11, జులై 2011, సోమవారం

అనంత సంపద

అనంత పద్మనాభుని అనంత సంపద గతకొద్దికాలంగా, ప్రపంచ మీడియాని ఆకర్షించిన సంగతి అందరికీ తెలిసినదే..! లక్షకోట్లని, ఐదు లక్షల కోట్లని, కోటి కోట్లనీ ఎవరికి తోచిన లెక్కలు వాళ్లు చెప్పేస్తున్నారు. ఈ లెక్కలన్నీ నిజమైనవి కావని చాలామందికి తెలుసు. అసలైన విలువ ఎంతో, సంబంధిత వ్యక్తులుగానీ, వ్యవస్థగానీ అధికారికంగా ప్రకటించే వరకు దేన్నీ నమ్మడానికి లేదు.
ముందుగా లెక్కలు తేలుద్దామని దిగిన సుప్రీం కోర్టు కమిటీవారు, కొంతకాలం ప్రయత్నించి వాళ్ల తరం కాదని తేల్చేసి, మా పని లిస్టు తయారుచెయ్యడం మాత్రమేనని చెప్పేసారు. సో, సుప్రీం కోర్టు లెక్కలు తేల్చమని ఈ కమిటీనే మళ్లీ అదేశించవచ్చు, లేదా ఇంకో కమిటీ వెయ్యవచ్చు లేదా ఆ రాజకుటుంబాన్నే కోరవచ్చు. అయితే, తిరువాన్కూర్‌ రాజకుటుంబం అది దేవుని సంపద అని, తాము ముట్టుకోబోమని ఇప్పటికే చెప్పియున్నారు. వాళ్లు లెక్కలు చెప్తారని ఆశించడకూడదు. బహుశా వారిని ఎవ్వరూ అడగకపోవచ్చు కూడా..! పైగా వాళ్లకి లెక్కపెట్టే ఉద్దేశ్యమే లేదు. ఎందుకంటే, సంపద విషయాన్ని రహస్యంగా ఉంచమని కోరియున్నారు.
ఏది ఏమైనా..భారతజాతి గర్వించే పురావస్తు సంపదను ఇంతకాలం సంరక్షించినందుకు, రహస్యంగా ఉంచినందుకు, అన్నింటికన్నా ముఖ్యంగా తమ స్వంత ప్రయోజనాలకు ఉపయోగించనందుకు వారికి నా వందనాలు.. ఆ దేవాలయం నుండి ధూళి కూడా వెంట తెచ్చుకోకూడదన్న నియమంతో గుడిని దర్శించిన తర్వాత కాళ్లు శుభ్రపరుచుకునే సంప్రదాయాన్ని పాటించడం, అప్పటివాళ్లకు అది అర్థం కాకపోయిన కనీసం మనతరానికి అర్థమైనందుకు సంతోషంగా ఉంది. ఆ రాజకుటుంబం మొత్తానికి, భారతజాతి మొత్తం ఋణపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు..
ఆ సంపదని ఇలా వినియోగించాలని, అలా వినియోగించాలని ఎవరికి వాళ్లు ఐడియాలిచ్చేస్తున్నారు. దాన్ని పురాతత్వ మరియు వారసత్వ సంపదగా గుర్తించిన వారు బహుతక్కువ. వారసత్వం అంటే పెద్దవాళ్లు గడ్డిపరక ఇచ్చినా దాన్ని జాగ్రత్త చేసుకోవలసిందే..! లేకపోతే వారికి మనమిచ్చే విలువ ఏమిటి.?
ఆ సంపదని పేదవాళ్లకి పంచిపెట్టలనే వాళ్లకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను..మీరు అంత పేదవారి పక్షపాతి అయితే మీ సొంతసంపాదన నుండి కొంతమందైనా పేదవాళ్లని చదివించండి..లేదా వాళ్లకి జీవనోపాధి కల్పించండి.. అందుకు డబ్బులు అవసరమైతే మీ అంతట మీరు కష్టపడండి..అంతేకానీ దేవుని సంపద, అందునా వారసత్వ సంపద, మీద దృష్టి పెట్టడం అష్టదరిద్రాలకన్నా ఘోరం.
ఇటువంటివాళ్లందరూ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. బాబా రాందేవ్‌ లెక్కల ప్రకారం సుమారు 400 లక్షల కోట్ల నల్లధనం విదేశాల్లో మూలుగుతోంది. ఆయన లెక్కలు కరెక్టా.? కాదా.? అనే డిస్కషన్‌ ఇక్కడ అనవసరం..ఎందుకంటే..! అంత కాకపోయినా, ఎంతో కొంత నల్లడబ్బు బయటి దేశాల్లో ఉందన్నది అందరికీ తెలుసు. ఆ డబ్బుతో పోలిస్తే పద్మనాభుడి సంపద చాలా తక్కువ. ముందు పోయి నల్ల డబ్బు మీద పడండి..! ఆ ధైర్యంలేకపోతే నోరుమూసుకు కూర్చోండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి