16, డిసెంబర్ 2011, శుక్రవారం

ఇంద్ర ప్రస్థం - కొన్ని సంగతులు




మహాభారత కాలం నుండీ భారతదేశానికీ, దేశ ప్రజలకు "" "మనది" అనిపించుకునే అతి కొద్ది నగరాలలో ఢిల్లీ ఒకటి.. గత ఐదువేల సంవత్సరాలుగా (మధ్య మధ్యలో విరామాలను వదిలేస్తే) భారతీయులకి సిసలైన రాజధానీ నగరం నేటి కొత్త ఢిల్లీ.. అదే ఒకప్పటి ఇంద్ర ప్రస్థం..

కొత్త రాజధాని నిర్మాణానికి ఇంగ్లాండు రాజ దంపతులు శంకుస్థాపన చేసి, నిన్నటికి సరిగ్గా వందేళ్లు గడిచింది..!

ఢిల్లీ నగరం భారతదేశ రాజధానిగా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా, నగరానికి సంబంధించిన (కొన్ని) విషయాల సేకరణే ఈ టపా..!

1) "ఢిల్లీ" అనే పేరు గురించి చెప్పుకోవాలంటే, భవిష్య పురాణంలోని కథని ని చెప్పకతప్పదు. ఇంద్ర ప్రస్థ పాలకుడైన పృథ్వీ రాజు., చతుర్వర్ణ నివాసమైన కోటనొకదాన్ని నిర్మించి, దానికి "దేహలి (హిందీలో గుమ్మం)" ఏర్పాటు చేసాడట..! ఈ "దేహలీ" శుభసూచకంగా అనిపించి ఆ ఊరికి "దేహలి" అని పేరు పెట్టాడట. అదే కాలక్రమాన "దిల్లీ" గా మారింది. పృథ్వీ రాజ్‌ చౌహాన్‌ నిర్మించిన "దేహలీ" పురం నేటి "పురానా ఖిలా" ప్రాంతం అంటారు. అంటే పాత ఢిల్లీ. ఒకప్పటి ఇంద్రప్రస్థం శిథిలమైపోగా అదే ప్రదేశంలో బ్రిటీషువారు నిర్మించిన నగరం నేటి కొత్త ఢిల్లీ..అదే మన రాజధానీ నగరం..

2) దేహలీ, ఇంద్రప్రస్థం నిజానికి వేర్వేరు ఊళ్లు... మద్రాసపట్టణం - చెన్నపట్టణం, హైదరాబాదు-సికిందరాబాదు లాగే జంట నగరాలు (మా కాకినాడ కూడా ఒకప్పుడు కాకినాడ- జగన్నాధపురం జంట పట్టణాలుగా ఉండేదట..!). అవి రెండూ కలిసి పోయాయి. ప్రస్తుతం రాష్ట్రపతి భవనం ఉన్న ప్రాంతమే ఒకప్పటి ఇంద్రప్రస్థమని స్థానిక ప్రజల నమ్మకం. మంచిదే కదా..!.

3) కొంతమంది అంటూ ఉంటారు. ఢిల్లీ ఒకప్పటి హస్తినాపురమని..! కానీ అది తప్పు.....హస్తినాపురం, ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ జిల్లాలో ఉంది, ఢిల్లీ నుండి సుమారు 70 కి.మీ దూరంలో. అయితే తప్పులో ఒప్పు ఏంటంటే. ఈ గ్రామం "జాతీయ రాజధాని ప్రాంతం(National Capital Region - NCR)"లోకే వస్తుంది. అందువలన మన రాజధాని "హస్తిన" అనడం అంత పెద్ద తప్పేమీ కాదేమో..! రాయబార సమయంలో పాండవులు కోరిన ఊర్ల జాబితాలో ఇంద్ర ప్రస్థం కూడా ఉందని మనకు తెలుసు. మిగిలిన నాలుగు ఊళ్లలోని ప్రముఖమైన ఊళ్ళు . పానీపట్‌ (పాండు ప్రస్థం), సోనీపట్‌ (స్వర్ణ ప్రస్థం), వారుణా వతం, కూడా జాతీయ రాజధాని ప్రాంతాని(NCR)కి చేరువలోనో, చేర్చేసో ఉన్నాయి.

4) ఢిల్లీ పరిసర ప్రాంతమైన గురుగావ్‌ (హరియాణ) కురు-పాండవులు ద్రోణుడి వద్ద విద్యాభ్యాసం చేసిన ప్రదేశంగా చెబుతారు. అందుకే గురుగ్రామం, గురుగావ్‌ అయిందట..! మరి శిక్కులకేమన్నా సంబంధం ఉందేమో మరి..! "భారత్‌" అనే మనదేశ నామానికి భారతానికి చాలా సంబంధం ఉందనిపిస్తోంది కదా..!

5)1947 దేశవిభజన సమయంలో ఢిల్లీ జనాభా రెండు రెట్లు పెరిగిందని అంటారు. అప్పటి ఢిల్లీ జనాభా సుమారు 7 లక్షలు వరకూ ఉండగా., 1-2 లక్షల మంది పాకిస్థాన్‌ కి తరలి వెళ్ళిపోగా, కొత్తగా 8 లక్షల మంది పాకిస్థాన్‌ ప్రాంతం నుండి ఢిల్లీలోకి ప్రవేశించారట..! మహాభారత కాలంలో కూడ ద్వారక మునిగిపోతే, పోయినవారు పోగా, మిగిలిన వారికి పాండవులు ఆశ్రయం కల్పించింది కూడా ఇంద్రప్రస్థం లోనే..! పాకిస్థాన్‌ నుండి వచ్చిన హిందువులు కావచ్చు, కాశ్మీరు పండితులు కావచ్చు, తాలిబన్‌ పాలనలో అక్కణ్ణుండి నుండి పారిపోయిన అఫ్ఘన్‌ హిందువులు కావచ్చు, కొంతమంది టిబెటన్లు కావచ్చు... నిరాశ్రయులైన ఎంతోమందికి పునరావాసం కల్పించిన.. కల్పిస్తున్న నగరం., అంతమందినీ తనలో ఇముడ్చుకుంటున్న నగరం మన రాజధాని. ఈ సంప్రదాయాన్ని (మనుషులకే ఉండాలా..?) మహాభారతకాలం నుండీ కొనసాగిస్తోంది ఢిల్లీ...!

6)రాజధానిగా ఢిల్లీ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖా మాంత్రిణి. కుమారి సెల్జా అన్న మాట "ఢిల్లీ చరిత్రలో ఏడు సార్లు నాశనం చేయబడి-మళ్లీ నిర్మింపబడింది. ఇప్పుడున్న ఢిల్లీ ఎనిమిదో సారి నిర్మింపబడిన నగరం". అదేదో ఫీనిక్స్‌ పక్షిలాగ..!

7) నాశనం అనే పదం వింటే, ఎవ్వరికైనా గుర్తు రావల్సింది ఢిల్లీ నగరమే..! 13వ శతాబ్దంలో తైమూర్‌ లంగ్‌ (తిమిర లింగుడు - భవిష్య పురాణం ప్రకారం) ఢిల్లీ మీద చేసిన దండయాత్ర, మానవ చరిత్రలోనే అత్యంత క్రూరమైనది భావించబడుతూ ఉంటుంది. తైమూర్‌ లంగ్‌ అంతలా నాశనం చేసినా ఢిల్లీ మళ్ళీ నిలబడగలిగింది, అంతేగాకుండా రాజ్యభ్రష్టుడై దేశదిమ్మరిలా తిరుగుతున్న అతని మనుమడు బాబర్‌ కి,అతని సైన్యానికీ ఆశ్రయం కల్పించింది. అపకారికి ఉపకారం చేయడం అంటే ఇదే..! అటుపైన వారు చేసిన విధ్వంసం జగమెరిగినదే..!

8) కొత్త ఢిల్లీ రాజధాని అయిన దగ్గర్నుండి భారతీయులు అన్ని రంగాలలోనూ విజృంభించారు. అప్పటి వరకూ లేని స్వాతంత్ర్య కాంక్ష జనంలోకి బాగా వ్యాపించినా, గాంధీ దేశ నాయకుడి గుర్తింపబడినా, రవీంద్రనాధ్‌ టాగూర్‌ ని నోబుల్‌ ప్రైజు సాధించి బోణీ కొట్టినా, అన్నీ కూడా కొత్తఢిల్లీ రాజధాని అయిన తర్వాతే..! (ఇలా మాట్లాడితే పృథ్వీరాజు దేహలీ పురాన్ని నిర్మించడం వల్లనే ఘోరీ మహమ్మద్‌ చేతిలో ఓడిపోయాడేమో అనిపిస్తూ ఉంటుంది. శతాబ్దాల భారతీయ బానిసత్వానికి అదే అరంభం కదా..!). రాజధాని వాస్తు గురించి ఎక్కువగా అలోచించకపోతేనే మంచిదేమో..!




ఇవి, ఢిల్లీ. . దిల్లీ . . . దేహలీ . . . ఇంద్రప్రస్థానికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని సంగతులు....కొన్ని భావాలూ....కొన్ని నమ్మకాలూ..!
.............................
ఢిల్లీ భారతదేశ రాజధానిగా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా..!

4 కామెంట్‌లు:

  1. మన పత్రికలు ఢిల్లీని హస్తిన అని వ్రాస్తుంటాయి.
    మీరు చెప్పినట్టు హస్తినాపురం వేరు ఢిల్లీ వేరు.
    కావాలంటే ఢిల్లీని ఇంద్రప్రస్థం అని వ్రాసుకోవచ్చు.
    అలాగే హిందీలో ఢిల్లీని దిల్లీ అని వ్రాస్తారు.

    రిప్లయితొలగించండి
  2. @బోనగిరిగారూ..!
    దిల్లీ అనేదే సరైనదండీ..! ఇంగ్లీషులో "Delhi" ని చూసి మనం ఢిల్లీ అంటాం గానీ, అది తప్పు..! అదే విధంగా దక్షిణ భారతానికి చెందిన పేర్లను ఇక్కడి హిందీ పత్రికలు తప్పుగా రాస్తాయి..!
    ఉదాహరణకు..
    అసలు పేరు - మనం రాసేవి
    లఖనఊ - లక్నో
    ఇందోర్‌ - ఇండోర్‌
    అడవాణి - అద్వానీ
    శీలా దీక్షిత్‌ - షీలా దీక్షిత్‌ --- ఇవి మనం తప్పుగా రాసేవి..
    ఇంక ఉత్తర భారతీయులు తప్పుగా రాసేవి
    విశాఖపట్టణం - విశాఖాపత్తనం
    తిరువాంగూర్‌( (((------- త్రావణకోర్‌
    నిజానికి ఇలాంటివి చాలానే ఉదహరించవచ్చు..!
    అంతెందుకు..? నా పేరుని కొంతమంది "సర్మ" అని పలుకుతారిక్కడ... ఇక్కడ "Sharma"ని అని రాస్తే తెలుగువాళ్ళం "Sarma" అని రాసుకుంటాం..!
    అనుసంధాన భాషగా సంస్కృతం బదులు ఇంగ్లీషుని పెట్టుకోవడం వచ్చిన ఇబ్బందులివి..!
    నా టపాని సందర్శించినందుకు ధన్యవాదాలు..!

    రిప్లయితొలగించండి
  3. చాలా విషయాలు తెలిపారు. సంతోషం.
    ధన్యవాదాలు.
    ఈ ఒక్కటీ ఇబ్బందిగా ఉంది.
    "మహాభారత కాలం నుండీ భారతదేశానికీ, దేశ ప్రజలకు "మనది" అనిపించుకునే అతి కొద్ది నగరాలలో ఢిల్లీ ఒకటి.."
    మన ఊళ్ళన్నీ మనవి కావా ఏమిటి. "అతి పాత" అని మారుద్దురూ!

    రిప్లయితొలగించండి
  4. చాలా మంచి సమాచారాన్ని అందించారు. చాలా బాగుందండి.

    రిప్లయితొలగించండి