10, డిసెంబర్ 2011, శనివారం

అట్లు వేయడం ఎలా..?


"వంట-వైరు" కార్యక్రమాని (టపా)కి స్వాగతం..!
అట్లు వేయడానికి ముఖ్యంగా కావలసింది..! అట్ల పిండీ, నూనె, అట్లకాడ, పెనం ...ఇవేవీ కావు.... ముందుగా కావల్సింది..సారీ..కావలసినవాడు ఎలక్ట్రీషియన్‌..!
ఎందుకంటే స్టవ్‌ అనేది చాలా నాజూకైనది.. పైగా వాడి చాలా కాలం అయివుంటుంది. అందువల్ల ముందుగానే, పక్కనే ఓ నాలుగైదు "వైరు" ముక్కలు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి కనక్షన్‌ పెట్టడం వచ్చినట్టైతే ఎలక్ట్రీషియన్‌ అవసరం లేనే లేదు.

ఇంక.....అట్లు వేయాలన్న ఆలోచన రాగానే అందరూ చేయవలసిన పనులు..
1)ముందు... అట్లు తిందామనుకున్నవారందరూ రెండు జట్లుగా విడిపోయి, ఒక జట్టు "సూపర్‌ మార్కెట్‌"కి వెళ్లి "రెడీమేడ్‌" అట్లపిండి కొనుక్కురావాలి, అదే సమయంలో రెండో జట్టు హాస్టల్‌లో తెలిసున్నవాళ్ల దగ్గర నుండి విద్యుత్‌ పొయ్యి(), గిన్నెలూ, అట్లకాడ-పెనం, ఇత్యాది వస్తువులు తెచ్చుకోవాలి. ఇక్కడ జాగ్రత్త వహించవలసిన విషయాలు చాలా ఉన్నాయి.. తెచ్చేటప్పుడు మనం ఏం చేసుకుందామనుకుంటున్నామో దాచడానికి ప్రయత్నించాలి. లేకపోతే వారు మనకి పోటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ గిన్నెలు ఆమావాస్యకోసారి, పున్నమికోసారి వాడే వస్తువులు కాబట్టి బూజు పట్టేసి ఉంటాయి. వాటిని కడుక్కోవాల్సి ఉంటుంది. అందుకోసం "సర్ఫ్‌" ఇంకొకరి దగ్గర్నుండి అరువు తెచ్చుకోవాలి..
2) ఇప్పుడు రెండు జట్లూ ఒక్క చోట కలిసుకోవాలి (రహస్య ప్రదేశమైతే చాలా మంచిది).. అట్లు చేసుకుని తినేంతసేపూ తలుపు మూసేసి ఉంచాలి.. వాసన బయటికి వెళ్తే ఇంకో ప్రమాదం.. చుట్టుపక్కల వాళ్లతో బాటు హాస్టల్‌ ఆస్థాన "కుక్కలు" కూడా పోటీకొచ్చే అవకాశం ఉంది.
3) ఇంక పిండి కలపడం విషయానికొస్తే కొత్తగా, ప్రత్యేకంగా చెప్పుకోడానికి ఏమీ ఉండదు. "రెడీమేడ్‌" అట్లపిండి కవర్‌ మీద ఉన్న "సూచన"లు, హిందీలోగానీ, ఆంగ్ల, కన్నడ, తమిళభాషల్లో చదువుకొని తయారు చేసుకోవాలి. ఈ విషయంలో భారమంతా  ఒకడి మీదే ఉంచాల్సిన అవసరముంది. ఎందుకంటే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పే అవకాశం, ప్రమాదం ఉంటుంది. అందరి సూచనలూ పాటించడానికి మనదగ్గర ఉండే "అట్ల పిండి" సరిపోదు.
4) పిండి కలపడం అయిన తర్వాత వంతుల వారిగా ఒకరి తర్వాత ఒకరు పెనం ముందు కూర్చొని గరిటె తిప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది స్టవ్‌(పొయ్యి) వెలిగించడం(ఆన్‌ చేయడం). నాలుగింట మూడొంతులు ఆన్‌ చెయ్యగానే స్టవ్‌ ఆన్‌ కాదు...! మధ్య మధ్యలో కనెక్షన్లు కాలిపోతూ కూడా ఉండవచ్చు..! అందుకే మనం ముందుగా వైరు ముక్కలు పక్కన పెట్టుకున్నాం..! కనెక్షన్లు సరిచేయడానికి ఎలక్ట్రీషియన్‌ అవసరం ఇక్కడ ఉంటుంది.(మన జట్టులో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ ఉంటే చాలా మంచిది..!)..ఒక్కొక్క అట్టుకీ ఒక్కొక్క వైరు చొప్పున అవసరమవ్వవచ్చు..! కాబట్టి ముందుగానే అన్ని వైర్లనూ సిద్ధం చేసుకోవాలి..
5) అట్లు పాములాగ సన్నగా వచ్చినా.., ఫిలిప్పైన్స్‌, జపాన్‌ దీవుల్లాగ ముక్కలు ముక్కలుగా వచ్చినా, ఉండలు కట్టేసినా ఏ మాత్రం నిరుత్సాహ పడకూడదు. అదే విధంగా నూనెపాళ్ళలో ఎక్కువతక్కువలొచ్చినా, అట్టు సరిగా కాలకపోయినా.. "అట్ల పిండి" బాగానే ఉంటుంది కాబట్టి., అలాగే తినెయ్యవచ్చు..! (రిజల్ట్సు మాత్రం మరిసటిరోజే..!)
6) ఈ విధంగా హాస్టల్‌లో అట్లు వేసుకొని తినాలి
'వంటా-వైరు' టపాలోని "అట్లు తయారు చేసే పదార్థాలు" మరొక్కసారి...!
గిన్నెలు --- దుమ్మూ, ధూళీలేనివి--ఒకటి
స్టవ్‌-----ఒక్కటి
ఎలక్ట్రీషియన్‌---- ఒకరు లేదా అంతకన్నా ఎక్కువమంది
అట్లపిండి---రెడీమేడ్‌
నూనె---కావల్సినంత
ఎలక్ట్రికల్‌ వైర్లు---వేయదలుచుకున్న అట్ల కన్నా రెండు ఎక్కువ
అట్లకాడ- పెనం--- ఒక్క జత చాలు..!
ముఖ్య గమనిక: ఈ మొత్తం కార్యక్రమానికీ అన్నింటి కన్నా ముఖ్యంగా  కావలసింది... కరెంట్‌..!

సందేహాలుకై సంప్రదించగలరు...!
...................................................................
హాస్టల్‌లో మొట్టమొదటిసారి అట్లు వేసిన సందర్భంగా..! (ఈ రోజు చంద్రగ్రహణం కొసమెరుపు)

2 కామెంట్‌లు:

  1. హహహ అద్భుతం. మీ వంట వైరు కార్యక్రమం ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందో కాస్త చెప్తారా? మేము నేర్చుకుంటాం;)

    రిప్లయితొలగించండి
  2. శ్రావ్య గారూ... నమస్తే..!

    రసజ్ఞగారూ..నమస్తే..! "వంట-వైరూ" కార్యక్రమం అస్తమాటూ వచ్చేస్తే, దానికి బ్లాగులోకొచ్చేంత విలువ ఉండదేమోననుకుంటున్నా. పైగా ఈ అనుభవాలు చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.. వచ్చినపుడు మళ్ళీ రాస్తాలెండి..

    రిప్లయితొలగించండి