21, ఏప్రిల్ 2012, శనివారం

అగ్గి పడింది..!



మొత్తానికి భారత్ పంచమాగ్ని (అగ్ని -5)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ ఆగ్నేయాస్త్రం సైన్యం చేతుల్లోకి రావడానికి ఇంకో రెండేళ్ళు పడుతుంది. అయితే ఈలోపులోనే మన శత్రు దేశాలకి, ముఖ్యంగా మన దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న దేశాలకి రంగు పడింది. అక్కడితో మనం సంబరాలు చేసేసుకోవడమేనా.? కానే కాదు...
ఎందుకంటే, ఈ వార్త చూడండి.
// భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి ఆ ప్రభుత్వం చెప్తున్నదానికన్నా ఎక్కువ శక్తివంతమైందని చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లగల ఈ క్షిపణికి వాస్తవానికి 8 వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం ఉందని ఓ చైనా పరిశోధకుడు చెప్పడం గమనార్హం. ‘వాస్తవానికి అగ్ని-5 క్షిపణికి 8 వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగల శక్తి ఉంది’ అని చైనాకు చెందిన పిఎల్‌ఏ అకాడమీ ఆఫ్ మిలిటరీ సైనె్సస్‌లో పరిశోధకుడుగా పనిచేస్తున్న డు వెన్‌లాంగ్ ‘గ్లోబల్ టైమ్స్’ పత్రికతో అన్నారు. ఇతర దేశాలకు ఆందోళన కలగకుండా ఉండడం కోసం భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ క్షిపణి సామర్థ్యాన్ని తక్కువ చేసి చెప్తోందని ఆయన అన్నారు. అగ్ని-5 క్షిపణి అయిదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల లాంగ్ రేంజ్ క్షిపణి అని ఈ క్షిపణిని రూపొందించిన డిఆర్‌డిఓ శాస్తజ్ఞ్రులు ప్రకటించడం తెలిసిందే.
ఈ క్షిపణి ప్రయోగంతో భారత్ ఈ సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన చేరింది. కాగా, చైనా స్టాండర్డ్స్ ప్రకారం ఖండాంతర క్షిపణి అంటే కనీసం 8 వేల కిలోమీటర్ల రేంజి ఉన్నదని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఝాంగ్ ఝావోఝోంగ్ అన్నారు. అంతేకాకుండా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా తయారు కావడానికి అగ్ని-5 క్షిపణి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చని కూడా ఆయన చెప్పారు.//


అగ్ని-5 క్షిపణి, చెప్తున్నదానికన్నా ఎక్కువ శక్తివంతమైందని చైనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు(ట). దాని సామర్థ్యం గురించి ప్రచారం చేసుకోవాల్సింది మన దేశమేగానీ, చైనాకెందుకంత ఆసక్తి..?
మొట్టమొదటి కారణం, ముఖ్యమైన కారణం, భారత ఆగ్నేయాస్త్రాన్ని చూసి చైనా నిజంగానే అదిరింది. ఆధునిక యుగంలో భారతదేశానికి చైనా బెదరడం ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బహుశా, చైనా దృష్టిలో భారతదేశం
పాశ్చాత్యుల చేతిలో ఒక పావు, అంతే తప్ప భారతదేశానికి ఒక విధానమంటూ లేదు. సరిగ్గా చెప్పాలంటే పాకిస్తాన్ లాంటి దేశం. భారతదేశాన్ని ఇప్పటివరకూ చాలా దేశాలు ముఖ్యంగా చైనా సీరియస్సుగా తీసుకున్నట్టు కనబడదు. ఇకపైన సీరియస్సుగా భారత్కు వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో తన గళాన్ని విప్పబోతోంది.
రెండవ కారణం ఆసియాకి నేతృత్వం వహించడానికి మరో దేశం సిద్ధమౌతోందేమోనన్న అనుమానం. వియత్నాం, టిబెట్ వంటి ఆసియా దేశాలు/ప్రాంతాలు ఇప్పటికే చైనా వ్యతిరేకత ద్వారా ప్రపంచదేశాల దృష్టిలో ఉన్నాయి. వాటికి దిశానిర్దేశం చేసేవారెవ్వరూ లేరు. 
అగ్ని-5  పరిధి ( DRDO ప్రకటన ప్రకారం)

అదలా ఉంచితే, చైనా శాస్త్రవేత్తల ప్రకటనలోని ముఖ్య ఉద్దేశ్యం, ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశపు "అగ్ని" మీద అనుమానాలనీ, భయాలనీ రేకెత్తించి, ఈ అస్త్రాన్ని సైన్యానికి దక్కనివ్వకుండా చేయడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకి "అగ్ని" ఊతం ఇవ్వబోతోందని చాలామంది భావిస్తున్నారు. అయితే, చైనా చేయబోతున్న ఈ ప్రచారాల వల్ల అవన్నీ బూడిద పోసిన పన్నీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్ "సూర్య" అనే ఖండాంతర క్షిపణి కార్యక్రమాన్ని అత్యంత రహస్యంగా నిర్వహిస్తోందని అన్ని దేశాలూ అనుమానిస్తున్నాయి. వాటికీ చైనా ప్రచారం అదనం. ఇంక మండలి సభ్యత్వానికి ఏ దేశాలు మద్దతునిస్తాయి.?


ఈ సూర్య క్షిపణి కార్యక్రమం 1995 నుండి భారత్లో జోరుగా నిర్వహింబడుతున్నట్టు పలుదేశాల్లో పుకార్లు వ్యాపించి ఉన్నాయి. దాని పరిధి 10,000 కి.మీ నుండి 16,000 కి.మీ వరకూనట. ఈ గాలివార్తలన్నిటినీ రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO) ఖండిస్తూ వస్తోంది. అయినా, ఈ అనుమానాలు తగ్గట్లేదు. వాస్తవానికి ఈ సామర్థ్యం సాధించడం భారత్కు అంత కష్టమేమీ కాదు(ట). కానీ ఆయుధపోటీకి దారి తీసే అవకాశమున్న కారణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.


ఏదియేమైనప్పటికీ, దౌత్య విధానంలో దూకుడును సంతరించుకోవాల్సిన అవసరం, అవకాశం భారతదేశానికి "అగ్ని" కల్పిస్తోంది. ఇంకో విధంగా చెప్పాలంటే "తప్పనిసరి చేసింది".

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

అంతర్జాల భద్రతా ప్రతిజ్ఞ (Internet Safety Pledge)

ఈ మధ్యకాలంలో అంతర్జాలంలోనూ, బ్లాగుల్లోనూ చౌర్యం, అసభ్యత వంటి అనారోగ్యకర విషయాలు ఎక్కువైపోయిన కారణంగా ఈ తరహా ప్రతిజ్ఞ అంతర్జాలికులు చేసుకోవాలని అనిపించింది. ఇండియన్ సేఫ్టీ ప్రొఫెషనల్స్ వెబ్సైటులోని Internet Safety Pledgeకిది తెలుగు నువాదం. తప్పులను సరిదిద్దు పెద్దలు సదా అహ్వానితులు. 


మొదటి స్థాయి:
అంతర్జాల భద్రతా ప్రతిజ్ఞ
  1. అంతర్జాలంలో భయపెట్టే, అసౌకర్యకరమైన, అయోమయానికి గురిచేసే ఏదేని విషయం అగుపిస్తే, తక్షణమే కంప్యూటర్ మానిటర్ ను ఆఫ్ చేసి, పెద్దవారికెవరికైనా చెబుతాను.
  2. అంతర్జాలంలో ఎవరైనా కొత్తవ్యక్తి నా పేరుగానీ, నా చిరునామా గానీ, నా టెలిఫోను నంబరుగానీ, నా స్కూల్ పేరూ, చిరునామా ఇతరత్రా విషయాలు అడిగితే, నా తల్లిదండ్రులు/ సంరక్షకులకు తెలియపరుస్తాను.
  3. అంతర్జాలంలోని ఏ వ్యక్తి అయినా, నన్ను వ్యక్తిగతంగా కలవాలని అడిగిన వెంటనే, నా తల్లిదండ్రులు/ సంరక్షకులకు తెలియజేస్తాను.
  4. అంతర్జాలంలో అసభ్యకరమైన, పరుషమైన మాటలను ఉపయోగించను.


రెండవ స్థాయి:
అంతర్జాల భద్రతా ప్రతిజ్ఞ 
  1. అంతర్జాల వాడకం విషయంలో, నా తల్లిదండ్రులు, సంరక్షకులతో సంప్రదించి కొన్ని నియమాలను ఏర్పరుచుకుంటాము. ఈ నియమాలలో, అంతర్జాలానికి కేటాయించవలసిన రోజువారీ సమయమూ, వ్యవధీ; ఏయే వ్యక్తులతో సంభాషింవచ్చును, నాకు సంబందించిన ఏయే వెబ్సైటులను చూడవచ్చును లాంటి విషయాలకు సంబంధించిన నియమాలను కచ్చితంగా పాటిస్తాను.
  2. భయపెట్టే, అసౌకర్యకరమైన, అయోమయానికి గురిచేసే ఏదేని విషయం అగుపిస్తే, నమ్మదగిన పెద్దవారికెవరికైనా చెబుతాను. నా తల్లిదండ్రుల/సంరక్షకుల అనుమతి లేకుండా ఏ విషయాన్నీ, వస్తువునీ డౌన్ లోడ్ చేయను.
  3. నా వ్యక్తిగత సమాచారాన్ని అంటే నా చిరునామా, నా ఫోను నంబరు, నా తల్లిదండ్రుల/సంరక్షకుల ఫోను నంబరు, ఆఫీసు చిరునామా, నా స్కూల్ చిరునామా మొదలైనవి, నా తల్లిదండ్రుల/ సంరక్షకుల అనుమతి లేకుండా ఎవరితోనూ పంచుకోను.
  4. అసభ్యకరమైన లేదా నాకు అసౌకర్యాన్ని కలిగించే సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వను. అటువంటి సందేశం వచ్చినపుడు పెద్దవారికెవరికైనా తెలియజేస్తాను. అటువంటి సందేశాలను నేను ఎప్పటికీ పంపను.
  5. నా తల్లిదండ్రులు/సంరక్షకులను సంప్రదించకుండా, అంతర్జాలంలో కొత్తగా పరిచయమైన వ్యక్తిని కలవను. నా తల్లిదండ్రులు/ సంరక్షకులు కలవడానికి అనుమతినిస్తే, పబ్లిక్ స్థలాలలో తల్లిదండ్రుల/ సంరక్షకుల తో బాటుగా కలుస్తాను. 


మూడవ స్థాయి:
అంతర్జాల భద్రతా ప్రతిజ్ఞ
  1. నేను అంతర్జాలాన్ని వాడడం ద్వారా నా తల్లిదండ్రులు/సంరక్షకులు నా నుండి ఏమి ఆశిస్తున్నారో, వారి ఆకాంక్షలెట్టివో తెలుసుకుంటాను. అంతర్జాల వాడకం విషయంలో, నా తల్లిదండ్రులు, సంరక్షకులతో సంప్రదించి కొన్ని నియమాలను ఏర్పరుచుకుంటాము. ఈ నియమాలలో, అంతర్జాలానికి కేటాయించవలసిన రోజువారీ సమయమూ, వ్యవధీ; ఏయే వ్యక్తులతో సంభాషింవచ్చును, నాకు సంబందించిన ఏయే వెబ్సైటులను చూడవచ్చును లాంటి విషయాలకు సంబంధించిన నియమాలను కచ్చితంగా పాటిస్తాను. ఈ నియమాలను తప్పడంగానీ, ఇతర వెబ్సైటులును చూడడంగానీ చేయను. అపరిచితులు పంపిన ఏ విషయాన్ని డౌన్ లోడ్ చేయను. ముఖ్యంగా అసభ్యకరమైన విషయాలు, స్పాం, చెత్త ఈ-మెయిళ్ళు నా కంప్యూటరుకు హానికలిగించగలవు కనుక వీటిజోలికి పోను.
  2. నా ఆంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచుతాను.
    నా చిరునామా, నా ఫోను నంబరు, నా తల్లిదండ్రుల/సంరక్షకుల ఫోను నంబరు, ఆఫీసు చిరునామా, నా స్కూల్ చిరునామా మొదలైనవి నా ఆంతరంగిక విషయాలను బయటపెట్టగలవి, నా తల్లిదండ్రుల/ సంరక్షకుల అనుమతి లేకుండా ఎవరితోనూ పంచుకోను. నా స్నేహితులకి, నా కుటుంబానికి చెందిన ఏ వ్యక్తిగత విషయాలనీ ఎవ్వరితోనూ పంచుకోను. నా ఫొటోలనూ, ఇతర విషయాలను నా తల్లిదండ్రులకు/సంరక్షకులకు తెలియకుండా ఎవ్వరికీ పంపను.
  3. అసౌకర్యకరమైనట్టి ఏ అంతర్జాల సంభాషణకీ  నేను స్పందించను.
    భయపెట్టే, అసౌకర్యకరమైన, అయోమయానికి గురిచేసే ఏదేని విషయం అగుపిస్తే, నమ్మదగిన పెద్దవారికెవరికైనా చెబుతాను.అసభ్యకరమైన, అసౌకర్యకరమైన సందేశాలు వచ్చినపుడు పెద్దవారికెవరికైనా తెలియజేస్తాను. అటువంటి సందేశాలను నేను ఎప్పటికీ పంపను.
  4. అంతర్జాలంలో, మొట్టమదటిసారిగా "కలుసుకున్న" ఏ వ్యక్తినీ, నా తల్లిదండ్రుల/సంరక్షకుల అనుమతి లేకుండా వ్యక్తిగతంగా కలవను.
    అంతర్జాలంలో మొట్టమొదటిసారిగా కలిసిన వ్యక్తిని, వ్యక్తిగతంగా కలవడం నా భద్రతకి ప్రధానమైన ఆపద అయ్యే అవకాశం ఉన్న కారణంగా   నా తల్లిదండ్రులు /సంరక్షకులను సంప్రదించకుండా, అంతర్జాలంలో కొత్తగా పరిచయమైన వ్యక్తిని కలవను.
    నా తల్లిదండ్రులు/ సంరక్షకులు కలవడానికి అనుమతినిస్తే, పబ్లిక్ స్థలాలలో తల్లిదండ్రుల/ సంరక్షకుల తో బాటుగా కలుస్తాను.
  5. అంతర్జాలంలో ఇతర వ్యక్తుల హక్కులను గౌరవిస్తాను.
    అంతర్జాలం ఒక పెద్ద సమాజం కనుక, నా నడవడి ఇతరలను ప్రభవితం చేయగలదు. అంతర్జాలంగా నేను ఏవిధమైన గౌరవాన్ని పొందాలనుకుంటున్నానో, అదే విధమైన గౌరవాన్ని ఇతరులకు కూడా ఇస్తాను. కాపీరైట్ చట్టాలను, విషయ వనరులను గౌరవిస్తాను. నివేదికలు రాయు సమయంలో, అంతర్జాల సమాచారపు వనరులు విశ్వసనీయమైవిగా ఉండేలా చూసుకుంటాను మరియు ఆ వనరులను నా నివేదికలో పొందుపరుస్తాను.
    పైరసీ/దొంగతనం అనేది చట్టవ్యతిరేకం. అది రచయితలు, కళాకారులు మొదలైనవారు తమ పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందకుండా అడ్డుపడుతుంది. అందువల్ల జనాలకి ఉచితంగా ఇవ్వని ఏ బొమ్మలనూ, ఆటలనూ, సంగీతాన్ని, సినిమాలనీ డౌన్ లోడ్ చేయను.