10, అక్టోబర్ 2011, సోమవారం

ఆర్య -ద్రవిడ -4 ( ఎందుకొచ్చిన గొడవదింతా..? వదిలేస్తే పోలా..? )



వారం క్రితం మొదలుపెట్టిన సుత్తిని ఇవాళ్టితో పూర్తి చేసేద్దామనుకుంటున్నాను. కాస్త చదివేసి కోపరేట్‌ చేసెయ్యండి.. లేదూ..! మొదట్నించీ చెప్పాల్సిందేనంటారా..? అయితే వెళ్లిండి.. ఫస్టు పార్టు, సెకండు పార్టు, థర్డు పార్టు..

సంస్కృతానికీ, లాటిన్‌ కీ ఉన్న సంబంధం దగ్గర ఆగాం కద..! అక్కణ్నుంచే కంటిన్యూ చేసేద్దాం మరి..! చేసెద్దాం అనెయ్యండం బానే ఉందిగానీ, మన దగ్గర మేటర్‌ ఉండొద్దూ..! మహ మహ భాషాశాస్త్రవేత్తలే తన్నుకుంటున్న సంబంధం గురించి చెప్పడానికి నేనెవర్ని.. అందుకే, నాకు తెలిసిన నాలుగు ముక్కలూ రాసేస్తున్నాను.. చూస్కోండి..!

శనకైస్తు క్రియాలోపాదిమా: క్షత్రియ జాతయ:
వృషలత్వం గతాలోకే బ్రాహ్మణాదర్శనే న చ
పౌండ్రకా శ్చౌఢ్ర ద్రవిడా: కాంభోజా యవనా శ్శకా:
పారదా పహ్లవా శ్చీనా: కిరాతా దరదా: ఖశా: (10-43,44)
దీనర్థం "పౌండ్రక, ఓఢ్ర, ద్రవిడ, కాంభోజ, యవన, శక, పారద, పహ్లవ, చీన, కిరాత, దరద, ఖశదేశములందు జన్మించిన క్షత్రియులు బ్రాహ్మణ దర్శనము లేనివారై ఉపనయనాది సంస్కారహీనులై క్రమముగా వృషలత్వము చెందిరి."
ఇది జటావల్లభుల పురుషోత్తం గారు సంకలనం చేసిన "ధర్మమంజరి"లోనిది. ఇది మనుస్మృతి నుండి సంగ్రహించబడింది. దాని తర్వాతి శ్లోకం కూడా రాస్తున్నాను. సంస్కృతం బాగా వచ్చిన వారు దాని అర్థం చెప్పగలరు..!
ముఖబాహురూపద్జానాం యా లోకే జాతయో బహి:
మ్లేచ్ఛవాచశ్చార్యవాచ: సర్వే తే దస్యవ: స్మృతా: (10-45)
దీనర్థం నాకు తెలీదు..! మీకు తెలిస్తే తెలుసుకొనగోరుచున్నాను.!

ఇంకో విషయం...! మ్లేచ్ఛుల జననం గురించి భారతంలో ఉన్నదట..! విశ్వామిత్ర, వసిష్ఠుల సంఘర్షణలో కామధేనువు నుండి ఉద్భవించినవారే మ్లేచ్ఛులట..!

భారతదేశపు క్షత్రియ వంశజుల సంతతివారే యవనులని, మన పురాణవేత్తల ప్రగాఢ విశ్వాసం..! (ఈ విశ్వాసాన్ని మాక్స్‌ ముల్లర్‌ పరిగణనలోకి తీసుకోలేదు.. కారణాలు కొంతమందికి కోపం తెప్పించేవిధంగానూ, కొంతమందికి నవ్వు తెప్పించేవిధంగానూ ఉంటాయి..). అందుకు యయాతి..అతని ఐదుగురు పుత్రుల కథని చెప్పుతారు. అందులో నాకు జ్ఞాపకం ఉన్నది ఇద్దరు "పురువు."..."యదువు".. యదు సంతతి వారే యాదవులు..! పురు వంశస్థులే కౌరవులూ, పాండవులూనూ.. (ఈ విషయంలో చాలా భేదాభిప్రాయాలున్నాయి..! పురు వంశం, కురువంశం ఒకటి కాదని కొందరూ, ఒకటేనని కొందరూ అంటూంటారు..!) మిగిలిన ముగ్గురు కొడుకులూ భారతదేశాన్ని వదిలి ఉండవచ్చని, వారి సంతతే యవనులూ, పఠాన్లూ, తదితరులనీ కొంతమంది భావన..!

ఇక్కడి వరకూ కొంతమందివరకైనా తెలిసిన విషయాలే..! పైగా చరిత్రకందగల కాలానికి చెందినవే..! చరిత్రకందని రామాయణం కాలం సంగతేమిటి..? రామాయణకాలానికీ, భారతకాలానికీ 1000 సంవత్సరాల నుండి 15 లక్ష సంవత్సరాల వరకూ (ఎవరి లెక్కలు వాళ్లవి..!) తేడా ఉంది కదా..! అప్పడేమి జరిగాయో మరి ఎక్కడ రాసుందీ..?

ఎక్కువమంది విశ్వసించే విధంగా రాముడు అయోధ్యలోనే పుట్టాడని, భారతదేశానికే పరిమితమయ్యాడనీ అనుకుందాం..! కానీ రాముని వారసులూ, సోదరులూ అయోధ్యకే పరిమితం కాకపోయి ఉండవచ్చనిపిస్తోంది..! ఎందుకంటే, భరతుడు గాంధారదేశాన్ని జయించాడట..!  భరతుని పుత్రులైన తక్షకుడు, పుష్కళుడు గాంధార దేశాన్ని పరిపాలించారట..! తక్షకుడు నిర్మించిన నగరాలు తక్షశిల., తక్షఖండం (ఉజ్బెక్‌స్థాన్‌ రాజధాని తాష్కెంట్‌..!)..! పుష్కళుని నిర్మితం పుష్కళావతీ నగరం.. అదే నేటి పెషావర్‌..! అలాగే, లవుడుకుశుడు నిర్మించిన నగరాలు నేటి పాకిస్థాన్‌ లో ఉన్నాయి. లవుడు నిర్మించిన నగరమే నేటి లాహోర్‌ (లవపురి)..! కుశుడు నిర్మించిన నగరం కాసూర్‌..!

ఎక్కడి అయోధ్య..? ఎక్కడి తాష్కెంట్‌..? ఒక్క తరంలో అంత స్థానచలనం ఉన్నప్పుడు, ఎన్నో తరాలు మారిపోయాయి, ఇప్పటికి..ఇంకెన్ని చలనాలు ఉండుంటాయి..? అందువల్ల భారతదేశం లోపలికీ, బయటికీ వలసలు జరిగాయన్నది కొట్టిపాడెయ్యలేని వాదం..! మరి, మన పురాణవేత్తల (భారతీయ చరిత్రకారులు) విశ్వాసాన్ని మాక్స్‌ముల్లర్‌ పరిగణలోకి తీసుకోక తప్పుచేసాడని అనుకోవచ్చుగా..!

సంస్కృతానికీ, లాటిన్‌ మధ్యలో సంబంధం వెతకాలంటే, మన పురాణాలనీ, ప్రాచీన రోమనుల సాహిత్యాన్నీ, గ్రీకుల పురాణాలనీ, పారశీకుల మతగ్రంథాలనీ తీవ్రంగా అధ్యయనం చేసి, వారి మూలస్థానం ఎక్కడని పేర్కొన్నారో తెలుసుకోవాలి..! ఇదంత ఈజీ ప్రాసెస్‌ కాదు..! ఎప్పట్నుంచో తన్నుకుంటున్నది ఇక్కడే..! మనదేశంలోనైతే, గురుశిష్యపరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగి మన ప్రాచీన గ్రంధాలలో కొంతైనా మనకి లభించింది. అయితే, వాళ్ల పరిస్థితి అది కాకపోవచ్చుగా..! గ్రీకు సంస్కృతిని పారశీకులు కూలగొట్ట ప్రయత్నిస్తే, పారశీక సంస్కృతిని ఇస్లాం కూలగొట్టింది. అదే విధంగా రోమనుల సంస్కృతినీ క్రైస్తవం కూలగొట్టింది. అంతకు ముందు అరేబియా, పారశీకం, రోమ్‌, గ్రీసు లాంటి చోట్ల విగ్రహారాధక సంస్కృతే ఉండేది..! ఇదంతా, చరిత్రకందిన కాలంలో జరిగిన సంఘటనలు, మరి అంతకు ముందేమి జరిగిందో..? ఎన్ని దాడులు జరిగాయో..? ఇలాంటివన్నీ అనంత ప్రశ్నలూ, భేతాళ ప్రశ్నలూనూ..! వెరసి, ఇక్కడ తేలిన విషయం ఏంటంటే, అంతా అయోమయం.....అగమ్యగోచరం..!




ఇంక ముగించేద్దాం.. ఈ సుత్తిని...!

ఏ వాదం చేసినా సరే, అది మానవశ్రేయస్సుకి ఉపయోగపడేదై ఉండాలి..! అందులోనో మనది "సర్వే జనా: సుఖినోభవంతు", "వసుధైవ కుటుంబకమ్‌"..సంస్కృతి కదా..! అందువల్ల మన భారతదేశంలో అది ముందే అవసరం..! ఆర్యులు, ద్రవిడులూ అని తన్నుకుంటూ ఉండడం అస్సలు మంచిది కాదు..! ఋగ్వేదంలో చెప్పినట్టు "భారతదేశం నానాజాతి సంగమం".. అనేదాన్ని అంగీకరించేసి, అందర్నీ గౌరవిస్తే బాగుంటుంది..!

చరిత్ర..విషయానికొస్తే, భారతీయుల సంస్కృతికీ, మిగిలిన నాగరికతలకీ ఉన్న తేడా ఏమిటంటే, వాళ్ళు ఉన్నదున్నట్టు రాసేవాళ్ళు... మనవాళ్ళేమో భక్తిభావంతో రాసేవాళ్లు. అందువల్ల మనవాళ్లు ఏం రాసారో తిన్నగా అర్థం కావాలంటే, భక్తిభావంలో "రాసినవారి స్థాయి"కెళ్లిపోవాలి.. అప్పటివరకూ పూర్తిగా అర్థం కాదు..! అర్థం చేసుకునే సమయం ఎవ్వరికీ దొరకదు...!

"పురాణం" అనే పదం యొక్క అర్థం "చరిత్ర",..అని(ట..!). అందువల్ల, ఒకప్పుడు పురాణం చదువుకున్నవారు హిస్టరీ స్టూడెంట్స్‌ కింద, రీసెర్చర్స్‌ కింద లెక్కలోకొచ్చేవారు..! వాళ్లిచ్చే లెక్చర్లే హరికథలూ, బుర్రకథలూ, జానపదకథలూ ఇలాగన్నమాట..! మనకి తెలిసిన 18 పురాణాలు, 18 ఉపపురాణాలు కాకుండా వేలకొద్దీ కులపురాణాలూ, లక్షలకొద్దీ స్థలపురాణాలు కూడా ఉన్నాయి (ఉండేవి). దురదృష్టం ఏంటంటే, వీటిలో చాలాభాగం లిపిబద్ధం కాక, ఖిలం అయిపోయాయి (అయిపోతున్నాయి..!). వీటినన్నింటినీ, సేకరించి, క్రోడీకరిస్తే, కులం ఎందుకు పుట్టిందో, "అందరూ ఒక్కటే" ఎలా అవుతారో, తదితర విషయాలన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ చేసేవాళ్లెవరు..?

విషయం పక్కదారి పట్టేసింది. అసలు విషయానికొద్దాం..! ఎవరు అవునన్నా, కాదన్నా మనచరిత్ర విదేశీయులు రాసిందేనన్నది నిజం..! మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులు ఒక్కోచోట మన పురాణాలకీ, కథలకీ అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడదు. అందువల్లనే మన చరిత్రనిండా కంతలే..! అది "ఆర్య -ద్రవిడ" రాద్ధాంతమే కావచ్చు.. ఇంకోటే కావచ్చు..!

(ఇంతకన్నా ఎక్కువ సుత్తి కొట్టేస్తే కష్టం.. అందుకే ఆపేస్తున్నాను..!)

2 కామెంట్‌లు:

  1. bossu, comment pedadamante asalem telchavo ardhame kaledu.
    >>ఎవరు అవునన్నా, కాదన్నా మనచరిత్ర విదేశీయులు రాసిందేనన్నది నిజం..!<<
    mana charitra manakunadi. mana purvikula rasina danilone chala varaku nikshiptamai unnaayi. duradrustam entante, ancient indian history anagane alien's rasina charitrane tiragestunam kani mana purvulu rasinavi kaadu akkade ee godavanta. enchakka mana charitra mana purvulu rasinavi follow avte ee gola anta enduku. dravidians are very much aryans without any argument. I myself a research fellow in indology. Since it is very long description, better we leave it here. Appreciate your interest and effort.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణగారూ..! నమస్తే..!

    ఇక్కడ నేనేమీ తేల్చలేదు..! (నిజంగానే)... చివర్లో రాసిన నాల్గు ముక్కలూ దేని గురించంటే, "ఆర్య -ద్రవిడ"..అని తన్నుకునేవారి గురించి, తన్నుకోవడం మానెయ్యమని..! నా మాట చెప్పేదేమంటే, "ఆర్యులు - ద్రవిడులు"..అని రెండుగా విడిపోయిలేరూ, అనీ..! (ఒకవేళ ఉన్నా, అనవసరం అనీ..!). ఇంకో ఉచిత సలహా ఏంటంటే, "మేము ఆర్యులం"..అని అరిచేవాళ్లని అఫ్ఘనిస్థాన్‌ అవతలకీ, "మేము ద్రవిడులం".అనే వాళ్ళని కన్యాకుమారికి అవతల సముద్రంలోకి (వీలైతే ఆఫ్రికాలోకి)..తోసేద్దాం..! అప్పుడు ఇక్కడ ఉండేది కేవలం భారతీయులే..!

    రిప్లయితొలగించండి