16, నవంబర్ 2011, బుధవారం

సెవెన్త్‌ సెన్స్‌ సినిమా చూసిన తర్వాత, నాకొచ్చిన సందేహాలు



            సిక్స్త్‌ సెన్స్‌ అనేదాన్నే చాలామంది ఒప్పుకోనప్పుడు ఈ సెవెన్త్‌ సెన్స్‌ ఎక్కణ్ణుంచి వస్తుందిరా అనుకుంటూ మొదలెట్టాను సినిమా చూడ్డం. కొంతసేపటికే అర్థమైపోయింది మురుగదాస్‌  ఏడో జ్ఞానంగా దేన్ని అనుకుంటున్నాడో..! "జెనిటిక్‌ మెమొరీ"నే అతగాడు సెవెన్త్‌  సెన్స్‌ అన్నాడన్నమాట..!
                 బోదిదమ్మ(ఇక్కడింకో సందేహం..!) వంశస్తుడైన హీరోగారు చివర్లో బోదిదమ్మగా మారిపోతాడు.( ఈ సినిమా కథ ఒక్క వాక్యంలో..!) ఈ లెక్కన గోత్రాలను బట్టి ఎవరైనా వసిస్ఠుడుగానో, విశ్వామిత్రుడిగానో, కశ్యపుడిగానో మారిపోవచ్చన్నమాట..! (అందరూ వారివారి గోత్రనామాలనొకసారి స్మరించుకోండి...ఊరికే...సరదాకి.!)  హీరోయిన్‌ చేసిన రీసెర్చికీ "క్లోనింగ్‌"కీ పోలికలున్నట్టుగా అనిపించింది. క్లోనింగ్‌లో కొత్తగా జీవిని జన్మింపజేస్తారు. ఇందులో హీరోయిన్‌ అల్రెడీ ఉన్నవాణ్ని పూర్తి "బోది దమ్మ"గా మార్చింది. ఫండమెంటల్‌ తేడా తెలుస్తూ ఉన్నా, క్లారిటీ మాత్రం రాలేదు. ఒకే జన్యులక్షణాలతో పుట్టిన కవలలు కూడా ఒకే విధంగా బిహేవ్‌ చేయవలసిన అవసరం లేనపుడు, ఎప్పుడో 1600 సంవత్సరాల కిందటి వ్యక్తితో జన్యు సారూప్యత కలిగిన వ్యక్తి, పాతవ్యక్తి లక్షణాలూ, శక్తులూ వచ్చేస్తాయనుకోవడం.., అస్సలు బాగోలేదు. అదంతా మనకెందుకులెండి.., రివ్యూవర్స్‌ ఉన్నారుగా వాళ్లపని అది..

                తమిళంలోని బోదిదమ్మ పాత్రకి  తెలుగులో బోధిధర్మ అని పెట్టి వదిలేసారుగా (ఇందాకటి బ్రాకెట్లోని సందేహం)..! అంటే, వాడి ఉద్దేశ్యం తెలుగువాళ్ళకి "బోది దమ్మ"అంటే అర్థం కాదనా..? లేక వేరే పైత్యపు ఉద్దేశ్యం ఏమైనా ఉందా.? తెలుగువాళ్లకి "బోది దమ్మ"అంటే అర్థం కాదనుకుంటే చాలా పొరబాటు., "దమ్మపదం (ధర్మపథం)" సాహిత్యాల్లో చాలామంది కొట్టినపిండే..! "బోది దమ్మ" అనేది "బోధి ధర్మ"కి వికృతి అని స్కూల్‌ పిల్లాడుకూడా చెప్పగలిగే విషయం. మరి తెలుగులో "బోధి ధర్మ"అని పాత్రనామం ఇవ్వాల్సిన అవసరమేంటో నాకర్థం కాలేదు. పైగా బౌద్ధం తమిళనాట కన్నా, తెలుగునాటే ఎక్కువ ప్రాచుర్యం పొందిందనుకుంటాను కూడా..! నా ఉద్దేశ్యం (అనుమానం) ఏంటంటే, ఆ చిత్రంద్వారా దర్శకుడు "తెలుగువారి చరిత్ర"ని హైజాక్‌ చేసాడని..! పోనీ... ఇవన్నీ దిక్కుమాలిన సందేహాలు అనుకుందాం..! అసలైన సందేహం ఇంకోటుంది
              సినిమాకి విడుదల అవ్వడానికి ముందు దర్శకుడు చెప్పిన విషయం "ప్రతీ తమిళుడు గర్వించే విధంగా ఉండే సినిమా ఇద"ని.. అంటే అతని ఉద్దేశ్యం, అప్పటి తమిళుల చరిత్ర చూపిద్దామన్నట్లైతే ఫర్వాలేదు. మరి లింక్‌ చేసింది ఎవరితోనయ్యా అంటే, పల్లవులతో..! అక్కడ మొదలైంది నా సందేహం, అసలు పల్లవులు తెలుగువాళ్ళా లేక తమిళులా అని..! చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం చదువుకున్నపుడుకూడా పల్లవులు తెలుగువాళ్లని, వారి రాజధాని కాంచీపురమనీ, చదువుకున్నాం..! అలాగే మహాబలిపురంలోని రాతికట్టడాలపై తెలుగుశాసనాలుంటాయనీ విన్నాను. విశాఖపట్టణాన్ని నిర్మించింది కూడా పల్లవరాజేననీ, సింహాచలం ఆలయాన్ని నిర్మించిందీ వారేననీ విన్నాను. హఠాత్తుగా, పల్లవులు తమిళులెలా అయిపోయారో నాకస్సలు అంతుబట్టడంలేదు..! ఎవ్వరికైనా దీని గురించి తెలిస్తే కొద్దిగా నన్ను ఎడ్యుకేట్‌ చేయగలరు..

                   సెవెన్త్‌ సెన్స్‌ గురించి మాట్లాడగానే నా మనస్సు ఎందుకో మా ఇంట్లోని యాకోవ్  పెరెల్మాన్ "నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం" పుస్తకంపైకి పోతోంది. అందులో నాలుగో మితి(4th dimension) గురించి మాంచి డిస్కషన్‌ ఉంటుందిలెండి. "నాలుగో మితి" అంటే అర్థం కాలేదా..? వివరంగా చెప్పాలంటేదీని గురించి ప్రత్యేకటపా వేస్కోవాలి.  అందువల్ల చిన్నగా రాసేస్తాను. మనమున్న ప్రపంచం "త్రిమితీయ ప్రపంచం" (3 D world)..... అంటే పొడవు”, “వెడల్పు”, “ఎత్తు ఉంటాయి  ఏ వస్తువుకైనా..! 2D ప్రపంచాలూ, 1D ప్రపంచాలూ కూడా ఉన్నాయంటాడు ఆ పుస్తక రచయిత. ఉదాహరణకు, మన నీడ తీసుకున్నారనుకోండి, దానికి పై మూడిట్లో రెండు మాత్రమే ఉంటాయి. అంటే.. 2D ప్రపంచం అన్నమాట.! "నాలుగో మితి"ని కనుక్కుంటే ఎన్ని లాభాలుంటాయో కూడా వివరిస్తాడు ఆ పుస్తకంలో. ఐన్‌స్టీన్‌ అయితే నాలుగో మితి "కాలమే" అంటాడు. కాదనేవాళ్ళూ చాలా మంది ఉన్నారు. అందులో నేనూ ఒకణ్ని..! అదీ "నాలుగో మితి" గురించి చిన్న వివరణ.!

నా సందేహాల్ని తీర్చమని కోరుతున్నాను..! 

4 కామెంట్‌లు:

  1. తెలియని విషయాల గురుంచి పట్టించుకుంటే ఇలాగే అవుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా చరిత్ర గురంచి ఎందుకంటే చరిత్ర అబద్దం నచ్చినది మాత్రమే, అందునా వాళ్ళు(చరిత్ర చెప్పిన) గొప్పవాళ్ళు అని నిరూపించడానికే ఉంటుంది. ఇంకో విషయం ఇప్పుడు ఉపయోగిస్తున్న Carbon dating ప్రక్రియ మన దేశంలో పనికి రాదు, అందువల్ల సఖం పూర్వం తప్పుగా వస్తున్నాయి.
    ఎక్కువ తెలుసుకోకండి చరిత్ర ఒక అబద్దాల పుట్ట.

    రిప్లయితొలగించండి
  2. మీరీ సినిమాని అంత సీరియస్‌గా ఎందుకు చూశారో నాకస్సలు అర్ధంకావటంలేదు. మనకెవ్వరికీ DNAఅంటే ఏంటో కూడా తెలీదని ఊహించేసుకొని వాళ్ళనోటికొచ్చింది పలికించారు. వాళ్ళుచెప్పేది అర్ధంకాకపోయినంతమాత్రాన వాళ్ళను మేధావులనేసుంటారన్న పిచ్చి అభిప్రాయంతో సైన్సుకు సంబంధించిన అవాకులూ,చవాకులూ ప్రేలారు.

    ఇక Fourth dimension దగ్గరికొస్తే, మీరు మాట్లాడుతున్నది fourth spatial dimension గురించి. ప్రస్తుతం fourth dimension అంటే అది కాలం (ఐన్స్టైన్ దయవల్ల). కాబట్టి మీరుమాట్లాడుతున్న "fourth dimension" has been renamed to fifth dimension. And one more the universe either 10 dimensional or 26 dimensional -at least mathematically (- by virtue of modular function for which the credit goes to Srinivasa Ramanujam)

    రిప్లయితొలగించండి
  3. మెమెంటో, పే ఇట్ ఫార్వర్డ్ వంటి ఆలీవుడ్డు సినిమాలు చూడకుండా తెచ్చుకున్న సొంత అవిడియాలతో దక్షిణ భారతీయులు గర్వించే సినిమాలు తీసిపెట్టే సృజనశీలి మురుగదాసుడి కథల గురించి శల్యపరీక్షా. హన్నా!

    రిప్లయితొలగించండి
  4. @ ప్రసాదుగారు..
    చరిత్ర అడగక్కూడదన్నమాట..!

    @ అబ్రకదబ్రగారు..
    hahaha..

    @ ఇండియన్‌ మినర్వాగారూ..!
    ఇంగ్లీషు సినిమాలు చూసీ, చూసీ సీరియస్‌నెస్‌ ఎక్కువై ఉన్న పొజిషన్‌ లో అంతే సీరియస్‌ నెస్‌(మాటవరసకి) ఉందనుకున్న సినిమా చూసానన్నమాట..! ఇప్పుడర్థమైంది మురుగదాస్‌ కి అడ్డంగా బుక్కైపోయానని..!

    నేను మాట్లాడే "నాలుగో మితి" spatial dimensionయే..! మనముంటున్న ప్రపంచం, అంటే విశ్వం మొత్తం (3d)యే., అందువల్ల (4d) గురించి ఊహించడం చాలా కష్టం, (చాలా ఈజీ కూడా). నాకు క్లారిటీ లేక ఏదేదో రాసేసాను.
    పోతే..,"credit goes to Srinivasa Ramanujam" అన్నారు.. ఏ విధంగానో చెప్పగలరు...

    రిప్లయితొలగించండి