మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటూ మనం పూజకు ముందు చెప్పుకునే సంకల్పంలో, మనం ఏం ఆశించి పూజ చేయదలుచుకున్నామనేది కూడా చెబుతాం. అందులో, అన్నిటిలోకీ మొదటి కోరిక, క్షేమంగా ఉండడం. భద్రతే ముందు (Safety First) అనే పరిభావన (Concept) మన జీవన విధానంలో కొత్తది కాదనడానికి ఇది ఒక ఉదాహరణ. అయినప్పటికీ, చాలామందిమి ఆ విషయాన్ని మరిచి ఒక్కొక్కసారి పద్ధతులు (SOP) మీరి ప్రవర్తించిన సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. ఈ ప్రమాదాలకు కారణం మన సంకల్ప లోపమో లేక పూజలలో లోపమో అని కొందరు భావిస్తూ ఉండవచ్చు, కానీ వాస్తవానికి ప్రమాదాలకి కారణం మన స్వయంగా చేసే పనులే.
భోపాల్ వాయు విలయం (Bhopal Gas Disaster)
పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను వ్యవస్థీకృతంగా అధ్యయనం చేసినపుడు, ప్రతీ ప్రమాదానికీ (accident) లేదా ప్రమాదకరమైన సందర్భానికీ (dangerous occurrence) ఒకటే కారణం ఉండదనీ, అనేకానేక కారణాలు ఆ సందర్భంలో ఉండడం వల్లనే ప్రమాదాలు జరుగుతాయనీ మనం తెలుసుకుంటాం. ఉదాహరణకు 1984 డిసెంబర్ 3 రాత్రిన జరిగిన భోపాల్ వాయు విలయాన్నే తీసుకుందాం. ఆ రోజు అర్థరాత్రి మిథైల్ ఐసో సైనేట్ (MIC) అనే విషవాయువు గాల్లోకి వ్యాపించి వేలాది మరణాలకు కారణమయ్యింది. ఆ ఘటనకు గల కారణాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే,
1. Carbaryl అనే క్రిమి సంహారకం యొక్క తయారీ ప్రక్రియలో భాగంగా, మధ్యస్థ ఉత్పత్తి (Intermediate Product) గా MIC ఉత్పత్తి చేయబడి, తర్వాతి ప్రక్రియల్లో పూర్తిగా వినియోగింపబడేది. అయితే, ఈ Carbaryl అనే అంత్య ఉత్పత్తి (క్రిమి సంహారకం) యొక్క తయారీలో మధ్యస్థ ఉత్పత్తిగా MIC తయారయ్యే ప్రక్రియా విధానానికి ప్రత్యామ్నాయంగా (Substitution) సురక్షితమైన ఇతర ప్రక్రియా విధానాలను అన్వేషించలేదు.
2. ఈ MIC ని వినియోగించుకునే దిగువ ప్రక్రియా విభాగం (Downstream Department) స్థానిక కార్మిక యాజమాన్య వివాదాల కారణంగా ఆపుచేయబడి ఉండడం వలన పెద్ద మొత్తంలో MIC నిలువచేయబడి ఉండింది.
3. 30టన్నుల సామర్థ్యం కలగి, MICని 00 C వద్ద ఉంచవలసిన శీతలీకరణ వ్యవస్థ “ఖర్చు తగ్గింపు చర్య”ల్లో భాగంగా 1984 జూన్ నుండి ఆపుచేయబడి ఉంది. అందువల్ల భద్రతారహితమైన 15-200 C వద్ద MIC నిల్వచేయబడి ఉండింది.
4. ఈ MIC ట్యాంకుల్లోకి ఏదో కారణం చేత నీరు చేరటం వల్ల MIC మరియు నీటి మధ్య జరిగే ఉష్ణమోచక చర్య (Exothermic Reaction) వల్ల ట్యాంకులోపల ఉష్ణోగ్రత పెరిగి, MIC వాయుస్థితిలోనికి మారిపోవడం వలన ట్యాంకులోని పీడనం విపరీతంగా పెరిగిపోవడంతో ట్యాంకు యొక్క భద్రతా కవాటం (Safety Valve) తెరుచుకుని MIC వాయువు విడుదల అయింది.
5. బయటకు పోతున్న వాయువుని తటస్థీకరించడానికి ఉద్దేశించిన Vent gas Scrubber మరమ్మత్తులలో (Maintenance) ఉంది.
6. అలాగే, ఆ వాయువుని సురక్షితంగా కాల్చివేయవలసిన జ్వలన గోపురం (Flare Tower) గొట్టాలు తుప్పు పట్టడం మరియు మార్చకపోవడం వలన అక్కరకు రాకుండా పోయింది.
7. అంతేగాక, కర్మాగారానికి అతిచేరువలో కార్మికుల నివాసాలు ఏర్పరుచుకోవడంతో స్థానిక జనావాసం పెరగడం కూడా మృతుల సంఖ్య చాలా ఎక్కువ అయ్యేందుకు కారణమయ్యింది.
పైన పేర్కొన్న కారణాలలో ఏ ఒక్క కారణాన్నైనా, ఆ యూనియన్ కార్బైడ్ సంస్థ లేదా ఆ సంస్థలోని వ్యక్తులు తమ పురోగామి చర్యలు (proactive actions) ద్వారా అడ్డుకుని ఉండిన పక్షంలో ఆ ప్రమాదపు తీవ్రత చాలా తగ్గి ఉండేది లేదా ఈ దుర్ఘటన పూర్తిగా అదుపుచేయబడి ఉండేది. పైన పేర్కొన్నవే కాక మరికొన్ని వ్యవస్థాపరమైన, వ్యక్తిగత స్థాయిలలోని తప్పిదాల వల్ల మానవ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకరమైన భోపాల్ దుర్ఘటన జరిగింది.
ప్రమాదాల విశ్లేషణ, నివారణ (Analysis, Prevention of Accidents)
నిజానికి ఇతర పారిశ్రామిక దేశాల్లో జరిగిన, జరుగుతున్న ప్రమాదాలతో పోలిస్తే, భోపాల్ వాయు విలయం మరీ పెద్దదేమీ కాదు. కానీ మానవ చరిత్రలోనే అతి పెద్ద దుర్ఘటనగా నిలిచిపోవడానికి ప్రధానమైన కారణం, భద్రత పట్ల అవగాహనాలోపమే. ఆ సమయంలో మనదేశంలోనే ఎంతో మంది మేధావులకూ, విద్యావంతులకూ, అధికార యంత్రాంగానికీ కూడా భద్రత గురించి సరైన అవగాహన లేదన్న విషయం, ఈ దుర్ఘటనతో తేటతెల్లమయింది.
పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల గురించి, H.W Heinrich, 1930 లో ప్రముఖమైన భద్రతా త్రిభుజం (Safety Trainagle) అనే పరిభావన ద్వారా విశ్లేషించాడు.
కార్యస్థలంలో ఒక భారీ ప్రమాదం జరిగిందంటే అందుకు ముందుగా 29 చిన్నపాటి ప్రమాదాలు సంభవించి ఉంటాయి. 300 వరకూ మనుషులు గాయపడని ప్రమాదాలు సంభవించి ఉంటాయి.
H.W Heinrich సూత్రం ద్వారా భారీ ప్రమాదాలు; చిన్న ప్రమాదాలు; తృటిలో తప్పిన ప్రమాదాలు, భద్రతా రహితమైన పనులూ; పరిస్థితులూ 1:30:300:3000 నిష్పత్తిలో ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అంతేగాక ప్రమాదం జరగడానికి 88 కారణం, అసురక్షితమైన పని చేయాలన్న మానవ నిర్ణయాలేనని కూడా H.W Heinrich యొక్క పరిశోధనలు నిరూపిస్తున్నాయి. మిగిలిన 12 కారణాలలో కూడా 10 అసురక్షిత పరిస్థితులు కారణం కాగా, చివరి 2 మాత్రమే మనిషి చేతుల్లో లేనివి అని మనకు తెలుస్తోంది.
ప్రతీ ప్రమాదానికీ, తక్షణ కారణాలు (Immediate causes), మూల కారణాలు (Root causes) వేర్వేరుగా ఉంటాయి. ప్రమాద దర్యాప్తు (Investigation) చేసినపుడు, ప్రమాదంలోని వివిధ ఘటనల గురించి కూలంకషంగా పరిశీలించి, ఏ ఘటన ఎందుకు జరిగిందనే విశ్లేషణ (Why-Why Analysis) అయ్యిందనే తర్వాతగానీ ఒక నిర్ధారణకు రాకూడదు. ప్రమాదానికి గల మూలకారణాలు గురించి సరైన అవగాహన వచ్చిన తర్వాతనే, ప్రస్తుత ప్రమాదానికి సంబంధించిన దిద్దుబాట్లు (Corrections), భవిష్యత్తులో అటువంటి ప్రమాదం మళ్లీ సంభవించకుండా, దిద్దుబాటు చర్యలు (Corrective Actions) తీసుకోవలసి ఉంటుంది. ప్రమాద కారణాలకై జరిగిన సమగ్ర దర్యాప్తులో ప్రస్తుత ప్రమాదానికి కారణమైన అంశాలే కాక, ఇంతకంటే పెద్దప్రమాదానికి అవకాశం కాగల ఇతర కారణాలు (Other potential causes)ను కూడా గుర్తిస్తే, అటువంటి కారణాలను ముందుగానే నివారించేందుకు ముందుస్తు నివారణచర్యలు (Prevention Actions) సైతం చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అందువల్లనే ప్రమాదాల యొక్క నమోదు (Reporting) మరియు దర్యాప్తు (Investigation) అనేది భద్రతా నిర్వహణలో ఎంతో ముఖ్యం
నియంత్రణాచర్యల క్రమానుగత శ్రేణి (Hierarchy of Controls)
కార్మికుల భద్రత, శ్రేయస్సు, సంస్థ యొక్క ప్రతిష్ట వంటి అంశాలలో భద్రతా నిర్వహణ (Safety Management) యొక్క ప్రాముఖ్యత ఎవరూ కాదనలేనిది. భద్రతా నిర్వహణ పరంగా మాట్లాడుకుంటే సంస్థలో లేదా సంస్థ కార్యకలాపాలలో గల హానులతో వ్యవహరించేటప్పుడు సంస్థాగతంగా చేసే ⁄ చేయగల నియంత్రణా చర్యలను క్రమానుగతశ్రేణితో (Hierarchy of Controls) సూచించడం జరుగుతుంది.
ఈ శ్రేణిలో అన్నిటిలోకీ ఉత్తమమైన నియంత్రణాచర్యగా హాని నిర్మూలన (Elimination of hazard)ను చెప్పవచ్చు. ఆ తర్వాత, ప్రత్యామ్నాయ మార్గాలనూ ⁄ ప్రక్రియలనూ చేపట్టి ఎక్కువ హాని గల పనిని తక్కువ హాని గల పనితో మార్పిడి (substitute) చేయడం, ఉత్తమమైనది. అది అవకాశం లేనపుడు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని కార్మికులకూ, హానికీ మధ్య అవరోధాన్ని (Barrier) ఏర్పరచడం, లేదా తీవ్రత ⁄ సంభావ్యతనూ తగ్గించడం. ఆ అవకాశం లేనపుడు, పరిపాలనా పద్ధతుల ద్వారా మనుషులనూ ⁄ వారి పనులనూ నియంత్రించడం. ఉదాహరణకు, పనికి అనుమతి (permit to work), శిక్షణ (training), పని సమయాలపైన నియంత్రణ (restrictions on working times), పని బదిలీ (job rotation) మొదలైనవి. ఆఖరి అవకాశంగా వ్యక్తిగత భద్రతా పరికరాల(PPE)ను వినియోగించేలా చేయడం.
ఈ శ్రేణిలో పైనుండి క్రిందకు వచ్చేకొద్దీ మానవ ప్రమేయం, విచక్షణకు అవకాశం పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంతేగాక, ఏదైనా సంస్థ ⁄ కార్యక్రమంలో హానులను (hazards) కేవలం PPE ద్వారా నియంత్రిస్తున్నట్లయితే, ఆ సంస్థ ⁄ కార్యక్రమం భద్రతాపరంగా అత్యంత లోపభూయిష్టమైనదిగానూ, నిర్మూలన ⁄ ప్రత్యామ్నాయ అన్వేషణ ద్వారా నియంత్రిస్తున్నట్లయితే, ఆ సంస్థ ⁄ కార్యక్రమం భద్రతాపరంగా అత్యుత్తమమైనదిగానూ గ్రహించవచ్చు. ఈ పరిభావన (concept), PPEల కన్నా ఉత్తమమైన పద్ధతులను అవలంభించేందుకు ఉద్దేశించినదే తప్ప, PPEల వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకూ లేదా వ్యతిరేకించేందుకూ కాదు.
ముగింపు
నాణ్యతా నిర్వహణ వ్యవస్థ (Quality Management System) వలె భద్రతా నిర్వహణ వ్యవస్థ కూడా, సంస్థ యొక్క ప్రతిష్టకు మేలు చేసేందుకు ఉద్దేశించినదే. నాణ్యతా నిర్వహణలోని ″ప్రణాళిక రచించు (Plan) – చేయు (Do) – తరచి చూడు (Check) – తగిన మార్పులు చేయు (Act) - PDCA″ అనే సూత్రం భద్రతా నిర్వహణకు కూడా వర్తిస్తుంది. కొంతమంది, భద్రత అనేది పని చేయడానికి అడ్డంకిగా పొరబడతూ ఉంటారు. వాస్తవానికి, చేసే పనినే భద్రంగా ఎలా చేయాలో ఆలోచించుకోవాలి. అలాగే, ఎక్కడికక్కడ సమగ్రపరుచుకుంటూ (Integration) ముందుకు వెళ్లాలి. అప్పుడు మన నిత్యపూజలలో కోరుకుంటున్నట్లు (మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం), వ్యక్తిగతంగానూ, సంస్థపరంగానూ సర్వతోముఖాభివృద్ధి చెందవచ్చు.