27, మార్చి 2012, మంగళవారం

పట్టభద్రుల ముక్కుపిండేస్తున్న సంస్థలు - 1

ఉద్యోగార్థులను కొలువులనిచ్చే సంస్థలు ఎంతలా రాచిరంపాన పెడుతున్నాయో చాలామందికి తెలుసు. అయితే, ఈ “రంపపు కోత”లు సంస్థ సంస్థకీ, అభ్యర్థి అభ్యర్థికీ మారిపోతూ ఉన్నాయి. దాని గురించే ఈ టపా..! మరి “పట్టభద్రులు” అని శీర్షిక ఎందుకు చెప్మా..? అని అనుమానం వచ్చే ఉంటుంది. నేను రాద్దామనుకుంటున్నది ఉద్యోగార్థుల గురించేకాక ఉన్నతవిద్యాభిలాషుల గురించి కూడా. ఉన్నత విద్యని అభ్యసిద్దామనుకుంటున్నవారిని దేశీయ విశ్వవిద్యాలయాలు, అవి నిర్వహించే పరీక్షలు ఎంతగా ఏడిపిస్తున్నాయో(ముఖ్యంగా డబ్బు విషయంలో) రాయాలనిపించింది. ఎప్పట్నుంచో రాద్దామనుకుంటూ ఉన్న ఈ ఆలోచనకి ఇప్పుడు అక్షరరూపం వస్తోంది. ముందుగా ఉద్యోగార్థుల గురించి చర్చిద్దాం. 

ఉద్యోగార్థులు:
మరీ జనరలైజ్ చేసి చెప్పేకన్నా ఉదాహరణలు చూపిస్తే బావుంటుందని అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఉద్యోగ ప్రకటనలు చూద్దాం.
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సుమారు 345 కొలువులివ్వడానికి ప్రకటన ఇచ్చింది. దాని లంకె ఇది.
దరఖాస్తు రుసుం వివరాలు.

పరీక్షా కేంద్రాలు (మన రాష్ట్రం ): హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ.
సెంట్రల్ మానుఫేక్చరింగ్ టూల్ ఇన్స్టిట్యూట్
సెంట్రల్ మానుఫేక్చరింగ్ టూల్ ఇన్స్టిట్యూట్,  అప్రెంటిస్ ఆఫీసర్లకోసంఇచ్చిన ప్రకటన ఇది.
సాధారణ అభ్యర్థులకు రుసుం 300; ఎస్సీ,ఎస్టీలకు150.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేంకింగ్ పర్సనల్ సెలక్షన్
సుమారు 19 బేంకులలో కొలువులకోసం పరీక్షలు నిర్వహించే “ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేంకింగ్ పర్సనల్ సెలక్షన్” ఇటీవల ఇచ్చిన ప్రకటన ఇది.
దరఖాస్తు రుసుం: సాధారణ అభ్యర్థులు 450/-, ఎస్సీ,ఎస్టీలు 50/-
పరీక్షా కేంద్రాలు (మన రాష్ట్రం ): హైదరాబాద్ 

ఈ మూడు ప్రకటనలు మచ్చుకి ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలలో  ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పక్కకిపెట్టేసినా, ఈ తరహా విభజన దానితోనే ఉండిపోలేదు. ఎస్సీ,ఎస్టీలకి ఫీజులు తగ్గించి, అదంతా సాధారణ అభ్యర్థుల నెత్తిమీద రుద్దడం లాంటివి సర్వసాధారణం. అన్ని ఉద్యోగ  పరీక్షలలోనూ ఇదే తంతు. ఈ తంతు ముందునుండీ ఉందో లేదోనని నేను  చూడలేదు కానీ ఉండే ఉంటుందని అనుకుంటున్నాను.  

ప్రతీ సంస్థా ప్రకటన ఇచ్చేయడం దానికి 500, 1000 రూ. వరకూ దరఖాస్తు రుసుంలు పెట్టేయడమూను. అభ్యర్థికయ్యే ఖర్చు దానితోనే పోదు, ఇతరత్రా ఖర్చులు చాలానే ఉంటాయి. పరీక్షాకేంద్రానికి రానూపోనూ అయ్యే ఖర్చూ; అప్లై చెయ్యడానికి ఇంటర్‌నెట్ ఖర్చూ (అభ్యర్థుల్లో సింహభాగం సైబర్ కేఫ్‌లనుండే అప్లై చేస్తారు. ), అటెస్టేషన్(Attestation)చేయించడం తప్పనిసరిచేస్తే దానికోసం గెజిటెడ్ ఆఫీసర్ల చేతులు తడిపే ఖర్చూ; ఫొటోలు, సంతకాల స్కానింగుల ఖర్చులూ (ఇవి ఎలాగూ తప్పదు. తప్పుపట్టనూ లేము.) ఇలాంటివన్నీ లెక్కేసుకుంటే ఒక్కో పరీక్షకీ ఎంత లేదన్నా 1000 రూపాయల వరకూ మంచినీళ్లలాగా ఖర్చైపోతాయి. అంత ఖర్చుతో ఎన్నిసంస్థలకని దరఖాస్తులు పంపగలరు..?  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంకా చాలా నయం.. ప్రయాణఖర్చులన్నా సంస్థలు భరిస్తాయి. (చాలామందికి పక్కనోడిని చూస్తే ఏడ్వాలనిపిస్తూ ఉంటుంది. నేనూ అంతే..! )

జాతీయస్థాయి పరీక్షల్లో ఎక్కువ శాతానికి మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్టణాలు మాత్రమే పరీక్షా కేంద్రాలుగా ఉంటాయి. కొన్ని సంస్థలకి ఇవి కూడా ఉండవు. రుసుం మాత్రం అదే. పోనీ రాష్ట్ర స్థాయి పరీక్షలేమన్నా  వీలుగా ఉంటాయా అంటే అవీ లేవనే చెప్పుకోవాలి. హైదరాబాదు, విశాఖలకి తోడు విజయవాడ,తిరుపతి,వరంగల్ మాత్రమే అదనంగా ఉంటాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించే పరీక్షలు తక్కువేనని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాల్లో జోనల్ కోటాలు అదనం. కొన్ని జోన్లలో తొక్కిసలాటలూ, మరికొన్ని జోన్లలో ఈగలు తోలుకోవడమూ మామూలు విషయమే. అయితే,వీటికి ప్రాంతీయ నేపథ్యం రావడం వల్ల ఈ విషయం రాజకీయమై కూర్చొంది. కాబట్టి, దాన్ని పక్కనబెడదాం. 

సంస్థలకి,  పరీక్షల నిర్వహణా సమస్యలు ఉండొచ్చుగాక అంతమాత్రానికీ నిరుద్యోగులని డబ్బులపేరుతో ఇబ్బంది పెట్టడం దేనికి.? నిర్వహణ అంత ఇబ్బంది అయినపుడు ప్రత్యేకంగా పరీక్ష పెట్టుకోవడం అంత అవసరమా..?  ఈ మధ్యన బి.హెచ్.ఇ.ఎల్,ఎన్.టి.పి.సి, ఐ.ఓ.సి.ఎల్ వంటి సంస్థలు “గేట్ (GATE)” పరీక్ష ద్వారా కొలువులనివ్వడం మంచి పరిణామం. నిజానికి ఇంజనీరింగ్ పట్టభద్రులకి ఐఐటీలు నిర్వహించే “గేట్”ని మించిన యోగ్యతా పరీక్ష ఏముంటుంది..? “గేట్”కి మల్లే అన్ని రకాల పట్టభద్రులకీ జాతీయ స్థాయి పరీక్ష ఒక్కటే నిర్వహించడం సాధ్యం కాదా..?  

(ఇంకా రాయాల్సి ఉంది.)

14, మార్చి 2012, బుధవారం

శారదాపీఠం, కాశ్మీరం


 ఈ మధ్యకాలంలో అంధ్రభూమిలో వచ్చిన "కాశ్మీరులో భాషల వ్యథలు" వ్యాసం చూడడం జరిగి, వ్యాసవిషయంలోని  "శారదా లిపి" నన్నాకర్షించింది. వెంటనే గూగూల్లో కొట్టడం, వికీపీడియా వ్యాసం కనబడ్డం జరిగి కాపీ,పేస్ట్,ఎడిట్ చేసి తెవికీలోకి ఎక్కించేసాను.

అయితే.. ఈ వికీపీడియా వ్యాసాలు తిన్నగా ఉండవుగా, "ఇవి కూడా చూడండి" అంటూ ఉంటాయిగా..! సర్లే.. అంతగా బ్రతిమాలుతుంటే, మనదేం పోయిందని చూసాను.. అదే.. "శారదా పీఠం" గురించిన వ్యాసం..! అందులోని కొన్ని వాక్యాలివి..

//శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉన్నది.ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు.//

బయటి లింకుల్నించి దాని చిత్రపటాలని పట్టుకొస్తిని..!  మీరూ ఓ సారి చూస్కోండి...!

ఇంత సరదా చెప్పుతున్నావు..అంత బావుంటుందా..? అని మాత్రం అడగొద్దు.. ఎలా రాయాలో అర్థంకాక ఇలా రాస్తూ పోతున్నాను.































విగ్రహం ఏది..??????? (ఈ ఫొటో ఒకసారెప్పుడో "ఈనాడు" పత్రికలో చూసినట్టు గుర్తు.!)

సారీ..! ఫొటోలు చూసి ఎలా రియాక్ట్ కావాలో తెలీక, ఇలా రాసేసుకుంటున్నా.., ఏమనుకోకండి...!

ప్రాచీన కాలంలో, ఈ శారదా పీఠం వద్ద సంస్కృత విశ్వవిద్యాలయం ఉండేది(ట). ఎన్నెన్నో సంస్కృత గ్రంథాలు, పురాణాలు రాయబడ్డాయి(ట).


ఈ సందర్భంగా, కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలనిపిస్తోంది. ఆ మధ్య జమ్మూ మార్కెట్టులో సరుకులు అమ్ముకోడానికి అనుమతి ఇవ్వకపోతే, శ్రీనగర్ వ్యాపారస్థులు ఆందోళన చేసిన విషయం తెలిసే ఉంటుంది. అప్పుడు, వాళ్ళు బెదిరింపులకు కూడా దిగారు ఏంటంటే, "జమ్మూలో కాకపోతే, మేం ముజఫరాబాద్ లో కూడా అమ్ముకోగలం" అని. గొడవ పూర్తిగా జ్ఞాపకం లేదుగానీ చెప్పాల్సిన విషయం వేరేది ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరువారికీ, భారతీయ కాశ్మీరు ముస్లింల మధ్యలో వ్యాపారాలేకాదు, బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ లేనివి కాశ్మీరు పండితులకి మాత్రమే...!

ఈ గుడి సంగతి చూసారుగా...!కాశ్మీరు స్వేచ్ఛ గురించి గొంతు చించుకొని అరిచే మేధావులు(?) ఈ గుడి గురించి మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారో కనుక్కోండి..!


"గుడికెళ్ళి మా కులదేవతని దర్శించుకోనివ్వండి మహాప్రభో...!" అని అరిచి, అరిచి శోషవచ్చి పడిపోతున్న కాశ్మీరీ పండితులని ఎవ్వరూ పట్టించుకోరు.  ఎవ్వరికీ అక్కర్లేదు. ఇంక ఈ రాళ్ళూ, రప్పలూ ఎవడ్డిక్కావాలి..?  
అదండీ, "లౌకిక" భారతదేశపు దౌత్యనీతి..!

మీకింకా ఓపికుంటే, "మీరుగొట్టం" (youtube) నుండి సేకరించిన ఈ వీడియోని తిలకించగలరు. ఎవరో హస్తభూషణం ద్వారా దీన్ని చిత్రీకరించారు.



ఈ లంకెనుండి వెళితే ఇంకొన్ని ఫొటోలు చూడొచ్చు..
(పూర్తి పొటోలు చూడడం నాకైతే సాధ్యం కాలేదు. మీకు కుదురుతుందేమో ప్రయత్నించండి)

----------------------
నాకు ఎమర్జెంటుగా టపా వేసెయ్యాలనిపించి వేసేసాను. రాత నచ్చకపోతే తిట్టుకోవద్దు..!