్సరాలలో ఎ౦త మ౦ది ఇబ్బ౦ది పడినారు ?}


@ మొన్న పేపర్‌ కరెక్షన్‌కి వెళ్ళిన లెక్చరర్లని తన్నేరు. తర్వాత వీళ్లని తన్నరని గేరంటీ ఏమిటి..?

{ఒక్కసారే ఎ౦దుకు జరిగి౦దలా ? ఇప్పటివరకు ఉద్యోగాలకోసం వచ్చిన ఎవ్వరిని వాళ్ళు తన్నలేదే}

@ఇదే మీరన్న హైదరాబాద్‌ని మినహాయిస్తే విభజన వెంటనే జరిగిపోతుందన్నదానికి సమాధానం..! ఎందుకంటే హైదరాబాద్‌కి సాటి వచ్చే ఊరు మనరాష్ట్రంలో వేరే ఏదీ లేదు..! రానివ్వరుకూడా..!

{హైదరాబాదులో ఉన్న ఆ౦ధ్రులకి సాటివచ్చే ఆ౦ధ్రులు కూడా లేరా? ???? }

@ఇంక మీరు ఆఖరిగా అన్నది..//ఇక్కడ హైదరాబాదు లో ఉన్న ఆ౦ధ్రులు మిగిలిన ఏ జిల్లా ఆ౦ధ్రులను (ఆ౦ధ్ర ప్రా౦త జిల్లాలతో కలిపి) తమ వారిగా భావి౦చడమ్ లేదు// దీంతో నేను ఏకీభవించడం లేదు..

{సమైక్యవాదం చేస్తున్న మెజారిటి బ్లాగర్ల వ్రాతలలో ఇది ఉ౦ది}

మౌళిగారూ..!
నా వ్యాఖ్యపై మీరు చేసిన ఫైనెట్‌ ఎలిమెంట్‌ ఎనాలిసిస్‌ (finite element analysis) నన్ను ముందు కొద్దిగా భయపెట్టింది. నేను బ్లాగ్ప్రపంచానికి కొత్తకావడం మూలాన..!
నా వ్యాఖ్యల్ని కొన్నింటిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు నాకు అనిపిస్తోంది...! అందుకు తగిన వివరణ చదువరి గారి పోస్టులో ఇవ్వడం బాగోదు కనుక.. ఇక్కడ రాస్తున్నాను..
మీ వ్యాఖ్యలకి నా సమాధానం
//తెల౦గాణా వారు కూడా ఇది వారి ఖర్మ అని సరిపెట్టుకోవడం లేదు కాబట్టి వారిదే తప్పంటారా//
నిజంగా అ న్యాయం జరిగితే ఉద్యమం చేసుకోవడం తప్పే కాదు..! కానీ తెలంగాణవాదులు చేస్తున్న ప్రచారంలో ఎక్కువగా అసత్యాలే ఉన్నాయి.. (అలాగని మొత్తం అసత్యం అని నేను అనడం లేదు)... నేనింకా విద్యార్ధినే కాబట్టి వాళ్ల గురించి మాత్రమే నాకు కొద్దో గొప్పో ఐడియా ఉంది. నా తోటి విద్యార్థుల్లో చాలామంది (తెలంగాణా ప్రాంతీయులు) ఇటువంటి అసత్యాలకి బలైపోతున్నారన్నదే నా బాధ..! దాని గురించే ముందు వ్యాఖ్యలు రాసాను...

//అక్షరాస్యత ఉ౦టే సరిపోదు కదా ఉన్నత విద్యావకాశాలు అ౦దుపుచ్చుకోడానికి (తాడేపల్లిగారిలా చేతకాక సాధి౦చుకోలెదని అనకండి//
దీనికి నేనొప్పుకుంటున్నాను. మీరు చెప్పిందీ కరెక్టే, తాడేపల్లిగారిదీ కరెక్టే..! ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలిచ్చే వాడికెవడికీ ప్రతీ మనిషినీ అర్థం చేసుకునేంత, టైమూ, ఓపికా ఉండవు. వచ్చినవాడు పనికొచ్చినవాడైతే తీసుకుంటాడు.. లేదంటే తీసుకోడు. ఉద్యోగం రానివాణ్ణి చేతకానివాడనే ఇంట్లోవాళ్లందరూ అనేది..! (జనరల్‌గా..! కొన్ని ప్రత్యేకమైన కేసులు తప్పించి)
//ఇప్పటికి ఎ౦త మ౦ది హైదరాబాదు లో ఉన్న ఆ౦ధ్రులు చనిపోయారు ?//
చనిపోవడమే ఉద్యమానికిగానీ, భయానికిగానీ ప్రాతిపదికా...?
//మీరు చెప్తున్నది ప్రభుత్వ ఉద్యోగాలగురి౦చి మాత్రం కాదు . ఇక ప్రివాతే ఉద్యోగాలు ఆ క౦పెనీ ల ఇష్టా ఇష్టాలపై ఉ౦టు౦ది. విభజన ప్రభావం పెద్దగా ఉ౦డాల్సిన పనిలేదు//
నిజమే..! నేను చెప్తున్నది ప్రభుత్వ ఉద్యోగాల గురించి కాదు. ప్రైవేట్‌ ఉద్యోగాల గురించే. విభజన ప్రభావం ఉండాల్సిన పనిలేదంటున్నారు. ఉండదని గేరంటీ ఏమిటి అంటున్నాన్నేను..! ప్రైవేట్‌ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అసాధ్యమని చాలామంది అనుకుంటున్న సమయంలో, మాయావతి సర్కార్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో నిజంచేసి చూపించిందిగా..!
//సనత్ నగర్ ఆ :) {ఇన్ని సంవత్సరాలలో ఎ౦త మ౦ది ఇబ్బ౦ది పడినారు ?//
సనత్‌నగర్‌ అనడంలో మీ ఉద్దేశ్యం నాకు అర్థం కాలేదు..! సనత్‌నగర్‌కి నేను ఒక్కసారే వచ్చాను. అక్కడ 2000-5000 మంది దాకా (ఇంకా ఎక్కువమందికూడా ఉండచ్చు) నిరుద్యోగులు ఉన్నారు. ఇటువంటి ఏరియాలు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి.. ఇన్ని సంవత్సరాలలో ఎంత మంది ఇబ్బంది పడినారని అడిగారు కదా..! ఇబ్బంది పడ్డారని నేననడం లేదు.. ఇకముందు పడరని గేరంటీ ఏమిటీ..అని అడుగుతున్నాను..
//ఒక్కసారే ఎ౦దుకు జరిగి౦దలా ? ఇప్పటివరకు ఉద్యోగాలకోసం వచ్చిన ఎవ్వరిని వాళ్ళు తన్నలేదే//
దీనిక్కుడా పైనే సమాధానం ఇవ్వడం జరిగింది..

//హైదరాబాదులో ఉన్న ఆ౦ధ్రులకి సాటివచ్చే ఆ౦ధ్రులు కూడా లేరా? ????//
నేను చెప్పినది వేరు. మీరు అర్థం చేసుకుంటున్నది వేరు. నేను ఊళ్లు, అక్కడి అవకాశాల గురించి మాట్లాడుతున్నాను. నిజంగానే హైదరాబాద్‌కి సాటి వచ్చే ఊరు రాష్ట్రంలో వేరే ఏదీ లేదు. వైజాగ్‌ని కొన్ని విషయాల్లో మాత్రమే మినహాయించవచ్చు.. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 70% హైదరాబాద్‌ చుట్టూ కేంద్రీకరించబడ్డాయి. మిగిలినవాటిలో 20% విశాఖపట్నంలో ఉన్నాయి. రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్నీ మిగిలిన పది శాతంలోనే వస్తాయి.. (దీనికి వివరాలు కావాలంటే చిన్నప్పటి సోషల్‌ టెక్స్ట్‌ బుక్‌ చూడాలి..). కాకినాడలాంటి చోట పరిశ్రమలున్నా, వాటికి ఆఫీసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి.. దీనికి అచ్చమైన ఉదాహరణ కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌ ... పనులు జరిగేది కాకినాడలో, వాటిని డిసైడ్‌ చేసేది హైదరాబాద్‌లో, కాకినాడలోని ఎరువుల పరిశ్రమలు కూడా అంతే..
స్థానికులకి అవకాశం ఇవ్వమని మొత్తుకుంటే, రిలయన్స్‌ వాడు కాకినాడలో ఇంటర్వ్యూకి పిలిచాడు. అప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో 80% కటాఫ్‌ పెట్టి. చాలామందిని తీసేసాడు..! ఆ తర్వాత ఎవ్వరికీ జాబ్‌ ఇవ్వలేదని వినికిడి. (ఇది జరిగి రెండు - మూడు సంవత్సరాలైంది). ఓ.ఎన్‌.జి.సి వాడు కెజి బేసిన్‌ సంబంధించిన ఆఫీసు హైదరాబాద్‌లో పెడతానని చెబుతుంటే, అమలాపురం ఎం.పి హర్షకుమార్‌ తప్పితే ఇంకెవరూ పట్టించుకోలేదు. అతగాడు దాన్ని రాజమండ్రిలోగానీ, కాకినాడలోగానీ, విశాఖపట్నంలోగానీ పెట్టమని రెండు-మూడు రోజులు అరిచాడు. తర్వాత ఎవడి పని వాడిదే..!
నేను కాకినాడవాణ్ణి కాబట్టి, విశాఖపట్నంలో చదువుకున్నవాణ్ణి కాబట్టి, అక్కడి పరిస్థితులు కొద్దిగా తెలుసు.. రెండేళ్లుగా మన రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల వల్ల పరిపాలన పూర్తిగా స్థంభించిపోయింది.. అభివృద్ధి పథకాల ఊసేలేదు. పరిశ్రమల స్థాపన కనుచూపుమేరలో ఎక్కడా కనపడడంలేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులూ లేవు... జీతాలివ్వలేం బాబూ అంటున్నా వినకుండా సమ్మెలూ, బంద్‌లూ అంటే రాష్ట్రం ఏమైపోవాలి. ఏ ఉద్యమం చేసినా ప్రజాస్వా మ్యయుతంగా చేయాలిగానీ, రెచ్చగొట్టడం, విద్వేషం ఎక్కించడం ఎందుకు..? సుప్రీం కోర్టు బంద్‌వల్ల చాలా నష్టం జరిగుతోంది కాబట్టే దాన్ని నిషేధించింది. అయినా, మన నాయకాగ్రేసరులు హర్తాళ్‌గా మార్చి మొదలుపెట్టడం చూసాం..నేను ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సమయానికి అంటే 2010(కిందటి సంవత్సరం)... ఎవ్వరికీ ఉద్యోగాల్లేవు..! బయటికి పోయి వెతుక్కున్నారు మా ఫ్రెండ్స్‌ అందరూ.! ఈ ఉద్యమాల వల్ల సుమారు 2 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌ నుండి బయటికెళ్ళిపోయాయని వినికిడి..! ఇది నష్టం కాదా..? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి..?

ఆఖరుగా నామాట.. నేను సమైక్యవాదినీ కాను, వేర్పాటువాదినీ కాను..! నాకొచ్చే నష్టాల్ని ఆలోచించుకుని తప్పించుకుని తిరిగే సగటు మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీ వాడిని. అయినా, అప్పుడప్పుడూ ఇలా రియాక్ట్‌ అవుతూ ఉంటా...! నా ఆలోచనల్లోనూ, వ్యాఖ్యల్లోనూ రెండు పుస్తకాల ప్రభావం ఉందని నేననుకుంటూ ఉంటా..! అందులో ఒకటి ఎం.వి.ఆర్‌ శాస్త్రిగారి "ఆంధ్రుల కథ..", రెండు పుచ్చలపల్లి సుందరయ్యగారి "వీరతెలంగాణ విప్లవపోరాటం..". ఈ రెండూ, ప్రతీ తెలుగు వాడూ చదవాల్సిన పుస్తకాలని నా అభిప్రాయం..

12, ఆగస్టు 2011, శుక్రవారం

కాకినాడ బాంబు కేసు

ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా బాంబు ప్రేలింది హైదరాబాద్‌లోనో, ఫాక్షనిస్టు గొడవలతో ఉండే రాయలసీమలోనో, రాజకీయ రాజధాని విజయవాడలోనో కాదు.. ప్రశాంతవాతావరణానికి మారుపేరైన కాకినాడలో..! మనలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సంఘటన గురించి తెలుసు. ఇందుకు ప్రధాన సూత్రధారి సామర్లకోటకి చెందిన ప్రతివాది భయంకర వెంకటాచారి..(భయంకరాచారి అని కూడా అంటారు ) .. అందుకు సంబంధిన వ్యాసాలు వికీపీడియా వ్యాసాలలోనూ, గూగుల్‌ శోధనలోనూ మనకు దొరుకుతాయి... అందులోని కొన్ని విషయాలనే నేను ఇక్కడ కాపీ పేస్ట్‌ చేయబోతున్నాను....

వినడానికి కొద్దిగా విచిత్రంగా ఉన్నా దేశచరిత్రలో ఎన్నో మలుపులకు, పరిణామాలకు కాకినాడ నాంది పలికింది.. అందులో ఒకటే ఈ "కాకినాడ బాంబు కేసు". మిగిలినవి వందేమాతరం గేయం పై ముస్లింల నిరసన, తెలంగాణ కి బిజెపి మద్దతు... మొదటిది దేశవిభజనకు కారణమైతే, రెండది రాష్ట్ర విభజనకు కారణం కాబోతోంది.. మిగిలిన వాటి గురించి తర్వాత రాస్తాను.. ప్రస్తుతం కాకినాడ బాంబు మన టాపిక్‌....

దీనికి ప్రధాన సూత్రధారి భయంకరాచారి అయితే, ప్రధాన లక్ష్యం డి ఎస్‌ పి ముస్తఫా అలీ ఖాన్‌..! ఇతనిపై జరిగిన హత్యాప్రయత్నమే "కాకినాడ బాంబు ప్రేలుడు"... దానికి సంబంధించిన లింకు ఇదిగో...!


నేను కాపీ చేస్తున్నది కూడా దీని నుంచే..! అందుకు ప్రేరేపించిన ఘటనలు కూడా కాపీ చేయడం జరిగింది..

వాడపల్లి కాల్పుల ఘటన:



1931 మార్చి 30 న వాడపల్లిలో పోలీసు కాల్పులు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి లో వెంకటేశ్వరస్వామి రథోత్సవం జరుగుతూండగా జరిగిన సంఘటన ఇది. రథంపై దేవుడి విగ్రహాలతో పాటు జాతీయ నాయకుల ఫోటోలను కూడా ఉంచి ఊరేగిస్తున్నారు. తహసీల్దారుతో సహా అక్కడికి చేరుకున్న డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్, వాటిని తొలగించమని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ప్రజలపై కాల్పులు జరపగా నలుగురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

సీతానగరం ఆశ్రమ ఘటన:



ఇక రెండోది 1932 జనవరి 19న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమంలో జరిగింది. సీతానగరం ఆశ్రమాన్ని మద్దూరి అన్నపూర్ణయ్య, మరికొందరి పర్యవేక్షణలో ఉంచి మిగిలినవారు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనేందుకు క్రొవ్విడి లింగరాజు నాయకత్వంలో కాకినాడ వెళ్ళారు. అప్పటికే - జనవరి 5న - ఆశ్రమం ప్రచురిస్తున్న "కాంగ్రెస్" పత్రికను చట్టవ్యతిరేకమైనదని ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ అక్కడికి చేరుకుని 'ఈ ఆశ్రమాన్ని చట్టవిరుద్ధమైనదని ప్రకటించాం. దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి' అని ఆదేశించాడు. అందుకు తిరస్కరించిన ఆశ్రమవాసులపై విచ్చలవిడిగా లాఠీచార్జి చేసాడు. 75 ఏళ్ళ ముదుసలిని కూడా వదలకుండా అందరినీ అరెస్టు చేసాడు.


సామర్లకోటకు చెందిన ప్రతివాది భయంకరాచారిని ఈ సంఘటనలు కలచివేసాయి. సామర్లకోటలో పదవ తరగతి వరకూ చదివిన భయంకరాచారి విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాలలో ఇంటర్మీడియెట్ లో చేరి సగంలోనే ఆపేసాడు. విద్యార్థిగా ఉండగానే ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చదువు ఆపేసాక కొన్నాళ్ళు సీతానగరం ఆశ్రమంలో గడిపాడు. 19 ఏళ్ళ వయసులోనే లాహోరు కాంగ్రెసు సభలకు హాజరయ్యాడు. శాసనోల్లంఘనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1930 మేలో గురజనపల్లిలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ననుసరించి ఇతర నాయకులతో పాటు తానూ విడుదలయ్యాడు. కన్ననూరు, బళ్ళారి జైళ్ళలో ఉండగా లాహోరు కుట్ర కేసు నిందితులు, బెంగాలు విప్లవకారులతో సంపర్కంలోకి వచ్చాడు. వారి వద్ద నుండి బాంబులు తయారుచేసే పద్ధతులు నేర్చుకున్నాడు.


భయంకరాచారి విప్లవ వీరులను ఆరాధించాడు. సంపూర్ణ విప్లవమే సంపూర్ణ స్వరాజ్యం తెస్తుందని నమ్మాడు. గాంధీ అహింసా మార్గాన్ని వ్యతిరేకించాడు. ప్రజలను చైతన్యవంతులను చేసి విప్లవోద్యమంలోకి ఉరకాలని ఉద్బోధించాడు. "యువతను ఉరితీస్తూ, ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్ళు మూసుకుని కూర్చోలేదు. ఎదురుతిరిగి విప్లవించాలి. అందుకవసరమైన ఖర్చుల కోసం బ్యాంకులను దోచాలి.." అని అనేవాడు.


కాకినాడ బాంబు ఘటన:



ఉద్యమ నాయకులపై అన్యాయంగా లాఠీచార్జి జరిపిన డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు భయంకరాచారి. మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరిల నుండి బాంబు తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్. చారి అండ్ సన్స్ అనే ఓ బోగసు కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు కామేశ్వరశాస్త్రి అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.


1933 ఏప్రిల్ 6 న కాకినాడలోని ఒక చోటికి ముస్తఫా రానున్నాడని తెలిసికొన్న వీరు, బాంబులు తయారుచేసుకొని అక్కడ మాటు వేసారు. అయితే ముస్తఫా అక్కడికి రాలేదు. ఇద్దరూ నిరాశ చెంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. ఏప్రిల్ 14 న మళ్ళీ కాకినాడలోనే మరోచోట ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా ముస్తఫా వారనుకున్నట్టు రాలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మాటు వేసారు. మూడోసారి కూడా ముస్తఫా మాటు వైపు రాలేదు. ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు. వీళ్ళు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.


పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నాడు. వెంటనే దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టరుకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. పోలీసులు ఒకరొకరినే పట్టుకుంటూ వచ్చారు. సెప్టెంబరు 11 న భయంకరాచారిని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.


డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెసు గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.