16, జనవరి 2012, సోమవారం

బిజినెస్‌ మేన్‌ సినిమా




ఏదైనా తెలుగు సినిమా ఇన్ని సెంటర్లలో రిలీజైంది, అన్ని సెంటర్లలో రిలీజైంది అని చదివితే ఓహో అనుకుని వదిలెయ్యడమేగానీ, మనకు దగ్గర ఊళ్ళో ఎక్కడైనా వచ్చిందేమోనని ఎప్పుడూ ఆలోచించలేదు, ఎందుకంటే ఇంత దూరంలో తెలుగు సినిమా రిలీజవ్వదని నమ్మకం కాబట్టి..! తెలుగు సినిమా కావాలి అంటే ఢిల్లీకెళ్ళిపోయి చూడ్డమో, లేక అంతర్జాలంలో దొరికితే దింపుకుని చూడ్డం అంతే..! పోనీ ఢిల్లీలో చూద్దామనుకుంటే,  పట్టుమని వారం రోజులు కూడా ఏ ప్రాంతీయ సినిమా ఆడలేదు. (కొన్ని exceptions ఉంటాయిలెండి). అందువల్ల తెలుగు సినిమా ధియేటర్లో చూడ్డం దాదాపుగా అసాధ్యం..మరి సరదాని వదిలేసుకోలేం.., ఇంటికొచ్చి చూసేంతవరకూ వెయిట్‌ చెయ్యలేం..! ఇలాగే ఏడాదిన్నర అయిపొయ్యింది. అటువంటప్పుడు ఒక తెలుగు సినిమా.., అందులోనూ మహేష్‌బాబు - పూరి కాంబినేషన్‌ సినిమా "బిజినెస్‌ మేన్‌".., పక్కనే దెహరాదూన్‌ (Dehradun)లో రిలీజైందంటే చూడకుండా ఎలా ఉండటం..? అందుకే వెళ్ళి చూసొచ్చేశాం..! మరి చూసిన తర్వాత తెలుగు సినిమా(ధియేటర్‌ లో) చూసిన ఆనందం బ్లాగులో రాసుకోకపోతే మనసొప్పదు కదా...! అందుకే ఈ టపా..! నిజం చెప్పాలంటే "రాజకుమారుడు" తర్వాత, నేను ధియేటర్లో చూసిన మొట్టమొదటి మహేష్‌ బాబు సినిమా "బిజినెస్‌ మేన్‌"...!, "పోకిరి", "మురారి" తో సహా అన్నీ టీవీల్లోనో, కంప్యూటర్లోనో చూడ్డమే..!

సినిమా గురించి రివ్యూ రాసేద్దామంటే, పూరి "నేనింతే" సినిమాలోని డైలాగులు అడ్డొస్తున్నాయి..! అయినా, నచ్చినవి నచ్చనవి ఏకరువు పెట్టేద్దామని డిసైడైపోయి కొన్ని రాసేస్తున్నాను., చూస్కోండి.. (తర్వాత నన్ను తిట్టద్దు..!) మహేష్‌ - పూరి కాంబినేషన్‌ లో ఇంతకు ముందొచ్చిన "పోకిరి" బంపర్‌ హిట్‌ కనక, వద్దు వద్దంటున్నా నా బుర్ర "బిజినెస్‌ మేన్‌"ని దానితో కంపేర్‌ చేసేస్తోంది. కాబట్టి ఈ టపా వరకూ సర్దుకుపోండి..!

1) సినిమా మొత్తం మహేష్‌ బాబే కనిపిస్తాడు. ఇది మహేష్‌ బాబుకు సంబంధించినంతవరకూ ఓకే., కానీ కథ మొత్తం హీరోయే అయితే ఎప్పటికైనా మొహం మొత్తేస్తుంది. "దూకుడు" సినిమా హిట్టైనంత మాత్రాన మహేష్‌ బాబే సినిమా మొత్తం ఉండేలా ప్లేన్‌ చేసుకోవడం ఎప్పటికైనా బెడిసికొడుతుంది. అయితే, ఈ సినిమాకింకా ఆ ప్రమాదం లేదు.

2) ఒకటి రెండు పాటలు మినహా ఏ పాటా కూడా సందర్భానికి తగినట్టు అనిపించలేదు. ఆ ఉన్న ఒకట్రెండు కూడా మహ గొప్పగా ఏమీ లేవు. గట్టిగా మాట్లాడితే థమన్‌ "కిక్‌" సినిమాకి మినహా ఇంకదేనికీ మంచి బాణీలు ఇవ్వలేదు (కనీసం సందర్భోచితంగా). "సారొస్తారా" పాటొక్కటే అప్పుడుప్పుడు సరదాగా పాడుకొనేలా ఉంది. ఇంకేవీ జనంలోకి అట్టే గుర్తుండవు. మరి పోకిరి సినిమాలో అన్ని పాటలూ సందర్భోచితంగానే ఉంటాయి..!

3) బ్రహ్మానందం లేకపోవడం అస్సలు నచ్చలేదు. బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా..? ఊహించుకోడానికే కష్టంగా ఉంది.. అలాగే బాధగా కూడా..!

4) డాన్స్‌ లో మహేష్‌బాబు "తండ్రిని మించిన తనయుడు" అనిపించాడు. పాటలు ఎప్పుడు అయిపోతాయా అనిపించింది..చాలా మటుక్కి..!

5) పూరి డైలాగులు అక్కడక్కడా చాలా గట్టిగా పేలాయి.., ధియేటర్లో విజిల్సే., అలాగే కొన్ని డైలాగులు చాలా బాగున్నాయి.., "అశ్వమేధ యాగం" గురించి, అహింస గురించీ ఇలాంటి డైలాగులు లేకపోతే ముందు ముందు అవేమిటో కూడా తెలీని రోజులు వచ్చినా వస్తాయి. కొన్ని డైలాగులు అస్సలు బాగోలేదు.., ముఖ్యంగా మహేష్‌ బాబు మాటిమాటికీ చిటికెన వేలు పైకెత్తి(ఒంటేలు) చూపెట్టడం..., బూతులు మాట్లాడపోయినా (సె న్సార్‌ లో కట్‌ చేసినట్టున్నారు) లిప్‌ మూవ్‌ మెంట్‌ ఇచ్చేసి బీప్‌ సౌండ్లివ్వడం అస్సలు నచ్చలేదు. ఇంట్లోవాళ్లతో సరదాగా చూసే సినిమా అస్సలు కాదు. (అందుకే 'A' సర్టిఫికెట్‌ ఇచ్చారనుకోండి.., అది వేరే విషయం). పూరి కలం పదును తగ్గుతోందనిపిస్తోంది.

6) రెండు గంటల సినిమా అవ్వడం వల్లటైం తెలీలేదు.., విసుగూ రాలేదు.,

7) ఒకదానికొకటి అతకని సీన్లు చాలానే ఉన్నాయి. ప్రకాష్‌రాజ్‌ నాజర్‌ని ఎందుకు చంపించాడో అర్థం కాదు.., అలాగే చివర్లో క్లయిమాక్స్‌ సీన్‌ కూడా అస్సలు ఊహించకుండానే వచ్చేస్తుంది. క్లయిమేక్స్‌ లో మహేష్‌ బాబు డైలాగులూ, నాజర్‌ చచ్చిపోవడం (చంపబడడం) చూస్తే పూరి "బిజినెస్‌ మేన్‌ -2"కి కథని ముందే ప్లాన్‌ చేసుకుని ఉన్నాడనిపిస్తోంది.

8) పూరీ కథ విషయంలో ఇంకా పకడ్బందీ వ్యవహరించాల్సింది. ఉదాహరణకి కాజల్‌ కమీషనర్‌ కూతురు తెలీడం ఫస్ట్‌ హాఫ్‌ లో వేస్ట్‌.! కానీ హీరో మొదట్లోనే చెప్పేస్తాడు "కాజల్‌" వెంట ఎందుకు పడుతున్నానోనని., అందువల్ల అదంతా చప్పగా సాగిపోతుంది. అలాగే బ్రహ్మాజీ కారెక్టర్‌ పూర్తిగా వేస్ట్‌. ధర్మవరపు సుబ్రమణ్యం, సయాజీ షిండే, ఆఖరికి ప్రకాష్‌ రాజ్‌ కూడా ప్రత్యేక పాత్రలాగే అనిపించింది. కానీ "పోకిరి" సినిమాలో వేస్ట్‌ కేరక్టర్లు ఏమీ లేవు.. ప్రతీ డైలాగ్‌ కీ పూరీ న్యాయం చేసాడు స్క్రిఫ్ట్‌ వర్క్‌ తో.., అదిక్కడ మిస్సింగ్‌..!..!

9) మహేష్‌ పెద్ద డాన్‌ అయ్యిన ఫీలింగ్‌ అస్సలు రాలేదు.., ఏమాటకామాటే చెప్పుకోవాలి  ఒక్కసారి రజనీ "భాషా" సినిమా గుర్తు తెచ్చుకోండి. "భాషా"లో రజనీ, "పోకిరి"లో ప్రకాష్‌ రాజ్‌ లతో పోలిస్తే "బిజినెస్‌ మేన్‌" సెకండాఫ్‌లోని మహేష్‌ ...............Donగా Nothing..!


10) చివర్లో మళ్లీ సందేశం ఒకటి....ఒళ్ళు మండడానికి..!

ఇంతకన్నా ఎక్కువ రాయలేను. ఏదియేమైనా 150 రూపాయల టిక్కెట్టు వేస్ట్‌ కాలేదనిపించింది. సో..! ఆల్‌ హేపీస్‌..!
సరే, ఎలాగూ సినిమా గురించి ఇంత రాసేసాను కాబట్టి, పూరీకి, మహేష్‌ కీ, ఇంకా సినిమావాళ్లకీ ఒకట్రెండు ఉచిత సలహాలు పడేద్దామని డిసైడైపొయ్యాను..!

తెలుగు సినిమా అని ఒకటుందని, ఉత్తరాదివారికింకా తెలీడం లేదు.., కానీ "తమిళ" సినిమాకి, తమిళ భాషకి గుర్తింపు ఉంది. కారణాలు అనవసరం..! మార్చడానికి ప్రయత్నించడమే అవసరం..! "మగధీర", "అరుంధతి", "హేపీడేస్‌", "బొమ్మరిల్లు"..ఇంకా చెప్పాలంటే "పోకిరి" మాత్రమే హిందీవాళ్లకి తెలిసున్న (నచ్చిన) తెలుగు సినిమాలు. తమిళ డబ్బింగ్‌ సినిమాలు తెలుగులో ఆడడం ఎంత సాధ్యమో, తెలుగు సినిమాలు హిందీలో డబ్‌ చేస్తే ఆడడం కూడా అంత సులువు.. ఇక్కడ (ఉత్తర భారతం)లో "నమో వేంకటేశ", "నరసింహుడు" లాంటి అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాలు, "లీలామహల్‌ సెంటర్‌" లాంటి ఎప్పుడొచ్చాయో ఎప్పుడెళ్ళిపోయాయో కూడా తెలీని సినిమాలు, హిందీలో డబ్‌ చేస్తే రెండు - మూడూ వారాలు ఆడిన సందర్భాలున్నాయి., తెలుగు డబ్బింగ్‌ (హిందీలో) సినిమాలు టీవీల్లో వస్తే వెర్రోళ్లలగా చూసేవాళ్ళున్నారు. IITలోనైతే మగధీర సినిమా ప్రతీ ఒక్కడి కంప్యూటర్‌ లోనూ కనీసం 30-40 సార్లు ఆడి ఉంటుంది (హిందీలో కూడా కాదు తెలుగులోనే..! కొన్ని సార్లు subtitles కూడా ఉండవు). రాయ్‌పూర్‌, నాగ్‌పూర్‌ లాంటి చోట్ల "పోకిరి" సినిమా తెలుగులో (డబ్బింగ్‌ కూడా కాదు..!) చూసి, దాని హిందీ రీమేక్‌ సల్మాన్‌ "వాంటెడ్‌" సినిమా చూడలేక మధ్యలోనే ధియేటర్లనుండి పరిగెట్టిన హిందీవాళ్ళున్నారు. కానీ వీళ్లందరూ చెప్పుకునేది మాత్రం "సౌతిండియా సినిమా" అని మాత్రమే... తెలుగు సినిమా అని కాదు..!


మన బ్రహ్మానందం, చిరంజీవి అందరికీ తెలుసు.., మహేష్‌ బాబుకి విపరీతమైన ఫేన్స్‌ ఉన్నారు (ముఖ్యంగా యూత్‌ లో..!), అటువంటప్పుడు సరిగ్గా ప్లాన్‌ చేసుకుని తెలుగు సినిమాని హిందీలో డబ్‌ చేసి వదిలేస్తే ఎందుకు ఆడదు..?

మహేష్‌ బాబుకున్న ప్రధానమైన ప్లస్‌ పాయింట్‌, ఇప్పటి కుర్రాళ్లలో ఉన్న సాఫ్ట్‌ రఫ్‌నెస్‌(Soft Roughness) ని కరెక్ట్‌ చూపించడం., అందుకే అతను చాలామందికి (ముఖ్యంగా అమ్మాయిలకి) నచ్చుతున్నాడు. పోకిరి అయినా, ఒక్కడు, మురారి, అతడు, ఖలేజా ఇలా ఏ సినిమా అయినా..! 9 కోట్ల ఆంధ్రుల సైకాలజీ ఎలా ఉంటుందో, మిగిలిన 110 కోట్ల భారతీయుల సైకాలజీ అలాగే ఉంటుంది. ఆంధ్రాలో నచ్చితే దేశం మొత్తం నచ్చుతాడు.. ప్రయత్నం మాత్రం చేయాలి..అంతే..! సరిగ్గా మాట్లాడితే మహేష్‌ స్థాయిలోని వాళ్ళు బాలీవుడ్‌ లో ఎవ్వరూ లేరనిపిస్తుంది., అది షారుఖ్‌ అయినా, సల్మాన్‌ అయినా.., ఇందాక చెప్పానుగా తెలుగు "పోకిరి" చూసినవాళ్లు హిందీ"వాంటెడ్‌" చూడలేక పరిగెట్టేసారని..! కరెక్టుగా ప్రయత్నిస్తే అమితాబ్‌ తర్వాత మహేష్‌ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది.


పూరి జగన్నాథ్‌ విషయంలో నాకొక కథ గుర్తొస్తోంది. ఒక జమీందారు., తన తోటలోని చెట్లు కొట్టించడానికి ఒక పనివాణ్ణి పురమాయించాడట..రోజుకూలీ మీద..! ఈ పనివాడు మొదటి 40 చెట్లు కొట్టేసాడు., రెండో రోజు 20 చెట్లు కొట్టాడట., మూడో రోజు 10, నాలుగో రోజు 5... ఇలా తగ్గిపోతూ ఆఖరికి ఒకరోజు ఒక్క చెట్టూ పూర్తవ్వలేదట.., దాంతో జమీందారికి కోపం వచ్చింది., ఈ పనివాడు బద్ధకంతో పని చెయ్యడం లేదని.., కూలీ ఇవ్వను పొమ్మన్నాడట., ఈ పనివాడు అటువంటిదేమీ లేదు, నిజంగానే కష్టపడ్డానని లబోదిబోమన్నాడు. అటుగా పోతున్న ఒక మేస్టారు ఈ తతంగమంతా చూసి వాళ్ల మధ్య గొడవ తీర్చడానికొచ్చి., తేల్చినదేంటంటే, పనివాడు నిజంగానే కష్టపడ్డాడు, కానీ పని మాత్రం జరగడం లేదు., ఎందుకంటే అతనికి పని చేసిన తర్వాత, ఏరోజుకారోజు గొడ్డలికి పదును పెట్టాలని తెలీదని..! ఈ కథ పూరికీ సరిగ్గా సరిపోతుంది..!

దెహరాదూన్‌ లో మూడ్రోజులే ఆడుతుందనుకున్న "బిజినెస్‌ మేన్‌" సినిమాని ఇంకో నాలుగురోజులు కొనసాగిద్దామని ధియేటర్‌ యాజమాన్యం అనుకోవడం కొసమెరుపు...! దాంతో ఇక్కడి తెలుగువాళ్లు పండగ చేసేస్కుంటున్నారు...IITiansతో సహా..!

1 కామెంట్‌: