9, నవంబర్ 2017, గురువారం

తొలి తెలుగు చక్రవర్తి - గుణగ విజయాదిత్యుడు

గుణగ విజయాదిత్యుని పేరు, మన ప్రాంత చరిత్ర చదివినవారికి ఎప్పుడో ఒకప్పుడు, పరిచయమైన పేరే.!! ఎందుకంటే, వేంగిని పాలించిన చాళుక్యరాజుల్లో అగ్రగణ్యుడు, గుణగ విజయాదిత్యుడు (క్రీ.శ 848 - 891).

నామమాత్రపు స్వతంత్ర రాజ్యంగా ఉంటూ శత్రువుల దురాక్రమణలకు గురైతే, బాదామి/కంచి/తంజావూరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, వారి కృపాకటాక్షాలకోసం ఎదురుచూస్తూ పరిపాలించిన తక్కిన తూర్పుచాళుక్య ప్రభువులతో పోలిస్తే, చిలుక-పులికాట్ సరస్సుల మధ్యప్రాంతాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించడమేకాక, తొలుత తాను పొందిన ఓటమికి ప్రతీకారంగా ఉత్తర కర్నాటక రాష్ట్రకూటులు, వారి సామంతులైన వేములవాడ చాళుక్యుల రాజ్యాలపై జైత్రయాత్ర జరుపగలిగిన బలపరాక్రమాలు కలిగినవాడు గుణగ విజయాదిత్యుడు.

తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు.సరే..!! మరి తొలి తెలుగు చక్రవర్తి ఎందుకయ్యాడు?? తూర్పుచాళుక్యులకు ముందే, తెలుగునేల ముఖ్యకేంద్రంగా దక్షిణాదినేలిన తొలి & మలి శాతవాహనులున్నారు. విష్ణుకుండిన రాజులున్నారు. శాతవాహనులలో శ్రీముఖుడు, గౌతమీ పుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, విష్ణుకుండినులలో రెండవ మాధవవర్మ తమవంశస్థులలో మిగిలిన వారికంటే విశాలమైన సామ్రజ్యాలను స్థాపించారు/పరిపాలించారు. కానీ వీరిలో ఎవరినైనా "తొలి తెలుగు చక్రవర్తి" అని పిలవాలంటే మనం మరోసారి ఆలోచించుకోవలసి వస్తుంది. ఎందుకంటే, వారికాలంలో తెలుగు రాజభాష/పండితులభాష/అధికారభాష కాలేకపోయింది. ప్రాకృతము, సంస్కృతము తెలుగునేలమీద అధికారం చెలాయించాయి. అప్పటి ప్రాకృత,సంస్కృత శాసనాల్లోనూ, గ్రంథాల్లోనూ అక్కడక్కడ దొరికే మనుషుల, ఊర్ల, వస్తువుల పేర్లను వెతుక్కొని, 'తెలుగు ఉండి ఉండవచ్చని' అనుకుంటున్నాం. తప్పితే, పూర్తిగా తెలుగు శాసనాలు వారికాలానికి లేవు.

కానీ తూర్పు చాళుక్యుల చరిత్ర అలా కాదు. వారికాలానికి తెలుగు అధికారభాష అయిందనడానికి విరివిగా లభించిన తెలుగు శాసనాలే సాక్ష్యం. అటువంటి తూర్పు చాళుక్యుల్లో అగ్రగణ్యుడు, గుణగ విజయాదిత్యుడు. ఎందుకంటే, కేవలం ఒకటీ అరా తెలుగు శాసనాలు తప్పించి, అన్నీ సంస్కృత శాసనాలే వేయించిన తన పూర్వీకుల పద్ధతి కాకుండా, తెలుగు పద్యాలలో శాసనాలు వేయించినాడు. మనకి దొరుకుతున్న తొలి పద్యశాసనాలో మూడు శాసనాలు, గుణగ విజయాదిత్యుని కాలంనాటివే..!! వాటిలో మొదటిది, పండరంగడనే బ్రాహ్మణ సేనాని, క్రీ.శ 848లో వేయించిన అద్దంకి శాసనం
 
      పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
బలగర్వ మొప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
బంచిన సామంత పదువతో బోయ
కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.

తరువోజ ఛందస్సులో ఈ మొదటి తెలుగు పద్యం పండరంగని సేనాధిపత్యాన చాళుక్య సేనల పరాక్రమాన్ని తెలుపుతుంది.

అదే గుణగ విజయాదిత్యుడు, స్వయంగా వేయించిన కందుకూరు శాసనం (క్రీ.శ 850),లో మొదటి సీస పద్యం కనబడుతుంది.

"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..

ఇదికూడా సేనాని పండరంగని ప్రశంసించే పద్యమే.!! ఈ పద్యం చాలావరకూ శిథిలమైనట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఉన్నంతవరకూ, దీన్ని పరిష్కరించి మనకి చెప్పినవారు కొమర్రాజు లక్ష్మణరావుగారు.

ఇది కాక గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో తొలి ఆటవెలది పద్యం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది.

కిరణపురము దహళ నిరుతంబు దళెనాడున్
అచలపురము సొచ్చెనచలితుండు
వల్లభుండు గుణకె నల్లుండు (వంచి) నన్
బండరంగ చూరె పండరంగు

ఈ మూడు పద్యాలు చాలు, గుణగ విజయాదిత్యుని ఆస్థానంలో తెలుగుకవులు ఉన్నారని చెప్పడానికి.


సరే., సైనిక విజయాల వద్దకి వద్దాం.!!

గుణగ విజయాదిత్యుని విజయాలు, జైత్రయాత్రలగురించి స్వయంగానో, సమకాలీనులద్వారానో వేయించిన శాసనాల కన్నా, అతని అనంతరం వచ్చిన రాజుల శాసనాలలో మనకి తెలుస్తుంది. ఎమెస్కోవారు ప్రచురించిన "వేంగీ తూర్పు చాళుక్యులు" (డా. ఎన్. వేంకట రమణయ్య) పుస్తకం నుండి, విషయాలు కొన్నిటిని క్లుప్తంగా రాస్తున్నాను. నిజానికి గుణగ విజయాదిత్యుని విజయాల్లో ప్రధాన పాత్ర, ఆతని సేనాని పండరంగనిదేనని చరిత్రకారుల అభిప్రాయం

  • సింహాసనం అధిష్టించిన తొలి సంవత్సరాలలో రాష్ట్రకూట రాజు అమోఘవర్షుని చేతిలో పరాజితుడై, ఆతనికి సామంతునిగా ఉన్నప్పటికీ, అమోఘవర్షుని మరణానంతరం స్వతంత్రించాడు.
  • అమోఘవర్షుని సామంతుడుగా, చక్రవర్తి ఆజ్ఞననుసరించి దక్షిణ కర్నాటకలో తిరుగుబాటు చేపట్టిన పశ్చిమ గాంగులని అణిచివేశాడు.
  • స్వతంత్రించిన పిమ్మట, రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణున్ని ఓడించి ఆతని రాజ్యభాగాలను కొన్నిటిని పొందాడు. ఆ యుద్ధంలో కృష్ణుణ్ణే కాక, ఆతనికి సహాయం చేసేందుకు వచ్చిన దాహళదేశపు రాజును సైతం ఓడించాడు.
  • తనని ఆశ్రయించిన చోళ రాజు (పేరు తెలీదు)కి అభయమిచ్చి, అతని శత్రువలైన పల్లవులను, పాండ్యులను, అణిచివేశాడు.
  • కళింగ మీదుగా దండెత్తి, మొదటగా ఉత్తర కళింగని ఓడించి అటుపైన వేములవాడ చాళుక్యుల చక్రకూటాన్ని (ఛత్తీస్ గఢ్ లోని బస్తరు ప్రాంతం) ధ్వంసం చేశాడు.
  • అటుపైన కోసల రాజ్యాన్ని (పశ్చిమ ఒరిస్సాలోని సంబల్ పూరు ప్రాంతం) ముట్టడించి, కప్పం వసూలు చేశాడు.
  • ఆ తర్వాత, దాహళ రాజ్యంపై (మధ్యప్రదేశ్ లోని గంగ-నర్మద మధ్య ప్రాంతం) దండెత్తి, వారి రాజ్యంలోని అచలపురం, కిరణపురం వంటి పట్నాలను ధ్వంసం చేశాడు.
  • పండరంగని సేనలు కిరణపురాన్ని ముట్టడంచినపుడు దాహళరాజుతో పాటు, అక్కడే ఉన్న రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు రాజ్యాన్ని వదిలి పలాయనం చిత్తగించారు.
  • తన సైనిక శక్తిని చాటినప్పటికీ, తన ఆధిపత్యాన్ని అంగీకరించిన పిమ్మట రాష్ట్రకూట భూభాగాలను కృష్ణునికే ఇచ్చివేసి, అతని రాచగౌరవాన్ని పునరుద్ధరించాడు.
ఈ విధమైన విజయాలకారణంగా, గుణగ విజయాదిత్యుడు, శత్రువులచేత చండ-చాళుక్యునిగా పిలువబడ్డాడు.

మన ఆంధ్రదేశ చరిత్రని చూస్తే, చుట్టువైపులనుండీ వచ్చిన శత్రువులకి దాసోహమైన రాజులే తప్ప, మన ప్రాంతంనుండి తక్కిన ప్రాంతంమీదకి దండయాత్ర జరుపగలిగిన సైనికసంపత్తి ఉన్నవాళ్లలో మొదటివాడు, గుణగవిజయాదిత్యుడు. అంతేకాకుండా, తెలుగు కవులను పోషించిన మొదటిరాజు కూడా. అందుకే, ఆయన "తొలి తెలుగు చక్రవర్తి "