30, ఆగస్టు 2011, మంగళవారం

కాలెండర్‌- సంస్కృత, భారతీయ మూలాలు

సురేష్‌గారి పాత బ్లాగుల్లో ఎక్కడో ఆయన "hour"...అనే ఇంగ్లీషు పదానికి మూలం సంస్కృత పదమైన "హోర.."..అని చెప్పగానే.., నాక్కూడా ఇలాంటి పోస్టొకటి రాయలనిపించింది... భారతీయులు ప్రపంచానికందించిన వాటిల్లో గణితం, "0"...లే కాకుండా.., కాలగణన కూడా ఉందని నా అభిప్రాయం. అందుకు సంబంధించిన విషయాలు నేను కుముదం భక్తి పుస్తకంలోనో, ఋషి పీఠం పుస్తకంలోనో చదివినట్టు గుర్తు... వాటినే రాయాలనుకుంటున్నాను....
ముందుగా రాయబోయేది కాలెండర్‌ అనే పదం గురించి... "కాలెండర్‌"...అనే ఇంగ్లీషు పదం "kalendae" అనే లాటిన్‌ నుండి వచ్చిందని వికీపీడియా వ్యాసంలో ఉంది. నేను పైన చదివిన పత్రికల్లో దీని గురించిన ప్రస్తావన వచ్చింది. అసలీ "కాలెండర్‌"..కి మూలం "కాలంధర"..అనే సంస్కృత పదం..! కాలంధర అంటే, కాలాన్ని ధరించునది అని అర్థం.. అంటే కాలెండర్‌ని మనం ఏ విధంగా డిఫైన్‌ చేయవచ్చంటే , కాలాన్ని ధరించే ఒక కాగితం ముక్కగా..!
ఆంధ్రభూమిలో ఒక వ్యాసంలోని భాగం యధాతధంగా కాపీ చేస్తున్నాను...ఇక్కడ చూడండి..


// మీకో విషయం తెలుసా? మనం వినియోగిస్తున్న ఇప్పటి ఇంగ్లీష్ ‘గ్రెగోరియన్’ క్యాలెండర్‌కు పూర్వం అంటే క్రీ.శ.1739 సంవత్సరానికి పూర్వం, పాశ్చాత్యులు కూడా మార్చి ‘25వ తేదీనే- నూతన సంవత్సర ప్రారంభంగా చేసుకునేవారు. దానిని, తర్వాత జనవరి ఒకటికి మార్చుకున్నారు. మార్చి 25 అనే తేదీ, నిజానికి మన ఉగాదికి దగ్గరగా వుండేది. ‘వారం’అంటే ‘పర్యాయం’ అనే అర్థం వుంది. ‘స్మరవారం వారం’ అంటే పర్యాయాలుగా తలుచుకోవడం. ‘వబయోరభేదః’ అని, ‘వ’ని ‘బ’గా సూచించడం వుంది. అప్పుడు- మార్చి వారికీ సంవత్సరాది కనుక, అక్కడనుండి సప్తమ పర్యాయం అంటే సప్తమవారం- ‘సెప్టెంబర్’గా, అష్టమ వారం అష్టబార్ అనేది ‘అక్టోబర్’గా, నవమ అనగా 9వ నెల ‘నవంబర్’గా, దశమవారం 10వ నెల డిసెంబర్- డిసెంబర్’గా పేర్కొనబడేదన్నమాట! జనవరిని కొత్త సంవత్సరం చేసుకున్నాక- సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9,10,11,12 నెలలుగా మారినా, వారు పేర్లు మార్చుకోలేకపోయారని మాన్యులు తెలకపల్లె విశ్వనాధశర్మగారు కాలంధర విజ్ఞానం గురించి చెబుతూ పంచాంగం ప్రాముఖ్యం గురించిన వ్యాసంలో పేర్కొన్నారు.//
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, ప్రపంచానికి కాలగణన నేర్పింది భారతీయులేనని కూడా అనిపించకమానదు. దానికి సంబంధించిన విషయం పైన కాపీ చేసిన పేరాలో ఉంది. దానికి ఇంకోటి జత చేయబోతున్నాను. "ఆగస్టు" ఒకప్పుడు "Sextilis"..అని పిలవబడేదట...వికీపీడియాలోని ఈ వ్యాసంలో చూడొచ్చు... ఈ పదం మన సంస్కృతంలోని "షష్టి.."..అనే శబ్దానికి దగ్గరగా ఉందనే నాకనిపిస్తోంది..

ఇంక మార్చి 25 ఒకప్పటి సంవత్సరాది అని చెప్పడానికి ఇంకో ఋజువు ఏంటంటే.., ఆ "కాలెండర్‌"లోని అఖరి నెల అయిన ఫిబ్రవరికే సవరణలు జరుగుతూ ఉంటాయి..అంటే సాధారణంగా 28 రోజులు ఉండి, లీపు సంవత్సరంలో 29 రోజులు ఉండడం. ప్రతీ వందేళ్లకొకసారి అది ఉండకపోవడం..అందులోనూ ప్రతీ నాలుగొందల సంవత్సరాలకీ మళ్లీ ఉండడంలాంటివన్నమాట..అంటే 2000 లీప్‌ సంవత్సరం, 1900, 2100, 2200. 2300 లీప్‌ సంవత్సరాలు కాదు..మళ్లీ 2400 లీప్‌ సంవత్సరం అన్నమాట..ఇదంతా వేరే గొడవ..!
ఇంక సురేష్‌గారు ప్రస్తావించిన హోర దగ్గరకి వద్దాం..! దీని గురించి నాకన్నా పంచాంగ కర్తలు బాగా చెబుతారు.. అయినా నాకు తెలిసిన దాన్ని రాద్దామనుకుంటున్నాను.. మన కంటికి కనిపించే గ్రహాలు తొమ్మిది. ఇవి నిజానికి భూమిచుట్టూ తిరగకపోయినా సాపేక్షంగా తిరుగుతున్నట్టే జ్యోతిష్కులు లెక్కలోకి వేసుకుంటారు. ఇవి మనకు తెల్సినవే.. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు...! రాహువు, కేతువు ఛాయాగ్రహాలు, భౌతిక పదార్థంగా లేవు కాబట్టి లెక్కలో రావు.. ఇంక మిగిలిన ఏడు గ్రహాలనే "హోర" చక్రంలో తీసుకున్నారు మన పూర్వీకులు. ఈ ఏడు గ్రహాలూ ఒక చక్రంలో ఒక "హోర" కాలం (అంటే ఒక గంట సేపు)..భూమి మీద ప్రభావం చూపిస్తాయని నమ్మిక..ఈ హోరాచక్రం అలా రిపీట్‌ అవుతూనే ఉంటుంది...
దీని గురించిన చక్కని వివరణ సత్యనారాయణశర్మ గారి బ్లాగులో ఉంది.. దాని లింక్‌ ఇదిగో...

 సూర్యోదయం అయ్యే సమయంలో, ఏ గ్రహప్రభావమైతే భూమిమీద ఉంటుందో, ఆ రోజుని, ఆ వారంగా పరిగణిస్తారు. సూర్యోదయ సమయంలో, ఆదివారం సూర్యుడి ప్రభావం ఉంటుంది, సోమవారం చంద్రుడి ప్రభావం..ఇలా అన్నమాట...! కనుకనే మనకి వారంలో ఏడు రోజులున్నాయి... సన్‌డే, మన్‌డే, ట్యూస్‌డే,వెన్స్‌ డే..ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్న ఏడు గ్రహాల లాటిన్‌ రూపాలే..! వాటి లిస్ట్‌ కింద రాసాను
 


sunday........... ఆదివారం.... సూర్యుడు...sun
monday.........సోమవారం.....చంద్రుడు...moon
tuesday........మంగళవారం....కుజుడు...mars
wednesday.....బుధవారం.....బుధుడు...mercury
thursday.......గురువారం....బృహస్పతి..jupiter
friday..............శుక్రవారం.....శుక్రుడు..venus
saturday.........శనివారం.........శని...saturn
ఇంగ్లీషులో వారాలపేర్ల గురించి,అయా గ్రహాల లాటిన్‌ పేర్ల గురించి ఆయా వికీపీడియా వ్యాసాల్లో అందుబాటలో ఉన్నాయి.. ఇకపోతే, మన జ్యోతిషశాస్త్రం అంతా ఉజ్జయినీ నగరాన్ని ప్రామాణికంగా తీసుకుని గణింపబడిందని విన్నాను.. విజ్ఞలు దీనిపై పరిశోధనలు కూడా చెయ్యొచ్చు..! పనిలో పనిగా మధ్యలో మా కాకినాడ గురించి డబ్బా కొట్టుకోవలసిన విషయం ఒకటుంది..! భారత ప్రామాణిక రేఖాంశం 82 1/2 ..కాకినాడ చాలా దగ్గరనుండే పోతుంది.. అంటే, మా కాకినాడ టైంనే..భారతదేశం మొత్తం వాడుతోందన్నమాట..!
రోజుకు 24 గంటలనే కాన్సెప్ట్‌ కూడా భారతీయులదే..! అది హోరలకి సంబంధించినదేగా మరి..! ఆదివారం సర్యోదయం నాడు సూర్యుడితో మొదలైన హోరాచక్రం..మళ్ళీ ఆదివారం సూర్యోదయం వరకూ ఉంటుందన్నమాట..! అందుకే మన భారతీయుల వారం ర్యోదయంతో మొదలై మరుసటిరోజు సూర్యోదయం వరకూ ఉంటుంది.. రోజు మారడమనేది సూర్యోదయం మీదే ఆధారపడి ఉంది. అందరూ అనుకుంటునట్టు అర్థరాత్రి 12 గంటలకి వారం మారదు..!
సందర్భం కాకపోయినా, ఈ విషయం రాయాలనిపిస్తోంది.. అదేంటంటే, మన పురాణాల్లో యవనులు కూడా భారతీయులేనని ఉంది. వీళ్లే, ఆ తర్వాత, గ్రీస్‌ ప్రాంతాన్ని, ఇటలీ ప్రాంతాన్ని ఆక్రమించారని ఉంటుంది. వాళ్లు అక్కడ నిర్మించుకున్న నగరం పేరు "రామ నగరమని..".. వాళ్లని రామకులని..పిలవడం జరిగింది.. అదే రోమ్‌ అనీ.., వాళ్లు రోమన్స్‌ అనీ, ఎక్కడో చదివాను.. (ఇక్కడింకో విషయం.., ఈ లెక్క ప్రకారం సోనియా గాంధీ కూడా భారతీయురాలే..!బిజెపి వాళ్లూ, ఆరెస్సెస్‌వాళ్లూ అనే "విదేశీ"..పదం తప్పన్నమాట..!). ఈ వాదాన్ని మాక్స్‌ ముల్లర్‌ పేర్లు కలవడం లేదనీ, అదనీ, ఇదనీ,, చాలా సిల్లీ వాదాలతో కొట్టిపారేసాడని గుర్తు.. అయితే, పూర్తిగా తెలీదు..! సంస్కృతానికీ, లాటిన్‌కీ ఉన్న సంబంధం ఇక్కడే ఉందని, నా అభిప్రాయం...!

6 కామెంట్‌లు:

  1. అద్భుతమైన పోస్ట్. కానీ కుడివైపున కొంత భాగం కనిపించడంలేదు కొంచెం సరి చేయగలరు.

    మాధురి.

    రిప్లయితొలగించండి
  2. నిజమేనండీ..! సరిచేయడం ఎలాగో అర్థం కావట్లేదు.. అందుకే అలాగే ఉంచేసాను.. నా పోస్ట్‌ మెచ్చినందుకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  3. సంస్కృతం, పార్సీ,లాటిన్ ,గ్రీకు భాషల్ని ఇండొ-యూరొపియన్ భాషలని అంటారు.వీటికి మూలభాష ఉండేదని,తెగలుగా కొందరు భారత్కి ,కొందరు పర్షియాకి ,మరికొందరు యూరప్కి వలసవెళ్ళగా,కాలక్రమాన ఆ భాషలు మారుతూ వృద్ధి చెందాయని చరిత్రకారుల ,భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయము.అందుకే సంస్కృతం కి లాటింకి చ్టాలా పదసామ్యము ,సారూప్యము ఉంటుంది.ఎవరి మట్టుకు వాళ్ళు మాదే ప్రాచీన భాష ,నాగరకత ,అని claim చేస్తా రనుకొండి.ఈ విషయంలో ఇంకా చాలా పరిశోధనలు జరగవలసి ఉంది.హోర, అవర్, అష్ట ,అక్టో ,దశ ,డెకా వంటి వందల పదాలు చూపించవచ్చును. రమణారావు.ముద్దు

    రిప్లయితొలగించండి
  4. రమణారావు గారూ..! నమస్కారం..
    నా బ్లాగుని సందర్శించినందుకు ధన్యవాదాలు..! మీరన్నట్టు సంస్కృతం, లాటిన్‌లలో పోలికలుండే పదాలు వందలకొద్దీ చూపించవచ్చనే నా అభిప్రాయం కూడా..! అయితే, ఈ సారూప్యత భాషకే పరిమితం కాలేదనే నేను అనుకుంటున్నాను.. ప్రాచీన రోమనుల కాలనిర్ణయం, భారతీయుల పద్ధతినే పోలి ఉందని నా ఉద్దేశ్యం.. మీరన్నట్టు ఈ దిశలో చాలా పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది. కానీ, మన చదువులు అందుకు అంగీకరించడం లేదేమోని నా అనుమానం...! మీరేమంటారు..?

    రిప్లయితొలగించండి
  5. శర్మగారు, చాల చక్కగా వ్రాసారు. నాకు బాగా నచ్చిన పదం "కాలంధర". మీ బ్లాగు ఎంతో విజ్ఞానదాయకంగా వుంది. హోర ప్రయోగం "హోరాహోరీ పోరాడారు" అన్న సందర్భంలో ఏమయి వుంటుంది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'అహోరాత్ర' నుంచి మధ్య అక్షరాలు సంకేతపదంగా 'హోరా' అన్నారని చదివాను. మీరన్నాట్టు 'హోరా హోరీ' అంటే అహోరాత్రాలు విశ్రాంతి లేకుండా అని అర్థం ఉండొచ్చు

      తొలగించండి