7, సెప్టెంబర్ 2011, బుధవారం

జై కాకినాడ..! (ఇది జరిగిన కథ కాదు.. ఊహించుకున్నది మాత్రమే..!)


అది మధురవాడ బస్‌స్టాప్‌ నుండి కొమ్మాదికి పోయే సర్వీసు రోడ్డు..!

      మేం దాన్నే ఎందుకు సెలెక్ట్‌ చేసుకున్నామంటే, అక్కడ ఒకట్రొండు ఆటోలు తప్పితే, ఇంకేవీ తిరగవు.. రోడ్డు మీద పడుకున్నా, అడిగేవాడుండడు.. ఎవరికివాళ్లం, చేతుల్లో బోర్డులు పట్టుకుని అరుస్తున్నాం..!
జై కాకినాడ..!
జై బొబ్బిలి..!
జై రాజమండ్రి..!
జై గాజువాక..!
ఇలా అన్నమాట..! మేం ఇలా అరుస్తూండగానే, అక్కడివాడెవడో వచ్చి మాతో కలిసాడు.. "జై మధురవాడ". అంటూ.. వాడిక్కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలట.! మిగతా, విశాఖపట్నంవాళ్లతో వేగలేం అనేసాడు..

           నా చేతుల్లో "జై కాకినాడ"..బోర్డు మెరుస్తోంది..! (బహుశా, నాకలా అనిపించి ఉండచ్చు..!)
అంతవరకూ బానే ఉంటుంది. జర్నలిస్టులూ, మీడియా రాకపోతే మజా ఏముంటుంది..?
టివీ 99 రిపోర్టర్‌ ఎవడో వచ్చాడు.. చంద్రం అని మా ఫ్రెండొకడు గట్టిగా అరుస్తూ కనపడేసరికి, వాణ్ణి కదిపాడు..
"ఆ..! స్వప్నా..! మరీ..!....ఇక్కడా..!"...."అంటే..! వైజాగ్లో.. మరీ..! మధురవాడలో..!..."....ఇలా సగం విగ్గొట్టి, తెగ్గొట్టి చిత్రవధ చేసేస్తున్నాడు... మైకు ముందేసుకుని.!

వాడి సోదికి చంద్రం ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.."జై మండపేట..!"..అంటూ.. (మరి, వీడికి ప్రత్యేక మండపేట రాష్ట్రం కావాలిట..!)..  ఇవన్నీ పట్టించుకోడానికి ఆ టీవీ 99 రిపోర్టర్‌ కొత్తవాడేమీ కాడు.. తను మాట్లాడేదేదో మాట్లాడేస్తున్నాడు... ఉన్నదున్నట్టు చెప్పడం కష్టంగానీ, దాని సారాంశం ఏంటంటే
గాయత్రి కాలేజి విద్యార్థులు, తెలంగాణ ప్రకటనపై విన్నూత్నంగా నిరసన చేపడుతున్నారని..! ఈ ముక్క చెప్పడానికి ఇంత కష్టపడ్డాడేంట్రా అనుకున్నాను..

"మీరు..! తెలంగాణ ప్రకటన పై నిరసనకోసం ఇలాంటి ప్రదర్శనని ఎందుకు ఎంచుకున్నారు..?"... విషయంలోకొచ్చాడు టీవీ99 రిపోర్టర్‌..
చంద్రమేమీ తక్కువ తినలేదు

"ప్రత్యేక మండపేట కోసం పోరాడుతుంటే, నిరసన అంటావేంది..? ఇది మా మండపేటని అవమానించడమే..! అందుకే మా మండపేట మాక్కావాలె..!"...అని కేసిఆర్‌ ని అనుకరించబోయాడు...

టీవీ 99 కి అర్థంకాలేదు.. ఎవడిని చూసినా అరుస్తూనే ఉన్నాడు., ఎవడి రాష్ట్రం వాడిక్కావాలి మరి..!
నాకేసి చూసాడు.బహుశా, అమాయకంగా కనిపించినట్టున్నాను

"మీరీ ప్రత్యేక కాకినాడ ఎందుకు కోరుతున్నారు..?"...అడిగాడు నన్ను..

"మా కాకినాడకి అన్యాయం చేసారు..! అందుకే అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయింది.! అందుకే మా కాకినాడని ప్రత్యేక రాష్ట్రం చేయాలి.."..అనేసాను

"వెనకబడిపోయిందని ఎలా చెబుతున్నారు మీరు..? అంటే..! ఏయే కారణాలతో..?"..వెంటనే అడిగేసాడు..టివీ 99

"కారణాల నన్నడుగుతావేంది..? పోయి మా కాకినాడవాళ్లనందరినీ అడుగు..! వాళ్లు చెప్పకపోతే.., కేసిఆర్‌ నడుగు..! తెలంగాణకున్న కారాణాలే కాకినాడక్కూడా..!"..అన్నాను కొంత ఆలోచించీ, కొంత కవర్‌ చేసి..

"అలా కాదు..!"....అన్నాడు టీవీ 99...చెవులు మూసుకుంటూ.., అరుపులెక్కువైపోయాయి కదా..! "సరైన కారణాలు చెప్పాలిగా.."..అనబోతూండగా..! పక్కనే ఉన్న కుమార్‌ అందుకున్నాడు.. (వీడూ కాకినాడే..!)

"మా కాకినాడ ఇప్పటికీ మెయిన్‌ లైన్‌ లో లేదు..! మా కాకినాడలో ఎయిర్‌పోర్ట్‌ లేదు..! మా  కాకినాడలో అసెంబ్లీ, పార్లమెంటూ, హైకోర్టూ, సుప్రీం కోర్టూ లేవు..! ఇంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి..మా కాకినాడని అన్యాయం చేసేసారు అని చెప్పడానికి?"..అనేసరికి తెల్లబోవడం టివీ 99 వంతైంది.. అయినా, ఎక్స్‌పీరియన్స్‌డ్‌ రిపోర్టర్‌ కనక అవేమీ పైకి కనపడనీయకుండా ఉండడానికి ట్రై చేసాడు. కానీ మనం పట్టేసాం.. జగత్కంత్రీలం కద..!

ఇంతలోకి సురేంద్ర వచ్చాడు..(వీడు నా జూనియర్‌).. "ప్రత్యేక రాజమండ్రి" అంటూ..!
వాడికేసి తిరిగాడీ టీవీ 99..!కానీ, ఈ సురేంద్ర, టీవీ 99తో మాట్లాడడం మానేసి, మాతో అరవడం మొదలెట్టాడు..
"ఏటి సార్‌..? కాకినాడ..కాకినాడ..అంటున్నారు..! యెధవ కాకినాడ..! యెదవ కాకినాడాని..! మీ కాకినాడ వల్లే మా రాజమండ్రికి అన్యాయం జరిగిపోతోంది.."...అరిచేస్తున్నాడు..
కాకపోతే, మేమందరం సీనియర్లం కాబట్టి మాట్లాడడానికి వాడికి అవకాశం ఇవ్వలేదు..!

"మీ ప్లాన్లేమిటి..?"..అడగబోయాడు టీవీ99.. వెంటనే అడ్డం పడిపోయాన్నేను.."ఏందిరా బై..! ప్లాన్లూ గీన్లూ అంటున్నవ్‌..? అసుమంటియేం లెవ్‌..! మా గాకినాడ మాగ్గావాలె..!"... అనేసాను కేసిఆర్‌ ని ఊహించుకుని..!

ఇలా మేం ఓ పక్క్‌ హడావిడి చేసేస్తూ ఉంటే, ఇంకో వైపు మా ఫ్రెండు గెద్దర్‌ (వీడి నిక్‌ నేం గెద్ద..! అంటే గ్రద్ద అన్నమాట.. మేం గెద్ద అనే అంటాం..! కాదంటే,  మీరు మా సంస్కృతిని అవమానిస్తున్నట్లే..! ప్రత్యేక ఉద్యమం వల్ల వాడు దాన్ని గెద్దర్‌గా మార్చుకున్నాడు). ఒరిజినల్‌ గద్దర్‌ గోచీతో ఉండి, నల్ల దుప్పటి కప్పుకుని ఉంటే, ఈ గెద్దర్‌, దుప్పటి కప్పుకునే వచ్చాడు, పళ్లు కూడా తోముకోకుండా...! పాట పాడేస్తున్నాడు..

"ఇజినారం గడ్డమీద సెందమామయ్యో..! సెందమామయ్యా..!"..అంటూ, మధ్య మధ్యలో గెంతులేసేస్తున్నాడు.!

అందరూ వాడికేసి చూస్తున్నారు... వాడి చేతిలో ఉన్న బోర్డు.. "జై ఇజినారం.."

ఈ టివీ 99, వాడి పాటని షూట్‌ చేయడానికెళ్లాడు...! వెంటనే వాడిచేతుల్లోంచి మైకు లాక్కుని "అమ్మలారా ..!"..అంటూ ఏదో మొదలుపెట్టేసాడు గెద్దర్‌..!

తిన్నగా ఉండక "జై విజయవాడ"..బోర్డు పట్టుకున్నవాడో, "జై తిరుపతి" వాడో, "ఇజినారం ఏంట్రా..? విజయనగరం అని పెట్టుకోవచ్చుగా..!"..అనేసరికి

"మా సంస్కృతి ఇదే..! మాది ఇజినారం..! మా ఇజినారాన్ని మీరందరూ ఇలాగే అవమానిస్తున్నారు..! అందుకే మా ఇజినారం మాగ్గావాలె..!"..అన్నాడు గెద్దర్‌...

టీవీ 99 "జై ఇజినారం"..బోర్డున్న ఇంకొకడిని కదిపింది... "మీ చొక్కా మీదున్న ఆ బొమ్మ ఏంటండి..?"..అంటూ..
"ఈవిడే.. మా ఇజినారం తల్లి..! పైడమ్మ..!"..అనేసరికి, టీవీ 99 మూర్ఛపోబోయి, పైడమ్మ ముందునుండి తెలుసున్న పేరే కనక, తట్టుకోగలిగాడు అప్పటికి..

కానీ మా దగ్గరికి మళ్లీ వచ్చేసరికి మూర్ఛపోక తప్పలేదు...! అయితే దానికి ముందే ఇంకో ఇన్సిడెంట్‌ జరిగింది,.. 

నేనూ, కుమారూ "జై కాకినాడ"..అంటూ అరిచేస్తున్నాం.. ఇంతలో చరణ్‌ వచ్చేడు.. "జై గాంధీనగరం బ్రాకెట్లో కాకినాడ -2 "..అంటూ

"అదేంట్రా..? గాంధీనగరం సెపరేట్‌ కావాలా..నీకు..?"..అశ్చర్యపోయాం నేనూ, కుమారూ..!

"అవునుబే..! మీ నరసన్ననగరూ, ప్రతాప్‌నగర్‌ వాళ్లతోనూ, మిగితా కాకినాడతోనూ మేం పడలేం..! మా పార్కులోకి అస్తమాటూ వచ్చేస్తున్నారు.. మా పార్కు మాక్కావాలంటే, మా గాంధీనగరం బ్రాకెట్లో కాకినాడ-2 ని ప్రత్యేక రాష్ట్రం చేయాల్సిందే..! ఇచ్చేంతవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..! మా గాంధీనగరం బ్రాకెట్లో కాకినాడ-2 రాగానే మీరెవ్వరూ మా ఏరియాలోకి రాకుండా అడ్డంగా గోడలు కట్టేస్తాం..!" అన్నాడు ఆవేశంగా..

"అలా కాదు "..అని నేనబోతూండగా, టీవీ 99 మా పక్కనే "జై రాజమండ్రి"బోర్డు పట్టుకుని ఉన్న సురేంద్రని అడిగాడు.. "మీ చొక్కా మీదున్న బొమ్మ ఎవరిదీ.?"..అని

"ఈవిడ మా రాజమండ్రి తల్లి..! ఓ చేతిలో రైల్‌ కం రోడ్డు బ్రిడ్జీ, ఇంకో చేతిలో పేపర్‌ మిల్లూ పట్టుకుని ఉంటుంది.."..అన్నాడు, నెమ్మదిగా..! అరిచి అరిచి కొద్దిగా నీరసం వచ్చినట్టుంది వాడికి..!

మా దగ్గరికి వచ్చే ముందే టీవీ 99, "జై వైజాగ్‌"..వాణ్ణి కలుసుకొని, వైజాగ్‌ తల్లి గురించి తెలుసుకున్నాడు..

"అందరికీ వాళ్ల  వాళ్ల తల్లులున్నారు, చేతుల్లో ఏవేవో పట్టుకుని..! మరి మీ కాకినాడ తల్లి ఎలా ఉంటారు..?"..అడిగాడు మమ్మల్ని..

నేనేదో చెప్పబోయేలోపు కుమార్‌.. "వైజాగ్‌ తల్లి ఎలా ఉంటుందట..?"...అని అడిగాడు..

"అవిడ ఒక చేతిలో షిప్పూ...ఇంకో చేతిలో స్టీల్‌ ప్లాంట్‌ పట్టుకుని ఉంటుంది..!"..అన్నాడు టీవీ 99.

నేనందుకున్నాను వెంటనే.. "మా కాకినాడ తల్లి కూడా ఒకచేతిలో షిప్‌, పట్టుకుని ఉంటుంది,.."..

"మరి ఇంకో చేతిలో..?"...ఉత్సాహంగా అడిగాడు టీవీ 99


"కాకినాడ కాజా...!".....అన్నాను వెంటనే...
................... 
.....................
..................................
ఆ టీవీ 99 మరి ఇంక ఎదురుగుండా కనపడలేదు.. ఏమైపోయాడా అని అటూ ఇటూ చూస్తే, కిందపడి ఉన్నాడు..మూర్ఛపోయి..!

..................................................................................................................................................................
ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత, ఏదైనా నిరసన వ్యక్తం చేయాలని తెగ ఆరాటపడిపోయాను..! దానిక్కారణం కేసిఆరే..! మరి అతనే కదా, ఆంధ్రావాళ్లనందరినీ, అమ్మ నా బూతులూ తిట్టిందీ...! రోడ్డు మీదకొచ్చి నిరసనలూ, ధర్నాలూ చేస్తే, మా కాలేజ్‌ తోలు తీసేస్తుంది.. అందుకే, ఇలా ఊహించుకొని సంతృప్తి చెందాను.. 

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

తెలుగు - నెలలు, సంవత్సరాలు, అంకెలు


           మనం మర్చిపోయిన తెలుగుని అంటే వాడుక పదాలనీ, జాతులవారినీ, కులాలూ,కుటుంబాలవారినీ మళ్లీ మనకి గుర్తుచేసేందుకే "నుడి"..ని మొదలుపెట్టిన ఆంధ్రభూమివారు నిజంగా అభినందనీయులు...! ఆంధ్రభూమి "నుడి"లో వచ్చిన వ్యాసం ఆధారంగా తెలుగు నెలల గురించి ఈ పోస్ట్‌ రాద్దామనుకుని.., అందరికీ తెలిసినవైనా తెలుగు సంవత్సరాలనీ, అంకెలనీకూడా జతపరచేస్తున్నాను...! అయితే, ఈ పోస్ట్‌ ప్రధాన ఉద్దేశ్యం నా మిత్రులకి తెలుగు నెలలు పరిచయడమేనని ఇంకోసారి మనవి చేస్తున్నాను.
అందుకు సంబంధించిన లింకు ఇదిగో..
తెలుగు నెలలు
చైత్రము ----------ముంగాపి, ముందాపి
వైశాఖము--------కొంగాపి, కందాపి
జ్యేష్ఠం------------ఒల్లాపి
ఆషాఢము-------కట్లాపి
శ్రావణము--------సెవ్వాపి
భాద్రపదము------ముంగనాపి
ఆశ్వయుజము----కుదునాపి, కుందాపి
కార్తీకము----------జీరాపి
మార్గశిరము------ ఈరాపి
పుష్యము----------తైందాపి
మాఘము---------ఏరిమాపి
ఫాల్గుణము--------ఏగాపి, కడాపి
ఒకప్పుడు అంటే సుమారు వందేళ్ల క్రితం వరకూ, మన తెలుగునాట పేర్లు వాడుకలో ఉండేవట.. ప్రస్తుతం, తమిళనాడులో పాత ఉత్తర,దక్షిణ ఆర్కాట్జిల్లాలూ, తిరువణ్ణామలై జిల్లాలోనూ పెద్దసంఖ్యలో ఉన్న తెలుగు కుటుంబాల్లో ఇంకా వాడుకలో ఉన్నాయి..! (ఆంధ్రభూమి "నుడి" సౌజన్యంతో)

తెలుగు సంవత్సరాలు
1. ప్రభవ,
2.
విభవ,
3.
శుక్ల,
4.
ప్రమోదూత,
5.
ప్రజోత్పత్తి,
6.
అంగీరస,
7.
శ్రీముఖ,
8.
భావ,
9.
యువ,
10.
ధాత,
11.
ఈశ్వర,
12.
బహుధాన్య,
13.
ప్రమాధి,
14.
విక్రమ,
15.
వృష,
16.
చిత్రభాను,
17.
స్వభాను,
18.
తారణ,
19.
పార్థివ,
20.
వ్యయ,
21.
సర్వజిత్తు,
22.
సర్వధారి,
23.
విరోథి,
24.
వికృతి,
25.
ఖర,
26.
నందన,
27.
విజయ,
28.
జయ,
29.
మన్మథ,
30.
దుర్ముఖి,
31.
హేవళంబి,
32.
విళంబి,
33.
వికారి,
34.
శార్వరి,
35.
ప్లవ
36.
శుభకృత్తు,
37.
శోభకృత్తు,
38.
క్రోథి,
39.
విశ్వావసు,
40.
పరాభవ,
41.
ప్లవంగ,
42.
కీలక,
43.
సౌమ్య,
44.
సాధారణ,
45.
విరోధికృత్తు,
46.
పరీధావి,
47.
ప్రమాదిచ,
48.
ఆనంద,
49.
రాక్షస,
50.
నల,
51.
పింగళ,
52.
కాళయుక్తి,
53.
సిద్ధార్థి,
54.
రౌద్రి,
55.
దుర్ముఖి,
56.
దుందుభి,
57.
రుధిరోద్గారి,
58.
రక్తాక్షి,
59.
క్రోధన,
60.
అక్షయ.
తెలుగు అంకెలు
౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯
0 1 2 3 4 5 6 7 8 9
తెలుగు సంవత్సరాలు ఇప్పటికే వాడుతున్నా, తెలుగు అంకెలు మళ్లీ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టా, తెలుగు నెలలని వాడడం కూడా మొదలుపెడదామనుకుంటున్నా..! మీరూ మొదలుపెట్టండి..!