9, జూన్ 2012, శనివారం

తీరు మారితేనే ఎదుగుదల



“ధూమశకట గమనాగమన...” అనేదో అనాల్సొస్తుంది, అందువల్ల ఎందుకొచ్చిన గొడవిదంతా ఉన్నదున్నట్టే పిలిద్దాం, అని రైల్వే స్టేషన్ను తెలుగులో ఏమంటారు, అని అడిగిన ప్రశ్నకి కొంతమందిచ్చిన సమధానం. ఇది పూర్తిగా వెక్కిరింత తప్ప మరొకటేమీ కాదు.  “ధూమశకట గమనాగమన...” అనేది తెలుగు మాట కాదు, సంస్కృత పదం. ప్రతీ చిన్న మాటకీ సంస్కృతంవైపు చూడడం ద్వారా తెలుగునీ, అనవసరమైన గందరగోళాన్ని సృష్టించడం ద్వారా సంస్కృతాన్నీ, అడిగిన తెలుగువాణ్ణి చేసిన వెక్కిరింపు అది. సంస్కృత జన్యపదమే రాయాలని నియమమే పెట్టుకొని ఉంటే Railway Stationకి “శకట స్థావరం” అనో, ఇంకోటో, మరోటో రాసుకోవచ్చు (Stationary Electricityకి స్థావర విద్యుత్ అనే రాస్తున్నాం పాఠశాలల అచ్చు పుస్తకాలలో). పొగబండి (డీసిలుదైయినా, బొగ్గుదైనా) అయితే ధూమశకటమనీ, ఎలక్ట్రికల్ దాన్ని విద్యుత్ శకటమనీ రాసుకోవచ్చు. లేదంటే సులువైన తెలుగే రాయాలనిపిస్తే, “రైలాగే చోటు” అని అందరికీ అర్థమయ్యేలా రాయొచ్చు, లేదా మాండలికాలనుండి ఏరుకొని రావొచ్చు. ఇంతకు ముందు ఇక్కడ వచ్చిన వ్యాసాలలో సూచించినట్టు నిల్తావు (నిలిచే తావు) అనే వాడొచ్చు. కాదు, జనాలు “స్టేషన్” అనే మాటకి అలవాటు పడిపోయారు, అనుకుంటే రైలు స్టేషను అని రాసేసుకుని, రైలునీ, స్టేషనునీ, తెలుగువారు మాత్రమే పలికే “టేసను”నీ నుడిగంటులకి ఎక్కించేసి, అవి తెలుగుమాటలే అని ముద్ర వేసెయ్యొచ్చు. అంతేగానీ తెలుగు అనవసరం అనుకోవక్కర్లేదు. అసలు రైలుబండికి, ధూమశకటమనే పేరు ఎవరు సృష్టించారో అని ఆలోచిస్తే, మన గుర్తుకొచ్చేది బ్రహ్మంగారు. ఆయన కాలఙ్ఞానంలో పొగబళ్ళను ఉద్దేశించి “ధూమశకటం” అంటే, దాన్ని పట్టుకుని, మనదేశానికి రైలుబళ్లు వచ్చిన కొత్తలో బ్రహ్మం గారు చెప్పింది జరిగిపోయిందని, ఉత్సాహంలో “రైలు అంటే ధూమశకటం”అని తెలుగువాళ్లంతా నిర్ణయించేసుకుని అక్కడే ఉండేపోయారు. అక్కడినుండి బయటికి రావట్లేదు. ఇంక, పైన చెప్పుకున్న “టేసను”ని పలికేవాళ్లని చాలామంది వెక్కిరింపుగా చూస్తారుగానీ, అది తెలుగువారికే ప్రత్యేకమైన, సొంతమైన పలుకు అని మనం గుర్తించినపుడువారిని అభినందించక మానం. బహుశా, ప్రపంచం మరెవ్వరూ అలా పలకరు. మరి అట్టాంటి మాటని, “తెలుగు” అనడానికి అభ్యంతరమేంటి.? టేసను అని కొంతమంది తెలుగువారంటున్నట్టే, “ఇస్టేసన్” అని హిందుస్తానీ (హిందీ+ఉర్దూ)వాళ్లు అంటారు. అది వారి పలుకుబడి. టేసను మన పలుకుబడి. అలాగే, రైలు అని మనం అనేదానికి ఇంగ్లీషు మూలం రైలుపట్టాలని ఉద్దేశించినది. మనకి రైలు అనగానే, ఓ ఇంజినూ, వెనక నాల్గు బోగీలు గుర్తొస్తాయి.అంటే Train=రైలు, Rail=పట్టా, ఇదీ మన వాడుక. అందువల్ల తెలుగు రైలు వేరు, ఇంగ్లీషు రైలు వేరు. రైలుబండి అని తెలుగువారు పిలిచినట్టే, “రేల్ గాడీ”అని హిందీవాళ్ళూ పిలుస్తారు. తేడా గమనించారా..? తెలుగువారు ఎక్కాల్సింది “రైలు”, హిందీవారు ఎక్కేది “రేల్”.

“శకటం” అంటే బండి అనే అర్థం వస్తుంది, అది ఎడ్లబండి, గుర్రపు బండి ఏదైనా కావచ్చు కదా, అని కొంతమంది అనొచ్చు. శకటం అనే పదం సృష్టించినప్పుడు దేనికి వాడారో మనకి తెలీదు. మనకి తెలిసిందల్లా “బండి”కి వాడారు, అని. ఆ కాలంలో “బండి” అని అర్థం ఇచ్చే పదం, ఇకపై “రైలుబండి”ని మాత్రమే సూచిస్తుంది. అందులో తప్పేముంది..? కాలంతో ఎన్నో పదాల అర్థాలు మారాయి. ఇప్పుడూ మారుతున్నాయి. అందులో ఇదొకటవుతుంది. ఇప్పుడొస్తున్న కొత్త కొత్త వాహనాలన్నిటికీ శకటం/బండి అనే పేరే పడితే, దేని గురించి మాట్లాడుతున్నామో తెలపాలంటే తాతలు దిగిరావాల్సి ఉంటుంది. దానికి పరిష్కారం పర్యాయపదాల వాడకం. సంస్కృతంలో “శకటం” అనే అర్థానిచ్చే పదాలు చాలానే ఉన్నాయి. శకటాన్ని రైలుబండికొదిలేసి బస్సుకి మరో పదాన్ని ఇరికించొచ్చు. బైక్కీ ఇంకో మాట, కారుకొక మాట, ఇలాగ. అప్పుడు ఆ పదాల వాడకమూ పెరుగుతుంది. ఈ గొడవంతా, సంస్కృత జన్య పదాలు మాత్రమే వాడాలి అని అనుకునేవాళ్ళకి.

Constitution of Indiaని తెలుగు, తమిళ, ఉర్దూ, సంథాలీ భాషలలో తప్ప మిగిలిన అన్ని భారతీయ భాషలలోనూ “భారత సంవిధానం” అనే అంటారు, పలుకుబడిని బట్టి కొద్దిగా తేడాలుంటాయి, అంతే..! తమిళులు, సెందమిళం నుండీ, ఇంగ్లీషు నుండీ పదాలను కూర్చితే, ఉర్దూవారు పారశీకమో, అరబ్బీయో ప్రామాణికంగా తీసుకున్నారు. 
 
సంథాలీ కూడా అదే దారి. మిగిలినవారందరూ సంస్కృతాన్ని ప్రామాణికంగా తీసుకుని “భారత సంవిధానం” అంటూ ఉంటే, తెలుగువారం మాత్రం సంస్కృతాన్ని ప్రామాణికంగా తీసుకుని “భారత రాజ్యాంగం” అంటున్నాం. ఏ తెలుగులాయరో దేశరాజధానికి పోయి అలవాటు ప్రకారం “భారత్ రాజ్యాంగ్”అని అన్నాడనుకోండి, అది అవతలి వాళ్లకి సంస్కృత పాఠం మాత్రమే అవుతుంది, తప్ప వాదన కాదు. “రాజ్యాంగ్” బదులు హిందీలో “సంవిధాన్”అనాలని అతను అప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే, కోర్టు వాదనలు ఇంగ్లీషులోనే ఉంటున్నాయి గనక ఇది ఇబ్బంది కాదేమో..! ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒకే వస్తువుని నుడిగించేటప్పుడు, పైగా ఒకే భాషని దన్నుగా చేసుకున్నప్పుడు కూడా తెలుగువారు, తక్కినవారి కన్నా వేరుగా ఎందుకు ఉంటున్నారు అని. ఇక్కడ, రాజ్యాంగాన్ని మచ్చుక్కి మాత్రమే చూసాం. తరచి చూస్తే, ఇలాంటివి మనకి కోకొల్లలుగా దొరుకుతాయి, Research (తెలుగులో పరిశోధన, హిందీలో “అనుసంధాన్”), Technology (తెలుగులో సాంకేతికత/సాంకేతిక పరిఙ్ఞానం, హిందీలో ప్రౌద్యోగికీ, కన్నడంలో తంత్రఙ్ఞానం), Nation (తెలుగులో జాతి, హిందీలో “రాష్ట్ర్”), State (తెలుగులో రాష్ట్రం, హిందీలో “రాజ్య్”) లాంటివి. తెలుగులో రాష్ట్రానికీ, హిందీలో రాష్ట్రానికీ ఎంత తేడా ఉందో గమనించారా..? నిజానికి వీటి గురించి పుస్తకాలకు పుస్తకాలే రాసుకోవచ్చు. ఈ తేడాలవల్ల ఆయా భాషలకి ఏమౌతుందో గానీ, సంస్కృతానికి మాత్రం నష్టం జరుగుతోంది. ఎందుకంటే, సంస్కృతానికీ, తక్కిన భాషలకీ ఉన్న తేడా మాండలికం/యాస. సంస్కృతానికి యాసాభేదాలు ఉండవు. ఎక్కడివారిదైనా సరే., సంస్కృతం ఉచ్ఛారణ/పలుకుబడి ఒక్కలాగ ఉండి తీరాలి, వేరుగా ఉంటే అది సంస్కృతం అవ్వదు(ట). పైన చెప్పుకున్నట్టు, ఎవరితీరున వారు పదాలు సృష్టించుకుంటూ పోతే, సంస్కృతానికి కూడా మాండలికాలు తయారయ్యి, అసలైన సంస్కృతం అర్థం చేసుకోవడానికి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పదాల విషయంలో, ఎవరి అనువాదం సరైనది, ఎవరిది లోపభూయిష్టమైనది అంటూ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలీదుగానీ, వాడితే ఒకేపేరు వాడడం మంచిది అని మాత్రమే నేను అనేది. సంస్కృతం వాడడం వల్ల భారతదేశం మొత్తం ఒకే పదజాలం వాడుకోవచ్చు అనే ఉద్దేశ్యంలో తప్పులేదు. కానీ సంస్కృతాన్ని వాడడం వల్లన కూడా ఏకరూపత రావడం లేదే..? ఇంకెందుకీ ప్రయోగాలు..? ఇలా, రెంటికీ చెడ్డరేవడి అయ్యేకన్నా, ఆయా భాషలకి మాత్రమే సొంతమైన మాటలని పెట్టుకోవడం మంచిది కదా..! కొత్తవస్తువులకి పేర్లు పెట్టడంలో, సంస్కృతానికి సాంకేతిక భావ వ్యక్తీకరణ సమస్యలేదు. తెలుగుకి లేదా తెలుగువారికి ఆ ఇబ్బంది ఉంది. అందువల్ల, ప్రయోగాలకోసం సంస్కృతం వెంట పడుతున్నారు. దాన్ని దాటడానికి ఇబ్బడిముబ్బడిగా మాటల పుట్టించుకోవలసిన అక్కర ఉంది. ఆ పని, మేధావులు అనే కొద్దిమంది వలన అయ్యేది కాదు. 
 
భాషాభిమానుల దగ్గరనుండీ పామరులు వరకూ అందరూ పాలుపంచుకోవాల్సి ఉంటుంది. అందువలన మేధావులు ఒక్కొక్క పదాన్నీ పట్టుకుని “దీన్ని తెలుగులో ఏమని పిలవచ్చు.?” అని ప్రస్తుతం సాగిస్తున్న (కిందిస్థాయి) చర్చలనుండి బయట పడి, “మాటలని పుట్టించుకునే తీరు”మీద దృష్టిపెట్టాలి. అంటే, ఏదో ఒకటీ అరా మాటలని పుట్టించి జనం మీదికి వదిలే కన్నా, ఆ పుట్టించడానికి వ్యాకరణ, నియమాలు రాసి, తెలుగులో మరీ ముఖ్యంగా అచ్చతెలుగులో నిర్దిష్టమైన “మాటల పుట్టుక తీరు”ని ఏర్పాటు చేసుకుని, నేర్పుకుంటే పాఠాశాలలనుండి కూడా కొంగ్రొత్త తెలుగుమాటలు వెల్లువెత్తుతాయి. అప్పుడు కొత్తమాటలని పుట్టించడానికి ఉద్ధండులే పూనుకోవాల్సిన అక్కర ఉండదు.
 
ఒక భాషలో ఉన్న పదాలకు, మరో భాషలకి తెచ్చే తీరు ఎలా ఉంటుంది తలపోస్తే, చాలా దారులు కనిపిస్తాయి. అయితే, ఆయా దారులు లేదా అడుగులు ప్రాధాన్యతను బట్టి ఉంటాయి. అర్థం చెప్పుకోవడం చాలనిపిస్తే, నుడిగించుకుంటారు. కుదరకపోతే వేరేభాషలకేసి చూస్తారు. అదీ కుదరకపోతే, ఉన్నదుట్టు వాడేస్తారు. అయితే, కొన్ని మాటలకి అర్థం తెలిసినా యధాతథంగా వాడాల్సి ఉంటుంది. ఉదా: నానో, మెగా, జౌల్, కెలోరి వంటి ప్రమాణాలు అన్నమాట. వీటిని నుడిగించడం వల్ల నష్టమే తప్ప లాభమేమీ ఉండదు.
---
(ఈ రోజు ఆంధ్రభూమి నుడిలో పడిన నా వ్యాసం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి