31, జులై 2013, బుధవారం

మొత్తానికి విడగొట్టేసారు.

ఏదో అద్భుతం జరిగితే తప్ప, "తెలంగాణ" రాష్ట్రం ఏర్పడడం దాదాపు ఖాయమని, అందరికీ తెలిసిపోయింది.

ఆంధ్రులకున్న శాపం మరో సారి పనిచేసింది (బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కుమారులైన ఆంధ్రులని మీరెక్కడ ఉన్నా అక్కడనుండి తఱిమివేయబడుదురుగాక అనిచ్చిన శాపం..!)

ఓరుగల్లు, గొల్లకొండ నుండి తఱిమేస్తే అష్టకష్టాలూ పడీ విజయనగరాన్ని నిర్మించుకున్నాం, దాన్నీ కూలగొడితే చెన్నపట్నాన్నీ, కట్టుకున్నాం. అక్కడే "ఆంధ్రా కుక్కలారా 24 గంటల్లో పొండి" అని తంతే కర్నూలుకీ, అక్కడనుండి హైదరాబాదుకీ వచ్చి పడ్డాం. ఇప్పుడు ఎక్కడ పడాలో కూడా తెలీని అయోమయంలో పడ్డాం. కాకపోతే, ఈసారి తన్నింది సాటి తెలుగువాడే అవడం ఒక ఊరట, ఒక ఆవేదన (రెండు విరుద్ధ భావాలూ ఒకేసారి..!)

రాష్ట్రాన్ని విడగొట్టడం అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేయబోతున్న కాంగ్రెస్ పార్టీ "ఆంధ్ర" ప్రాంతాన్ని, అన్నింటికన్నా ముఖ్యంగా "రాయలసీమ" ప్రాంతాన్ని రెండోసారి అన్యాయం చేసింది.

కె.సి.ఆర్ ఎంతవరకూ తెలంగాణ బిడ్డ అనేదే పక్కనబెడితే, తెలుగుజాతి పరువు మొత్తాన్నీ ఢిల్లీ గల్లీల్లో నిలబెట్టిన బిడ్డ అని చెప్పొచ్చు. సాటి తెలుగు వాడికి, వాడి ఆవేదనకీ, వాడి భయానికి కనీసం విలువ ఇవ్వకుండా "ఆంధ్రావాలా భాగో" అనీ, "దొంగలూ, దోపిడీగాళ్ళూ" అనీ నోటితీట తీరేలా, తిడుతూ, తెలుగు జాతి భవిష్యత్తుని ఢిల్లీ పాలకుల చేతుల్లో పెట్టిన ఘనత కె.సి.ఆర్ దే..!

ఇప్పుడు రాయల - ఆంధ్ర ప్రాంతానికి రాజధాని సమస్య, ఉపాధి సమస్య, తాగునీరు, సాగునీరు ఇలాగ చెప్పగలిగేవి, చెప్పలేనివీ బోలెడు సమస్యలు. ఇన్ని సమస్యల మధ్యలో ఈ ప్రాంతమన్నా సమైక్యంగా ఉంటుందనీ ఎవరూ చెప్పలేరు.

రాష్ట్రం విడిపోయినా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతం భవిష్యత్తులో నష్టపోయేవాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని డిమాండ్లను, కోరికలను ఇక్కడ రాస్తున్నాను.

1) భవిష్యత్తులో హైదరాబాదు నుండి తెలంగాణేతరులు ఆంధ్ర కొత్త రాజధానికి తరలేటప్పుడు, ఉద్యోగాలలో, కాంట్రాక్టులలోను, ఉపాధి అవకాశాలలోను తెలంగాణేతరుల స్థానాన్ని కేవలం తెలంగాణ తెలుగువారే భర్తీ చేయాలి. తద్వారా హైదరాబాదు నగరం తెలుగువారి చేయి దాటి పోనివ్వకూడదు. ఎందుకంటే, తెలుగువారిదే అయిన మహానగరం హైదరాబాదు ఒక్కటే.

2) ప్రస్తుత "ఆంధ్ర ప్రదేశ్" లోకసభ స్థానాలు 42, అందులో తెలంగాణవి 17, తక్కినవి తెలంగాణేతర రాష్ట్రానికి చెందినవి. ఈ స్థానాలు 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసికొని జరిపిన నియోజకవర్గాల పునర్విభజన లో వచ్చిన స్థానాలు. 2004 నియోజక వర్గాల పునర్విభజన లో "జనాభా నియంత్రణ పథకాల ఫలితాల మీద ఆధారపడి జనాభా తగ్గిన రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్య తగ్గించకూడద"న్న నిబంధనేర్పాటు చేయించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించకుండా కాపాడగలిగారు, పెద్ద రాష్ట్రాల మూలంగా. నిజానికి 2001 జనాభా లెక్కల ప్రకారమైతే మన రాష్ట్రానికి ఉండాల్సిన లోకసభ సీట్లు 38.
ఉత్తరాదిలో నియంత్రించలేని జనాభా దక్షిణాది కి శాపం కాబోయేది 2034 తర్వాత. 2031 జనాభా అంచనా లెక్కల ప్రకారం, అప్పటి ఆంధ్ర ప్రదేశ్ భౌగోళిక ప్రాంతానికి దక్కబోయే సీట్లు 33 లేదా 34. ఇందులో తెలంగాణ - ఇతర ప్రాంతాలు సగం సగం అనుకున్నా  ఒక్కో ప్రాంతానికి 16 - 17 మించి ప్రాతినిధ్యం ఉండదు. ఈ విషయంలో జరగబోయే అన్యాయాన్ని ఆపడానికి ఈ రెండు అంత పలుకుబడి ఉండే రాష్ట్రాలు అయ్యే అవకాశం తక్కువ.

3) "విశాలాంధ్ర" డిమాండుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉండగా వినిపించని విశాలాంధ్ర వాదులందరూ, ఆంధ్ర ప్రదేశ్ కి అవతల ఉండిపోయిన  9 కోట్ల తెలుగువారందరికీ క్షమాపణలు చెప్పాలి. "విశాలాంధ్ర" వాదం పూర్తిగా విఫలమైపోయిన వాదంగా నిరూపించబడడానికి మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది.

4) ఉద్యమం పేరు చెప్పి తెలంగాణేతరులైన తెలుగువారిని కించపరిచిన వారిని, దూషించినవారినందరినీ కఠినంగా శిక్షించాలి.

5) హైదరాబాదుని దేశానికి రెండో రాజధాని చెయ్యాలి. అయ్యే అవకాశం లేదని తెలిసినా మరో మాట కూడా కలుపుతున్నాను. తెలుగుని దేశానికి రెండో అధికార భాష చెయ్యాలి.

ఇప్పటికివే నాకు తోచిన కోరికలు, డిమాండ్లు.

6 కామెంట్‌లు:

  1. తెలుగుని దేశానికి రెండో అధికారభాష చేయాలి!ఈ మీ మాటతో ఏకీభవిస్తున్నాను!ఉద్యమంలో ఉద్రేకం కలిగించే మాటలు దొరలుతాయి వాటిని సీరియస్ గా తీసుకోకూడదు!అవనీ తాత్కాలికం!మరచిపోవాలి!అందరితరఫున నేను ఇప్పుడు సీమాంధ్ర ప్రజానీకాన్ని క్షమాపణ కోరుతున్నాను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "తెలుగుని దేశానికి రెండో అధికారభాష చేయాలి!"

      అది అయ్యే అవకాశం చాలా చాలా తక్కువలెండి.. కాకుంటే, తెలంగాణ పేరు విన్నప్పుడు తెలుగు అనే ఒక భాష ఉందని తక్కిన భారతీయులకి గుర్తుకొస్తుంది.

      విభజన రగిల్చిన విద్వేషాలు తాత్కాలికమా, శాశ్వతమా అనేది కాలం నిర్ణయించాలి.

      తొలగించండి
  2. yento mee picchi gaani manaki unna prema abhimanalu vaallaki levu kada
    meeru vida gotte saaru ani confirm ai poyarani santoshinche stunnaaru
    andukani pl. confirm cheya kandi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవుననుకోండి..!

      కానీ ఆంధ్రా నాయకులకి అంత సీను లేదు.

      కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి, సమాజ్ వాదీ పార్టీలో చేరి, దాని ద్వారా గెలిస్తే, అవకాశం ఉండొచ్చు.

      తప్పితే తెలంగాణ ని జాతీయస్థాయిలో వ్యతిరేకిస్తున్నవారు తక్కువ అనే అనిపిస్తోంది.

      తొలగించండి
  3. "తెలుగువారిదే అయిన మహానగరం హైదరాబాదు ఒక్కటే"

    హైదరాబాద్ తెలుగు వారి అబ్బ సొత్తు కాదు. వందలాది ఏళ్లుగా తమ "నేటివ్ ప్లేస్" వదులుకొని ఈ మట్టిని నమ్మి తమ వంతు భాగం పోషించిన వారికి హక్కులు లేవంటే ఊరుకోం. కేవలం భాష కోసం నిన్న ఎర్ర బస్సు దిగి వచ్చిన వాడికి ప్రత్యెక హక్కులా?

    "హైదరాబాదుని దేశానికి రెండో రాజధాని చెయ్యాలి"

    దీని వల్ల దేశానికి ఒరిగేదేమిటి? మనకు లాభం వస్తే సరిపోదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగువాళ్లు తప్ప, హై. అందరూ బయటివాళ్ళే.

      //భాష కోసం నిన్న ఎర్ర బస్సు..//
      ఎంత గౌరవమండి, మీకు భాష మీద భాషీయుల మీద

      //దీని వల్ల దేశానికి ఒరిగేదేమిటి?//
      మనకు లాభం వస్తుందని తెలుసు కదా..! ఓ మాట అడగడానికి వచ్చిన ఇబ్బందేమిటి.?

      తొలగించండి