4, అక్టోబర్ 2011, మంగళవారం

ఆర్య - ద్రవిడ -2 (ఈ కథ ఎందులోదో..?)


నేను కొడుతున్న సుత్తి లోని నిన్నటి భాగం తర్వాత ..!

"యెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింద"నే సామెత మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులకు సరిగ్గా సరిపోతుంది.! అతగాడికి సంస్కృతం నేర్చుకోవాలనీ, భారతదేశం రావాలనీ ఎందుకు బుద్ధిపుట్టిందో తెలీదుగానీ, అందువల్లే ఓ ప్రపంచ యుద్ధం వచ్చింది. భారతదేశంలో "ఆర్యులు- ద్రవిడులు"..అని నిత్యం తన్నుకుంటున్నారు. మాక్స్‌ ముల్లర్‌కి ముందు నుండే మాక్స్‌ ముల్లర్‌ ప్రబుద్ధులు ఉన్నారని ఈ కథద్వారా గ్రహించవచ్చు. (అంతకు ముందువారి పేర్లు తెలీకపోవడంవల్ల మాక్స్‌ముల్లర్‌ ప్రబుద్ధులనే రాస్తున్నాను.). ఈ కథ బైబిల్‌నుండి భవిష్య పురాణంలోకి ఎక్కించేసారని గ్రంధకర్త పూర్తిగా విశ్వసించి వ్యాఖ్యానంగా రాసారు.
//ద్వాపరమున పదునారువేల సంవత్సరములు మిగిలియుండగా భూమండలము బహుకీర్తిమతియై పేరొందెను. కొన్ని దేశములు విప్రులు కొన్ని యెడల క్షత్రియ వంశీయులు, కొన్ని తావుల వైశ్యులు, కొన్ని చోట్ల శూద్రులు, మరికొన్ని మూలల వర్ణసంకరులు రాజులయ్యెదరు. ఎనిమిదివేల యెనుబదినాల్గుసంవత్సరములు ద్వాపరయుగము మిగిలియున్నదనగా మ్లేచ్ఛ దేశమంతయు గీర్తివంతమగును.
                ఇంద్రియములను దమించి, ఆత్మధ్యాన పరాయణుడయునవా డగుటచే "అదాము" అనే పేరు గలవాడొక మ్లేచ్ఛుడుండెను. వాని భార్య "హవ్యవతి"యట. "హవ్వ"అనేదాని కృత్రిమ సంస్కృతరూపమిది. ప్రధాన నగరమునకు దూర్పున గల మహావనము నాల్గు క్రోసులమేర నీశ్వరునిచే నిర్మితమయినది. పెండ్లాము దర్శనము కోరి పాప వృక్ష తలమున నుండెను. "కలి" యటకు సర్పరూపమున వచ్చెను. ఆ ధూర్తునిచే మోసగింపబడి "ఆదాము" విష్ణునాజ్ఞాను భంగపరచెను. ఆ పాపవృక్షఫలము తినవద్దని విష్ణువు శాసించినను అందముగానున్న యా పండును భార్యాభర్తలిద్దరు తినిరి. ఆ మేడియాకులు తిని, వాయువు భక్షణముకూడా చేసిరి. అంత వాండ్రకు కొడుకులు కలిగిరి. అంతా మ్లేచ్ఛులే. ఆదాము తొమ్మిదివందల ముప్పది సంవత్సరములు జీవించెను. ఆ పండ్లను భార్యతో హోమముచేసి స్వర్గమందెను. వానికి బుట్టినవాడు శ్వేతుడు. వాడు తండ్రికంటే మరి పండ్రెండ్రేం డ్లక్కువ బాలించెను. వానికొడుకు "అనువరుడు" వానికంటె నూరేండ్లు తక్కువ జీవించెను. తరువాత కీనాశుడు నంతే జీవించెను. మహల్లలు డైదేండ్లు తక్కువగా తొమ్మిదివందలు జీవించెను. వాడు తనపేర నగరము నిర్మించెను. వాని తరువాత విరదుడు తొమ్మిది వందలరువదియేండ్లు బ్రతికెను. తనపేర నగరము నిర్మించెను. హనూకుడు విష్ణుభక్తి పరుడు. పండ్లను హోమముచేసి తత్త్వమసి జ్ఞానముపొందెను. మూడువందల అరువదియేండ్లు జీవించెను. వాడు మ్లేచ్ఛధర్మ పరాయణుడై స్వర్గమందెనట. ఆచారము, వివేకము, ద్విజత్వము, దేవపూజ అనునవి చేయువాడు కాన "మ్లేచ్ఛుడు" అనుపేరు వచ్చెనని పండితులందురు; విష్ణుభక్తి, అగ్నిభక్తి, అహింస, తపస్సు, దమము అనేవి మ్లేచ్ఛధర్మములని మునులన్నారు. హనూకుని కొడుకు మతోచ్చిలుడు తొమ్మిదివందలడెబ్బడియేండ్లు పాలించెను. వాని కొడుకు న్యూహుడు. విశేషజ్ఞానము "ఊహ" గలవాడని యూ పేరొచ్చినదట. అయిదువందలయేండ్లు పాలించెను. నీముడు, శముడు, భావుడు అనువారు వాని  ముగ్గురు కొడుకులు. న్యూహుడు విష్ణుభక్తుడు."సో హం" ధ్యానపరాయణుడు. ఒకనాడు విష్ణుభగవానుడు వాని కలలో కనిపించి "వత్స! నేటి కేడవరోజు ప్రళయము వచ్చును. నీవు నీజనులతో నావయెక్కి! బ్రతుకుము, సర్వశ్రేష్ఠుడ వయ్యెదవు"అనెనట. మూడు వందల హస్తములు పొడవు నేబది హస్తములు వెడలుపు; ముప్పది హస్తముల యెత్తుహల నావ నెక్కెను. నల్బది రోజులు సాంవర్తక (ప్రళయ) మేఘములు సర్వభారత వర్షమును నీట ముంచెత్తును. అపుడు న్యూహుడు నెనుబదివేలమంది మునులు విశాలానగరమునకు వచ్చి జీవించిరి. మిగిలిన జీవకోటి నశించెను. అప్పుడు విష్ణుమాయను వారు నుతించిరి. అపుడు మరల నేల బయలుపడెను. శిషిణములనెడి హిమాద్రి ప్రదేశముల దగ్గర నావనెక్కి జల ప్రళయమయిన తరువాత నచట నివాసం చేసికొనెను. న్యూహునికి విష్ణువు దయచూపి వంశవృద్ధి చేసెను. దేవభాషకు వ్యతిరేకముగా మ్లేచ్ఛభాష వృద్ధిచేసెను. న్యూహుని కొడుకులు సిముడు, హాముడు, యాకూత్‌ అనే ముగ్గురు. యాకూత్తుకు జు మ్రుడు, మాజాజ్‌, మాదీ, యానానుడు, తూవలుడు, మసకుడు, తీరసుడు, అనే కొడుకులేడుగురు పుట్టిరి. వాళ్ల పేర్లతో దేశము లేర్పడెను. .......................... కలిలో నీ మ్లేచ్ఛులు వృద్ధి పొందిరి.//

                "ఆదాము".."హవ్వ"..అంటే "ఆడం", "ఈవ్‌"..అని తేలిగ్గానే అర్థమైపోతోంది. అబ్రహామిక (abrahamic religions) మతస్థుల గ్రంథాలలోని కథనే ఇక్కడ ఎక్కించారని తెలిసిపోతూనే ఉంది. కాదని ఎవరైనా అంటే నాదొక ప్రశ్న.. "మ్లేచ్ఛుల వృద్ధ"నగానే ఈ కథనే ఎందుకు రాసారని..? భాగవతం, మను స్మృతి ప్రకారం, మ్లేచ్ఛులంటే యవనులూ, శకులూ, గురుండులే కాక, పల్లవులూ, ద్రవిడులూ, ఓఢ్రులు, కిరాతులు, .ఇలా చాలా దగ్గర వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లందరూ భారతదేశంలో ఉంటూనే ఉన్నారుగా..! మరి మ్లేచ్ఛ వృద్ధికి వీళ్ల కథలేమీ లేకుండా, ఎక్కడో ఉన్న గురుండుల కథనే తీసుకోవడం ఏంటి..? (దీని గురించి తర్వాత పూర్తిగా మాట్లాడుకుందాం..!)

ఓసారి. భవిష్యపురాణంలోని "ఈశపుత్రుడు".. "మహామదుడు"... ప్రస్తావన కూడా పరిశీలిద్దాం..
                శాలివాహనుడు హిమాలయ ప్రాంతంలో ఉండగా ఓ వ్యక్తిని చూసి పలకరించగా..ఆ వ్యక్తి తాను ఈశపుత్రుడననీ, కుమారిగర్భమున జన్మించాననీ, జనులు తనను "మసీహుడ"న పేర అవతరించినాననీ, మ్లేచ్ఛధర్మ  పరివర్తకుడనీ చెప్పాడట..! ఇంకా ఈశపుత్ర మతస్థులు సూర్యభక్తులనీ, సత్యసంధులనీ, చాలా చాలా ఉన్నాయి...
అదే మహామద మతస్థుల గురించి పరిశీలిస్తే..
                భోజుడు భారతదేశానికి తిరిగి వస్తూండగా మహామదుడు వెంబడించి, మాటలు కలిపాడట..! మహారాజుని మోహపెట్టబోగా, కాళిదాసు ఆగ్రహించి, నవాక్షరీ మంత్రం జపించి హోమము చేయగానే, ఆ "మహామదుడు" భస్మమై అతని శిష్యులకు దేవుడైపోయాడట..! ఆ తర్వాత ప్రేతరూపంలో మహారాజు దగ్గరకు వచ్చి, తానొక మతాన్ని స్థాపించబోతున్నాననీ, ఆ మతస్థుల లక్షణాలను చెప్పుకున్నాడు. ఆర్యులు ధర్భలచేత సంస్కారం చేసికొన్నట్లే, ఆ మతస్థులు "ముసలం"చేత సంస్కారాలు చేసుకుంటారట..! అందువల్ల వారు "ముసలవంతుల"ని పిలవబడతారట..!
                అలాగే బ్రిటీషు వారు ముందు బౌద్ధధర్మబద్ధులై ఉండి, తర్వాత ఈశపుత్రమతస్థులయ్యారట..! వీరేమో మరి సత్యసంధులూ, సూర్యభక్తి పరాయణులూ..ఇలా చాలానే ఉన్నాయి.!
                ఇవన్నీ చూస్తే, అందరికీ టక్కున అర్థమయ్యే విషయం ఏంటంటే, "బ్రిటీషు వాళ్లు తమ పైత్యాన్ని ఇందులోకి ఎక్కించారు"..అని..! ముస్లింలకి, క్రైస్తవులకి, యూదులకి ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. క్రూసేడ్లూ జరుగుతున్నాయి. జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ ఇందులో ఇరికించడమే ఇక్కడ నేను చెప్పే బ్రిటీషు వాళ్ళ పైత్యం (లేదా మాక్స్‌ ముల్లర్‌ తదితర ప్రబుద్ధుల పైత్యం). అసలు "భవిష్య పురాణ" మూల గ్రంధమే భారతదేశంలో లేదని బ్లాగుల్లో ఎక్కడో చదివాను.  అటువంటప్పుడు దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకోగలం..? మాక్స్‌ముల్లర్‌ రాసిన "ఆర్యుల దండయాత్రా సిద్ధాంతం" లేదా  "ఆర్యుల వలస సిద్ధాంతం"...లోని ప్రధాన విషయం..!
                "మధ్య ఆసియా ప్రాంతంనుండి ఆర్యులు అనబడే తెగవాళ్ళు, భారతదేశంపైకి దండెత్తి అక్కడి స్థానికులను ఓడించి, వారిని దస్యులుగానూ (చిన్నప్పటి సోషల్‌ బుక్‌లో దస్యులు లేదా దాసులు అని రాసి ఉంది..!) పిలిచారు"..అనే కదా..! "బల ప్రయోగ సిద్ధాంతం"..అంటే పడి చచ్చే కమ్యూనిస్టులు దీన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్నారు. అదంతా వేరే విషయం..! కొంతమంది ఆ దస్యులు/దాసులనే ద్రవిడులని పిలిచేసారు.. అంటే, ద్రవిడులు స్థానికులనేగా వాళ్ల అభిప్రాయం..?
                సరే, ఇంతకీ ద్రవిడులు స్థానికులేనా..? ఇది నా ప్రశ్న..!
(ఇంకా వుందీ సుత్తి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి