బ్రిటీషువారి కాలంలో “ఉత్తరసర్కారులు”గా పిలువబడిన ప్రాంతానికి, మరో పేరు అవసరమని “కళింగ & ఆంధ్ర” అనే పేరుని సూచిస్తున్నాను. ప్రజాస్వామ్యం వచ్చి 60 యేళ్ళ పైబడినప్పటికీ, ఇంకా సామ్రాజ్యాల కాలంనాటి (బ్రిటీషు,నిజాం) భౌగోళిక సరిహద్దులే, రాజకీయాల్లో తీవ్ర అంతరాలను సృష్టిస్తూ ఉండటం, మన దురదృష్టం.
పురాణాలు, చరిత్ర, ప్రస్తుత ఉద్యమాలు :
- తెలుగువారు పూరీ క్షేత్రం నుండీ, కాంచీ క్షేత్రం వరకూ విస్తరించి ఉన్నారని, చెబుతుందో గ్రంథం (పూర్తి వివరాలు అందుబాటులో లేవు).
- ప్రాచీన కళింగ రాజ్యం, ప్రస్తుత ఒరిస్సాలోని చిలుక సరస్సు (Chilka Lake) నుండి, గోదావరి నది ఒడ్డు వఱకు విస్తరించి ఉండేది. దీని రాజధాని, శ్రీముఖ లింగం ( నగరం, కళింగనగరం, కళింగదేశనగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో పిలువబడిన ఈ ఊరు ప్రస్తుతం, శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పుణ్యక్షేత్రంగా మిగిలిపోయింది).
- ప్రస్తుత తెలంగాణ వేర్పాటు ఉద్యమం లో “ఆంధ్రోళ్ళు” అంటూ దుమ్మెత్తిపోసింది, గుంటూరు, కృష్ణా,ఉభయ గోదావరి జిల్లాల వారినని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఈ మూడు – నాలుగు జిల్లాలూ “ఆంధ్ర” పేరుతోనే పిలువబడతాయి. (బహుశా, భవిష్యత్తులో “ఆంధ్ర” పేరుతో పిలువబడబోయేది. కృష్ణా – గోదావరి డెల్టా మాత్రమే). ప్రాచీన కాలంలో రాజధానులు అమరావతి, రాజమహేంద్రి, వేంగి, కొండవీడు మొదలైనవి.
- “కళింగాంధ్ర” అనేది కళింగ – ఆంధ్రలకు ఉమ్మడిగా ఉన్న ప్రాంతం. అది తూర్పుగోదావరి మాత్రమే అవుతుంది. అందుకే, ఉత్తర సర్కారులకి “కళింగ & ఆంధ్ర” అనే పేరుని సూచిస్తున్నాను.
- ఫ్రెంచివారి వద్దనుండి బ్రిటీషువారు స్వాధీనం చేసికొన్న భూభాగం “సర్కార్”(Circars), అర్కాటు నవాబు అప్పగించిన భూమి “పాత నెల్లూరు జిల్లా”(Nellore), నిజాం నవాబు అప్పగించిన భూమి "సీడెడ్”(Ceded) .
- నెల్లూరు, కర్నూలు, గుంటూరులోని భాగాలను కలుపుతూ “ప్రకాశం”జిల్లాని ఏర్పాటుచేసారు. వీటిల్లో గుంటూరు నుండి కలిసిన భాగమే “కళింగ & ఆంధ్ర”లోకి వస్తుంది.
పరిస్థితులు
- వేర్పాటు ఉద్యమం పేరుతో నాయకులు విషం కక్కిన దృష్ట్యా, రాష్ట్రం సమైక్యంగా ఉండటం అస్సలు మంచిది కాదు.
- “ఒకే భాష – ఒకే రాష్ట్రం” అనే నినాదంతో స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తొలి రాష్ట్రం అయినప్పటికీ, “ఒకే సంస్కృతి – ఒకే జాతి”గా ఎదగకపోవడం వలన, ప్రస్తుతం మనకు “కూడికలు, తీసివేతలు” తప్ప ఏమీ మిగలలేదు. మూడు (నాలుగు) ముఖ్య ప్రాంతాల మధ్య గాఢమైన అనుబంధాలు, సంబంధ బాంధవ్యాలూ పెద్దగా పెనవేసుకొనకపోడం కూడా, విభజనకు ఒక ముఖ్య కారణం.
- తెలంగాణ విభజన అనంతరం, 1200 కి.మీ మించి పొడవైన రాష్ట్రంగా "సీమాంధ్ర" స్థిరంగా ఉండటానికి అవకాశాలు చాలా తక్కువ.ఇప్పటికే, రాయలసీమలో గణనీయమైన సంఖ్యలోని వ్యక్తులు ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడాలని కోరుకుంటున్నారు.
- పెన్నేరు, ఇతర నదులు, వాగులు రాయలసీమ జిల్లాలతో బాటు నెల్లూరు, ప్రకాశం(ఒంగోలు మినహా) ప్రాంతాలతో ముడిపడి ఉండటంతోనూ, సీమతో ఉన్న భౌగోళిక దగ్గరితనం వలనా, ఈ ప్రాంతాలు “పెను రాయలసీమ (Greater Rayalaseema)”లో చేరడానికే ఇష్టపడతాయని అనుకుంటున్నాను. అంతేగాకుండా, కొత్తగా ప్రతిపాదించబడిన “దుగ్గరాజపట్నం” పెను ఓడరేవు (Major Port), నౌకానిర్మాణకేంద్రం(Shipyard), రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి. (వీలుంటే, పెనురాయలసీమ గుఱించి ఇటువంటి పోస్టుని వేస్తాను)
1) విశాఖ పట్నం
అనుకూలతలు
- పూర్తిగా అభివృద్ధిచెందిన, త్వరగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న రవాణా వ్యవస్థలు.
- జాతీయంగా, అంతర్జాతీయంగా ఇప్పటికే ఉన్న పేరు.
- శివారు మండలాలు (అనకాపల్లి, పెందుర్తి వంటి)లలో భూ లభ్యత.
- ఛత్తీస్ గఢ్, ఒఢిశాలలోని తెలుగు ప్రాంతాలకి నగరంతో ఉన్న అనుబంధం. తద్వారా, రాష్ట్రం భౌగోళికంగా పెద్దదయ్యే అవకాశం ఉండటం.
- పారిశ్రామిక కాలుష్యం, ఇప్పటికే టాప్ గేర్ లో కలుషితాలని వెదజల్లుతున్న పరిశ్రమలు.
- “కోస్తా ఆంధ్ర” ప్రాంతంలో, భౌగోళికంగా చివరికి ఉండటం.
- చాలా ప్రాజెక్టులకి అడ్డుపుల్లలు వేస్తున్న భారత నావికా దళం.
పెద్ద జనావాసాలు – విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి
రైలు స్టేషన్లు – విశాఖపట్నం, దువ్వాడ, విజయనగరం, అనకాపల్లి
ఓడరేవులు – విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం (భవిష్యత్తు), నక్కపల్లి (భవిష్యత్తు)
విమానాశ్రయాలు – విశాఖపట్నం, “విశాఖపట్నం - కాకినాడ చమురుసీమ”(Visakhapatnam - Kakinada Petroleum Chemical Petrochemicals
Investment Region) అంతర్జాతీయ విమానాశ్రయం (భవిష్యత్తు)
2) విజయవాడ – గుంటూరు – తెనాలి - మంగళగిరి
అనుకూలతలు
- పేరొందిన రోడ్డు, రైలు కూడలి. (రాష్ట్రం విడిపోయిన పక్షంలో అది అనుకూలత అయ్యే అవకాశాలు తక్కువ)
- చాలామంది తెలుగు పారిశ్రామిక వేత్తలకి పుట్టుగడ్డ కావడం.
- మధ్యయుగాలనాటి మహా ఓడరేవు “మచిలీపట్నం” అభివృద్ధి చేస్తే, తూర్పు ముంబయి అయ్యే సంభావ్యత ఉండటం.
- “కోస్తా ఆంధ్ర” ప్రాంత మధ్యలో ఉండటం.
- “కళింగ & ఆంధ్ర” ప్రాంతంలో చివరికి ఉండటం.
- రాజధాని నిర్మాణానికి సేకరించే భూమి “వ్యవసాయ భూమి” కావడం.
పెద్ద జనావాసాలు – విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి
రైలు స్టేషన్లు – విజయవాడ, గుంటూరు, తెనాలి.
ఓడరేవులు – మచిలీపట్నం
విమానాశ్రయాలు – గన్నవరం (విజయవాడ)
3) కాకినాడ - రాజమండ్రి (రాజానగరం – పెద్దాపురం – సామర్లకోట ప్రాంతం)
అనుకూలతలు
- పూర్తిగా అభివృద్ధి చెందిన, త్వరగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న రవాణా వ్యవస్థలు
- వ్యవసాయం జరగని భూమి విస్తారంగా లభ్యమయ్యే అవకాశం.
- “కళింగ & ఆంధ్ర” ప్రాంత మధ్యంలో ఉండటం (+ వివాద రహిత ప్రాంతం అవ్వడం, ఇప్పటివరకూ)
- ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఉపాధి అవకాశాలు.
- “పోలవరం”తో నీటి కొరతకి అవకాశాలు లేకపోవడం.
- అంతగా పేరు లేకపోవడం.
- కొత్తగా నగర నిర్మాణం కావించాల్సిన అవసరం ఉండటం.
పెద్ద జనావాసాలు – కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం – సామర్లకోట జంటపట్నాలు
రైలు స్టేషన్లు – రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ.
ఓడరేవులు – కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ లంగరు రేవు, “విశాఖపట్నం - కాకినాడ చమురుసీమ”ఓడరేవు (భవిష్యత్తు)
విమానాశ్రయాలు – మధురపూడి (రాజమండ్రి), “విశాఖపట్నం- కాకినాడ చమురుసీమ” అంతర్జాతీయ విమానాశ్రయం (భవిష్యత్తు)
ఇవి కాకుండా, తూ.గో.జి – విశాఖ .జిల్లాల సరిహద్దులోని తుని – పాయకరావుపేట సమీపంలోని అటవీ ప్రాంతం, పశ్చిమ గోదావరిజిల్లాలో తాడేపల్లిగూడెం – జంగారెడ్డిగూడెం మధ్యనున్న ప్రాంతాలు కూడా పరిగణించదగ్గవేనని నా ఉద్దేశ్యం. (పోలవరం ప్రాజెక్టు ఎడమ,కుడి కాలువలు అందుబాటులో ఉండటం, వలన నీటి ఎద్దడికి అవకాశాలు తక్కువ)

