27, జులై 2011, బుధవారం

పోయినచోటే తిరిగి వెతుక్కుద్దాం..!


ఈ పోస్ట్‌ మొదలుపెట్టింది ఆంధ్రభూమి ఎంవీఆర్‌ శాస్త్రిగారి "ఆంధ్రుల కథ"ని చదివిన తర్వాత... మనవాళ్లు అనుకున్న తెలుగువారెందరో మన తెలుగుజాతికి తెలిసో తెలియకో ఎంత ద్రోహం చేసారో చాలా బాగా వివరించారు. మా తరంలో (అంటే సుమారు 15-25 ఏళ్ళవాళ్ళం) నాతో సహా చాలామంది మొన్నమొన్నటి వరకు తెలుగువాళ్ళంటే "ఆంధ్రప్రదేశ్‌"కి మాత్రమే పరిమితమనుకునేవాళ్ళం. ఎవరో కొద్దిమంది మద్రాస్‌లోనూ, తమిళనాడులోనూ ఉండేవాళ్ళు తప్ప.

తెలంగాణ ,సమైక్యాంధ్ర ఉద్యమాలు పోటాపోటీగా జరుగుతున్న ఈరోజుల్లో ఎక్కువమంది గమనించని కొన్ని కదలికలు ఉన్నాయి. నేను దానిగురించి ప్రస్తావించేందుకే ఈ పోస్ట్‌ రాస్తున్నాను. ఈ అన్ని కదలికలకి కారణం మాత్రం ఒక్కటే..! తెలుగువాళ్ళకి, తెలుగుభాషకి స్వతంత్రభారతదేశంలో, ముఖ్యంగా కాంగ్రెస్‌ పాలనలో విపరీతమైన అన్యాయం జరగడం. దాన్ని మనం ఇప్పటికీ చూస్తున్నాం. మన నీళ్ళను, మన ప్రాజెక్టులను ఆపుచేయడం; మన కాకినాడ గ్యాస్‌ను మనకి దక్కనివ్వకపోవడం; రైల్వే బడ్జెట్‌..ఇలాంటివి ప్రస్తుతం జరుగుతున్నవి. ఇంతకు ముందు జరిగినవైతే మద్రాసు, కంచి,బళ్ళారి,కోలారు, బరంపురం తదితర అచ్చతెలుగు పట్టణాలని మనకి కాకుండా చేయడం.

పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహారదీక్ష చేసింది మద్రాస్‌ రాజధానిగా ఉన్న ఆంధ్రరాష్ట్రంకోసం...! మద్రాసులేని ఆంధ్రరాష్ట్రం తలలేని మొండెంలాంటిదన్నది ఆయనమాటే..! దాన్నే మన కేసీఆర్‌ హైదరాబాద్‌కి, తెలంగాణకి వాడుతున్నాడు. అది వేరే విషయం. ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం ఏంటంటే పొట్టి శ్రీరాములు పుట్టింది మద్రాసులోనైతే ఆయన పేరు పెట్టింది నెల్లూరు జిల్లాకి. ఆయనకి నెల్లూరుతో ఉన్న సంబంధంకన్నా మద్రాసుతో ఉన్న సంబంధమే ఎక్కువ. నేను చెబుతున్నది ఏంటంటే మద్రాసు అప్పటికీ, ఇప్పటికీ కూడా తెలుగు పట్టణమే..! ఆ మాటకొస్తే తమిళనాడు అనే పేరే హాస్యాస్పదం. ఎందుకంటే ఇప్పటికీ తమిళనాడులో 42శాతం తెలుగువాళ్ళే..(గవర్నమెంట్‌ లెక్కల ప్రకారం 8-10శాతం!). కానీ వాళ్ళు వివిధ సౌలభ్యాలకోసం తమ మాతృభాష తమిళమని రాస్తున్నారు. ఉదాహరణకి కోయంబత్తూరులో ఉన్న 16లక్షల జనాభాలో 6 లక్షల మంది కమ్మనాయుళ్ళేనని (అందుకే మొన్న తమిళనాడు ఎలక్షన్లకి మన చంద్రబాబు ప్రచారానికి వెళ్ళాడు..AIADMK తరుఫున ) మొన్నామధ్య నా కోయంబత్తూరు ఫ్రెండ్‌ చెప్పాడు. వాళ్ళే అంతమంది ఉంటే మాల,మాదిగలని కూడా కలిపితే తెలుగు జనాభా ఎంతుంటుందో మనం ఊహించవచ్చు. నాయర్లూ, నాయకర్లూ, పిళ్లైలూ,అయ్యర్లూ ఇలా చాలామంది తెలుగువాళ్ళేనని తెలుసుకోవడానికి మనకి ఎంతో సమయం పట్టదు. తమిళనాట తెలుగువారిలో ప్రముఖులు చక్రవర్తుల రాజగోపాలాచారి, పెరియార్‌, ఆన్నాదొర(రై), రామస్వామి రెడ్డి(యార్‌), కరుణానిధి(?), వైగో, విజయ్‌కాంత్‌, విక్రమ్‌, శ్రీదేవి..ఇలా చాలామందే ఉన్నారు. కానీ గవర్నమెంట్‌ దృష్టిలో వాళ్ళందరూ తమిళులే..!

ఈ ఉద్యమాలు ఉదృతంగా జరుగుతున్న సమయంలోనే సాక్షి పత్రికలో ఓ వ్యాసం వచ్చింది. దాన్ని రాసింది తమిళనాడుకి చెందిన ఓ తెలుగు వ్యక్తి (సదరు వ్యక్తి తమిళనాడు శాసనసభ సభ్యుడు కూడా అనుకుంటా..!). అతను చెప్పింది ఏంటంటే ప్రతీ ఇద్దరు తెలుగువాళ్ళలో ఒక్కరు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారని..! భాషాప్రయుక్తరాష్ట్రాల పేరుచెప్పి తెలుగువాళ్లు తమకితామే చేసుకున్న అన్యాయాన్ని ప్రస్తావించాడు. తమిళనాడులో ఇప్పటికీ తెలుగుకి రెండవ అధికార భాషహోదా కల్పించడానికి తెలుగువాళ్లు కష్టపడుతున్నారు. (ఈ విషయంలో మన స్టేటే బెటర్‌ సుమారుగా 9శాతమే ఉన్న ఉర్దూని రెండవ అధికార భాషగా చేసారు). అక్కడి తెలుగువాళ్ళే కొంతమంది అడ్డుపడుతున్నారు. దానికి ఉదాహరణ కరుణానిధే..!

ఈ ప్రూఫులకి అంతులేదు. ఇకపోతే మన ప్రస్తుత సమస్యలకి మూలమైన ఈ ఉద్యమాలు(తెలంగాణ, సమైక్యాంధ్ర) తెలుగు ప్రజలు తమలోతామే తన్నుకుచావడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే కించిత్తుకూడా మంచి చేయట్లేదు. అందరికీ కావల్సింది హైదరాబాదే..! మాదంటే మాదని కొందరు, కాదు మనదని కొందరు వాదనలు చేస్తున్నారు. ఆంధ్రప్రాంతంలో కొందరు ఇప్పటికే ప్రత్యేకాంధ్రదేశం కూడా కోరేస్తున్నారు. అయితే ఈ కదలిక ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రం విడిపోయిన మరుక్షణమే ఇది బయటపడబోతోంది. కాకపోతే అనైక్యతలో ప్రపంచప్రసిద్ధి పొందిన మన తెలుగుజాతి దాన్ని ఎంతగొప్పగా సాగిస్తుందో మనకి తొందరగానే అర్థమైపోతుంది.!

హైదరాబాద్‌తో తెలంగాణ విడిపొవడం ముమ్మాటికీ మిగిలిన ప్రాంతానికి నష్టమే..! అది తెలంగాణ ప్రాంతవాసులు అర్థంచేసుకువాల్సిందే..! హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టినవాళ్ళలో (సీమ, ఆంధ్ర వాసులు) కనీసం సగం మందైనా వేరేచోటికి షిఫ్ట్‌కావడానికే సిద్ధపడతారు అభద్రతాభావంతో..! ఈ విషయం తెలంగాణవాసులు ఔనన్నా కాదన్నా..మార్చలేని విషయం..(కనీసం ఓ ఇరవై సంవత్సరాల వరకు..!).

ఈ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం...అది పోయినచోటే తిరిగి వెతుక్కోవడం..! అంటే సీమ, ఆంధ్రవాసులు సమైక్యాంధ్రకోసంకాక "మద్రాస్‌"కోసం ఉద్యమించాలి..! దానికి తెలంగాణవాసులు మద్దతు ప్రకటించాలి.! అంటే.."మద్రాస్‌ మనదే..!" ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించడం. బహుశా ప్రస్తుతం, ఇదే మనకి "సర్వరోగనివారిణి". నిజానికి మద్రాసుని సాధించటం ఇప్పటికీ అంత కష్టమైన పనేమీకాదు..! ఎందుకంటే తెలుగువాళ్లు హైదరాబాద్‌ని రాజధానిగా చేసుకున్నా మద్రాసుతో సంబంధాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 80,90ల్లో సీమాంధ్ర ప్రాంతం నుండి మద్రాసుకి పోవలసిన వలస మాత్రమే కొద్దిగా హైదరాబాదుకి షిఫ్ట్‌ అయ్యింది.
మద్రాసులో ఇప్పటికీ 50శాతం తెలుగువారే..ఇంచుమించు అందరికీ తెలుగు మాట్లాడడం వచ్చు...!(కాకపోతే రానట్టు నటిస్తారు..అది వేరే విషయం). తెలుగు చిత్రపరిశ్రమకూడా మొన్నమొన్ననేకదా హైదరాబాదుకి షిఫ్టయ్యింది. (మన సినిమా యాక్టర్లలో చాలా మందికి సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ అన్నా, హౌరా మెయిల్‌ అన్నా చాలా ఇష్టం..దానికి కారణం వేరే చెప్పక్కర్లేదనుకుంటా..!) సాఫ్ట్‌వేర్‌ బూమ్‌ వల్ల తెలుగువారి ప్రభంజనం బెంగుళూరు, ముంబైలతో చెన్నైని కూడా తాకింది. అయితే మద్రాసు నగరం బెంగుళూరంత కాకపోయినా ఇంచుమించు హైదరాబాద్‌ లాగే తెలుగువారిని ఆకర్షిస్తోంది. దానిక్కారణం అది దగ్గర్లో ఉండడం ఒకటైతే, ఒకప్పుడు అచ్చ తెలుగు నగరం కావడం ఇంకో కారణం. బహుశా.. తెలుగువారు హైదరాబాద్‌కన్నా మద్రాసులోనే ఎక్కువుండి ఉండచ్చు. (ఎందుకంటే హైదరాబాదులో సుమారు 45 శాతం ముస్లింలు అంటే ఉర్దూవాళ్లు..లేదా ఉత్తరాదివాళ్లే..!)

నేను ఇక్కడ చెప్పేది..ఏంటంటే..మనం కొట్టుకోవడం మానేసి...న్యాయంగా మనదైన మద్రాసు (ఇతర ప్రాంతాల)కోసం పోరాడుదాం..! పిల్లి, పిల్లి కథ మనకందరికీ తెలుసు..! మన ప్రస్తుత పరిస్థితి అదే..! అందువల్ల మనం వేరే వాళ్లకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే..కలిసి పోరాడాలి..! అప్పుడు హైదరాబాదూ మనదే.! మద్రాసూ మనదే..! ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు..అయితే ఒక రాష్ట్రంగా ఉండచ్చు ..లేదా..విడిపోయినా ఎవరికీ నష్టంలేదు...! ముందు మనలో మనం తన్నుకోవడం ఉండదు..!

ఆఖరిగా నేను చెప్పేదేంటంటే.."మద్రాస్‌ మనదే..!"

సో....! చలో మద్రాస్‌..!

1 కామెంట్‌: